కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా టౌన్‌షిప్‌లు

ABN , First Publish Date - 2020-06-30T10:21:17+05:30 IST

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేని పట్టణ పేదల కోసం నిర్మించిన టౌన్‌షిప్‌లు ఒక్కొక్కటిగా కొవిడ్‌ కేంద్రాలుగా మారుతున్నాయి.

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా టౌన్‌షిప్‌లు

నిన్న బొమ్మూరు... నేడు బోడసకుర్రు

ఇక్కడి ఫ్లాట్లలో కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కేటాయింపుపై లబ్ధిదారుల ఆందోళన


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేని పట్టణ పేదల కోసం నిర్మించిన టౌన్‌షిప్‌లు ఒక్కొక్కటిగా కొవిడ్‌ కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరును మార్చగా ఇప్పుడు అల్లవరం మండలం బోడసకుర్రులోని టౌన్‌షిప్‌ను మార్చడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వచ్చే నెల 8న జగన్‌ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు టౌన్‌షిప్‌లో ఫ్లాట్ల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లాట్లన్నింటినీ కొవిడ్‌ సెంటర్‌కు ఉపయోగించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఫ్లాట్ల కోసం ఎంపికైన లబ్ధిదారులను స్ర్కూట్నీ చేసి జాబితాలు సిద్ధం చేసినప్పటికీ ఆ ఫ్లాట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అందని ద్రాక్షగానే మిగలనున్నాయి.


టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు పట్టణాల్లో టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) ద్వారా 25వేలకు పైగానే ఫ్లాట్లను వివిధ దశల్లో నిర్మింపజేశారు. కొన్ని పట్టణాల్లో పనులు ఇప్పటికీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ పథకాలకు సంపూర్ణ గ్రహణం పట్టింది. ఈలోగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం టిడ్కో టౌన్‌షిప్‌లపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా బొమ్మూరులో నిర్మించిన టౌన్‌షిప్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండానే మూడు నెలల క్రితం ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చారు.


కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు బోడసకుర్రులోని టౌన్‌షిప్‌పై అధికారుల దృష్టి పడింది. ఆ ప్రాంతంలో నిర్మించిన 1632 ఫ్లాట్లకు గాను 1400 ఫ్లాట్లను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ), ప్రభుత్వ కార్వంటైన్‌ సెంటర్‌గా మార్చడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ఇక్కడకు తీసుకువచ్చి చికిత్స అందించనున్నారు. తీవ్రమైన కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వ కార్వంటైన్‌ సెంటర్‌గా కూడా దీనిని మార్చనున్నారు. ఇక్కడే కొన్ని పరీక్షా కేంద్రాలు, ల్యాబ్‌లతో పాటు వైద్యులు, ఇతర సిబ్బందికి వసతి సదుపాయాలు కూడా కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ తెలిపారు. ఈ కేంద్రంలో ఎక్స్‌రే, ఈసీజీ, సెల్‌ కౌంటర్‌ వంటి పరికరాలతో ల్యాబ్‌ ఏర్పాటుచేసి కరోనా రోగులను ఆయా గదుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి సేవలు అందించనున్నారు.


కాగా నవరత్నాలు పథకంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన వారిలో తీవ్రమైన వడబోత చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే వీరికి వచ్చే నెల 8న బోడసకుర్రులో ఫ్లాట్లు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఆ టౌన్‌షిప్‌ మొత్తాన్ని కొవిడ్‌ సెంటర్‌గా మార్చిన తీరు లబ్ధిదారులను తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కలెక్టర్‌ సూచన మేరకు ఈ టౌన్‌షిప్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని టిడ్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రీటా వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నచోట ఫ్లాట్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనరు కేవీఆర్‌ఆర్‌ రాజును వివరణ కోరగా... బోడసకుర్రులో 1632 ఫ్లాట్లకు గాను 1400 ఫ్లాట్లను కొవిడ్‌ కేర్‌కు వినియోగిస్తామని, లబ్ధిదారులకు కేటాయింపు జరిగినప్పటికీ స్వాఽధీనం చేసుకునేందుకు అవకాశం ఉండదని వెల్లడించారు. 


Updated Date - 2020-06-30T10:21:17+05:30 IST