ఫ్లైఓవర్‌ వైపే!

ABN , First Publish Date - 2021-10-20T05:36:36+05:30 IST

రణస్థలం వద్ద బైపాస్‌ నిర్మాణం సంగతి అటకెక్కింది. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధానికి నేషనల్‌ హైవే అథారిటీస్‌ అధికారులు తెరదించారు. బైపాస్‌ ప్రతిపాదనలను రద్దుచేశారు. సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగించనున్నారు. రూ.200 కోట్లతో రణస్థలం వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిర్ణయించారు.

ఫ్లైఓవర్‌ వైపే!
రణస్థలం వద్ద జాతీయ రహదారి


రణస్థలంలో నిర్మాణానికి సన్నాహాలు

అటకెక్కిన బైపాస్‌ ప్రతిపాదనలు

టెండర్లకు ఎన్‌హెచ్‌ఏ సిద్ధం

నాడు అశోక్‌గజపతిరాజు కృషితో బైపాస్‌ మంజూరు

2016లో నోటిఫికేషన్‌ జారీ.. భూ సేకరణ

తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం

(రణస్థలం)

రణస్థలం వద్ద బైపాస్‌ నిర్మాణం సంగతి అటకెక్కింది. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధానికి నేషనల్‌ హైవే అథారిటీస్‌ అధికారులు తెరదించారు. బైపాస్‌ ప్రతిపాదనలను రద్దుచేశారు. సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగించనున్నారు. రూ.200 కోట్లతో రణస్థలం వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఎన్‌హెచ్‌ఏ అధికారులు ముందుకు సాగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్‌ నిర్మాణానికి అనుకూలంగా... ఫ్లైఓవర్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంతో రణస్థలం ప్రాభవం కోల్పోతుందని స్థానికులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.   ఫ్లైఓవర్‌ వ్యతిరేక కమిటీని ఏర్పాటుచేసి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల కిందట రణస్థలం మండల కేంద్రంలో దీక్ష శిబిరం ఏర్పాటుచేశారు. కొన్ని రోజుల పాటు శిబిరం కొనసాగినా..టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు సంఘీభావం తెలపడానికి రావడంతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. శిబిరాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీనిపై తీవ్ర దుమారమే రేగింది. 

ఇదీ పరిస్థితి 

రణస్థలం  మండలం దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ సుమారు 3.5 కిలోమీటర్ల బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 2016లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. సుమారు 66 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. రణస్థలంతో నోటిఫికేషన్‌ వెలువడిన ఎచ్చెర్లలో మాత్రం ఐదు కిలోమీటర్ల మేర బైపాస్‌ నిర్మాణం పూర్తయ్యింది. వాస్తవానికి ఎచ్చెర్ల, రణస్థలం బైపాస్‌ నోటిఫికేషన్‌ వెనుక కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కృషి ఉంది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఎడ్యుకేషనల్‌ హబ్‌గా ఉన్న ఎచ్చెర్లను, వ్యాపార, వర్తక కేంద్రంగా ఉన్న రణస్థలంను తప్పిస్తూ బైపాస్‌ నిర్మాణం చేపట్టాలని నాడు అశోక్‌ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి విన్నవించారు. దీంతో వెనువెంటనే నోటిఫికేషన్‌ వెలువడింది. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్‌ నుంచి పాత టోల్‌ప్లాజా వరకూ ఐదు కిలోమీటర్లు, రణస్థలానికి సంబంధించి దన్నానపేట నుంచి రావివలస వరకూ 3.5 కిలోమీటర్ల మేర బైపాస్‌ నిర్మాణం చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రణస్థలానికి సంబంధించి 66 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు కానీ.. నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించలేదు. 

 చిరు వ్యాపారులకు నష్టం

ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడితే చిరు వ్యాపారులు రోడ్డున పడతారు. రణస్థలంలో చిరు వ్యాపారులే అధికం. వారి విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో బైపాస్‌ నిర్మాణానికి పూనుకున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. ఫ్లైఓవర్‌ వ్యతిరేక పోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తుంది.

- కిమిడి కళా వెంకటరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు



1

Updated Date - 2021-10-20T05:36:36+05:30 IST