ఆయిల్‌పామ్‌ దిశగా..

ABN , First Publish Date - 2022-10-03T04:57:17+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగుపై అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటాన్నారు. రైతులు ఈ పంటను సాగు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాలు కురిపిస్తోంది.

ఆయిల్‌పామ్‌ దిశగా..

-వేలాది ఎకరాల్లో సాగుకు అధికారుల కసరత్తు

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ

-ఇప్పటికే 500పైగా దరఖాస్తులు స్వీకరణ 

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 2: జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగుపై అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటాన్నారు. రైతులు ఈ పంటను సాగు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాలు కురిపిస్తోంది. వేలాది ఎకరాల్లో పంట సాగుకోసం అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. సాగుపై రైతులను సన్నద్ధం చేసి వారిని మరింత ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలకు నీరందించేందుకు డ్రిప్‌ అవసరం ఉన్న వారికి 90శాతం సబ్సిడీ అందిస్తున్నారు. మిగిలిన 10శాతం రైతులు పెట్టుబడి  పెట్టాల్సి ఉంటుంది. నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌పామ్‌ సంస్థ ఒక్కో ఎకరాకు రూ.2100, అంతర పంటలకు మరో రూ.2100 ఆర్థిక సాయం అందిస్తోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మ్యాట్రిక్స్‌ ఆయిల్‌పామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. 

జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు..

జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈవార్షిక సంవత్సరంలో 1048ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. హార్టికల్చర్‌శాఖ అధికారులు ఈ సంవత్సరం నుంచే ఆయిల్‌పామ్‌ సాగుపై ఎంపిక చేసిన గ్రామాల్లోకి వెళ్లి రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తదితర విషయాలను వివరిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుతో  రైతులకు ఎలాంటి లాభాలు వస్తున్నాయో వివరిస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ మొక్కలను పెంచేందుకు ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలో వివరిస్తున్నారు. నర్సరీలు, రైతులకు ఒప్పందాలపై వివరిస్తున్నారు. ఆయిల్‌ పామ్‌చేతికి వచ్చాక ఒప్పంద చేసుకొన్న సంస్థ కొనుగోలు చేసి తీసుకెళ్లే విఽఽధానాలను వివరించి రైతులకు ఆదాయం పెంపొందేలా సూచనలు చేస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కోసం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు రైతులను తీసుకెళ్లారు.

జిల్లాలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే ముందడుగు

జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే ఈసాగుపై ముందడుగు పడింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌, దహెగాం, కాగజ్‌నగర్‌ మండలాల్లోని పలువురు రైతులు ఈ పంట సాగుపై ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు కోసం దరఖాస్తులు తీసుకొని వారికి పథకాలను మంజూరు చేస్తున్నారు. ఈస్‌గాం, కోసిని, సాండ్‌గాం, పెంచికల్‌పేట, డబ్బా, ఆసిఫాబాద్‌, రెబ్బెన ఆయా గ్రామాల్లో రైతులు గత సంవత్సరం నుంచే ఈ పంటపై మొగ్గు చూపుతున్నారు. కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), రెబ్బెన, పెంచికల్‌పేటలో ఇప్పటికే ఆయా రైతులు పంటవేశారు. దహెగాంలో నల్లరేగడి భూములున్నాయి. పలుచోట్ల ప్రభుత్వం నుంచి మంజూరు లభించింది. బెజ్జూర్‌, కౌటాల మండలం సాండ్‌గాంలలో 200 ఎకరాల్లో సాగుకు, చింతలమానేపల్లి డబ్బా గ్రామంలో 25ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారు. కొన్ని చోట్ల సాంకేతిక ఇబ్బందులున్నాయి. 

చిన్న,సన్నకారు రైతుల వెనుకంజ

ఈ పంట సాగు చేసేందుకు చిన్న,సన్నకారు రైతులు వెనుకంజ వేస్తున్నారు. పంట దిగుబడికి 4ఏండ్ల సమయం పడుతుండడంతో రైతులు అంతగా ఆసక్తి చూపించడం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. పత్తితో ఏటా ఆదాయం వస్తుందని రైతులు ఆయిల్‌పామ్‌ పంటపై మొగ్గు చూపడం లేదని అంటున్నారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 60:40 శాతంతో సబ్సిడీలు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధుల్లో కొంత ఇబ్బందులున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ ఇతర  చిన్న రైతులకు 90శాతం సబ్సిడీని, ఇతర వర్గాలకు 80శాతం సబ్సిడీని అందిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు ఎకరాకు 57 నుంచి 58మొక్కలు నాటుతున్నారు. దిగుబడి మొదలైన తర్వాత ప్రతీ మూడు నెలలకోసారి క్రాప్‌ వస్తుంది. దీని వలన రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతర పంటలు కూడా వేసుకోవచ్చు.

ఆయిల్‌పాం సాగుపై ప్రత్యేక చర్యలు

-శాంతిప్రియ, కాగజ్‌నగర్‌ ఉద్యానవన అధికారి

ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అశ్వారావు పేటకు తీసుకెళ్లాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు గుర్తించి ఆదర్శ రైతులుగా నిలవాలి. నేషనల్‌ మిషన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌పామ్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఎకరాకు రూ2100, అంతర పంటలకు మరో రూ2100 ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయిల్‌పామ్‌ సాగుకు దరఖాస్తులు చేసుకున్న అందరికీ ప్రయోజనం చేకూరేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. నిధుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేవు.

Updated Date - 2022-10-03T04:57:17+05:30 IST