విష క్షీర ధార!

ABN , First Publish Date - 2022-01-26T05:18:09+05:30 IST

అదో డెయిరీ సంస్థ.. స్వఛ్చమైన పాలను ఉత్పత్తి చేస్తామంటూ ప్రచారం! చేసేదేమో పాలపౌడర్‌, రసాయనాలు ఉపయోగించి పాలు, పెరుగు, పన్నీర్‌ తయారు చేయడం..

విష క్షీర ధార!
వివిధ బ్రాండ్‌ల పేర్లతో పెరుగు ప్యాకింగ్‌కు వినియోగిస్తున్న బకెట్లు

పాలపొడి, రసాయనాలతో డెయిరీ ఉత్పత్తులు

ప్రముఖ బ్రాండ్ల పేర్లతో పాలు, పెరుగు, పనీర్‌ మార్కెట్లోకి 

సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో వెలుగులోకి కల్తీ దందా

డెయిరీ సంస్థపై దాడులు.. ముడిసరుకు, ఉత్పత్తుల స్వాధీనం

అదుపులో సూపర్‌ వైజర్‌, పరారీలో లీజుదారు


పటాన్‌చెరు, జనవరి 25: అదో డెయిరీ సంస్థ.. స్వఛ్చమైన పాలను ఉత్పత్తి చేస్తామంటూ ప్రచారం! చేసేదేమో పాలపౌడర్‌, రసాయనాలు ఉపయోగించి పాలు, పెరుగు, పన్నీర్‌ తయారు  చేయడం.. ఆ నకిలీ ఉత్పత్తులను ప్రముఖ డెయిరీ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వదిలి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం!! ఇదంతా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో పవిత్ర డెయిరీ అనే సంస్థ నిర్వాకం. మంగళవారం ఉదయం పది గంటలకు పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి నేతృత్వంలో ఆ సంస్థలో సోదాలు నిర్వహించగా దిగ్ర్భాంతికర విషయాలు వెలుగుచూశాయి. మూడేళ్ల క్రితం ఈ డెయిరీని స్థాపించారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి పాలను సేకరించి ప్యాకింగ్‌ చేస్తున్నారు.  కొంత కాలంగా కల్తీ పాల ఉత్పత్తులకు తెరతీశారు. సేకరించిన స్వచ్ఛమైన పాలకు బదులు కల్తీ పాలను తయారు చేయడంపై దృష్టి పెట్టారు. ఇందుకు బస్తాల కొదిఛీ62్ద పాలపొడి, రసాయనాలను నిల్వచేసి పెట్టుకున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో  వాడి పాడేసిన డబ్బాల్లో కల్తీ పెరుగు తయారీ చేయడం కనిపించింది. ఇక్కడ నిత్యం 13వేల లీటర్ల ఉత్పత్తులను అమ్ముతున్నట్లు తెలిసింది. 


 అన్ని బ్రాండ్‌ల పేర్లపై కల్తీ ఉత్పత్తుల ప్యాకింగ్‌

పవిత్ర పేరుతో డెయిరీని నడుపుతూ  తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపించే  హెరిటేజ్‌, విశాఖ, విజయ, వల్లభ, వీఎన్‌ఆర్‌, అముల్‌, వర్ధన్‌, శ్రీచక్ర, నందిని, గోవర్ధన్‌ తదితర బ్రాండ్ల పేరుమీద పాలు, పెరుగు బకెట్లను విక్రయిస్తున్నారు. అసలు కంపనీల ధరలకంటే తక్కువ ధరకు అమ్ముతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో క్యాంటిన్‌లు, క్యాటరింగ్‌ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లకు నిత్యం బల్క్‌గా ఈ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ సంస్థలో విశాఖ బ్రాండ్‌ పేరుతో పెద్ద ఎత్తున పాల ఉత్పత్తులు జరుగుతున్నట్లు కనిపించింది. పాషమైలారంలోని ఉన్న విశాఖ పాల ప్యాకింగ్‌ పరిశ్రమను గతంలో కాలుష్య కారక అంశాలపై పీసీబీ అధికారులు మూసివేశారు. తుది అనుమతులతో రెండు రోజుల క్రితమే తిరిగి పరిశ్రమను ప్రారంభించారు. అంతలోనే పవిత్ర డెయిరీ పరిశ్రమలో కల్తీ పాలు పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. విశాఖ డెయిరీ అనుమతితో ప్యాకింగ్‌ జరుగుతోందా?  లేదా పవిత్ర డెయిరీ విశాఖ బ్రాండ్‌ పేరు మీద కల్తీ పాలను విక్రయిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పవిత్ర పేరుతో రిజిస్టర్‌ అయిన కంపెనీని ఇటీవలే జూబ్లీహిల్స్‌కు చెందిన వెంకటేశ్వరావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసుల దాడితో వెంకటేశ్వరావు జాడలేకుండా పోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. సంస్థలో పనిచేస్తున్న సూపర్‌వైజర్‌ ప్రసాద్‌రావును, ఇతర సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 







Updated Date - 2022-01-26T05:18:09+05:30 IST