కట్టడి దిశగా...!

ABN , First Publish Date - 2021-05-05T04:10:41+05:30 IST

రెండో దశ కరోనా వేగంగా విస్తరి స్తోంది. కట్టడి చేసేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా కృషి చేస్తున్నారు. కరోనాకు చెక్‌ పెట్టేందుకు పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు.

కట్టడి దిశగా...!
జిల్లా కేంద్రంలో బంద్‌ కారణంగా మూసి ఉన్న వ్యాపార సంస్థలు

పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్‌

కలిసికట్టుగా కరోనాకు చెక్‌పెట్టే యోచన

ఫలిస్తున్న ప్రజల ప్రయత్నాలు 

క్రమంగా విస్తరిస్తున్న సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

మంచిర్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): రెండో దశ కరోనా వేగంగా విస్తరి స్తోంది. కట్టడి చేసేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా కృషి చేస్తున్నారు. కరోనాకు చెక్‌ పెట్టేందుకు పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. రెండో దశలో కరోనా తీవ్ర రూపం దాల్చగా మరణాల సంఖ్య కూడా అధికంగానే  ఉంటోంది. కొద్దిపాటి లక్షణాలు ఉన్న వారు సైతం నాలుగైదు రోజుల్లో మృత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. రెండో దశలో బాధితులకు ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవరికి వైరస్‌ సోకుతుందో తెలియని పరిస్థితిలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇంటిల్లిపాదిని చుట్టుముట్టి మరీ కరాళ నృత్యం చేస్తోంది. వయోబేధం లేకుండా అన్ని వర్గాల వారికి సోకుతూ ప్రాణాలు హరిస్తోంది.  

మొదటి దశ కరోనా విస్తరణను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు లాక్‌డౌన్‌ విధించి కట్టడి చేయగా ప్రస్తుతం చేతులెత్తేశాయి.  లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటూ కరోనాను నిలువరించే ప్రయత్నాలు ప్రారంభించారు. 5 నుంచి 10 రోజులపాటు ఎక్కడికక్కడే బంద్‌ పాటిస్తున్నారు. 

కలిసికట్టుగా చెక్‌ పెట్టే దిశగా...

ప్రజలు కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నా రు. స్వచ్ఛందంగా బంద్‌ పాటించి వైరస్‌ లింకును కట్‌ చేసేందుకు ప్రయ త్నాలు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లో వ్యాపార వర్గాల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్‌ పాటిస్తున్నారు. మూకుమ్మడి సమావే శాలు ఏర్పాటు చేసి, తీర్మానాలు చేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేలా చర్యలు చేపడతున్నారు. వ్యాధిబారిన పడినవారి అవసరాలు తీరుస్తూ వైరస్‌ కట్టడికి కృషి చేస్తున్నారు. తొలుత పల్లెల్లో ప్రారంభమైన సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ క్రమంగా పట్టణాల్లోకి విస్తరిస్తోంది.

సత్ఫలితాలిస్తున్న స్వచ్ఛంద బంద్‌...

ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ కొంతమేర సత్ఫలితాల ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. దండేపల్లి మండలం మేదరిపేట, దండేపల్లి, తాళ్లపేట, ముత్యంపేట, వెల్గనూరు, గూడెం, ద్వారక గ్రామాల్లో  రెండు వారాలుగా బంద్‌ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలను ఉదయం 6 నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ స్వచ్ఛంద బంద్‌కు వ్యాపారులు ముందుకు వచ్చారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 1 నుంచి సంపూర్ణ బంద్‌కు పిలుపునివ్వడంతో ఐదు రోజులుగా ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ మూసి ఉంచుతున్నారు.  తాండూరు మండలం రేచినిలో లాక్‌డౌన్‌ పాటి స్తున్నారు. 

Updated Date - 2021-05-05T04:10:41+05:30 IST