Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 00:17:39 IST

పర్యాటక కేంద్రం..సమస్యల నిలయం

twitter-iconwatsapp-iconfb-icon
 పర్యాటక కేంద్రం..సమస్యల నిలయం లేక ఇళ్ల మధ్య పారుతున్న మురుగునీరు

 ప్రధాన రహదారిపై పారుతున్న మురుగునీరు

  పట్టించుకోని మునిసిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు 

భూదానపోచంపల్లి, సెప్టెంబరు 22: ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామమైన భూదానపోచంపల్లి మునిసిపాలిటీలో పారిశుధ్యం అస్తవస్తంగా   మారింది. పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండాల్సిన పురవీధులు చెత్త కుప్పలతో స్వాగతం పలుకుతున్నాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీల్లో పూడిక నిండిన కారణంగా కాలువల్లో మురుగు ముందుకు కదలడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పోచంపల్లి నుండి భువనగిరికి వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే చెత్త కుప్పలు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది, విషజ్వరాల బారిన పడుతున్నామని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు. పద్మానగర్‌ వద్ద ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతున్నా.. అటు నుంచి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు అటునుంచి వెళుతున్నా పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కృష్ణాజలాల పైప్‌లైన నుంచి నీరు లీకై రోడ్డుపైకి వరదగా ప్రవహిస్తోంది. ఇక్కడ దుర్గంధం వెజల్లుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని భువనగిరి రోడ్డులోని పర్రె కాల్వ వద్ద చెత్త డంపింగ్‌ చేయకూడదని, మునిసిపల్‌ అధికారులు బోర్డు వేసి హెచ్చరికలు చేసినా, సిబ్బందితోపాటు స్థానికులు సైతం చెత్తను తెచ్చి అక్కడే పారపోస్తుండటంతో గుట్టగుట్టలుగా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మురుగు, చెత్త సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు 

పట్టణంలోని ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారికి డివైడర్‌ సగం వరకే వేశారు. డివైడర్‌ నుంచి ఇరుపక్కలా 33ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులు ప్రారంభించారు. ప్రధాన రహదారిలోని పెద్ద మోరీ వద్ద డ్రైనేజీ కల్వర్టు నిర్మాణానికి కందకం తవ్వారు. దీంతో మంచినీటి పైప్‌లైన ధ్వంసమై పలు వార్డుల్లోని ప్రజలకు మంచినీటి సరఫరా నిలిచిపోయి వారం గడుస్తోంది. ప్రత్యామ్నాయంగా ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే మునిసిపల్‌ అధికారులను మంచినీటికోసం విన్నవించగా వాళ్లు ట్యాంకర్లను పంపి మూసీ చిన్నేటి నుంచి నీళ్లు తెచ్చి ఇళ్లకు ట్యాంకుల ద్వారా అందిస్తున్నారు. అయితే విషపూరిత జలాలను అందించడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.  పట్టణంలోని రహదారిపై అడ్డదిడ్డంగా వేసిన విద్యుత స్తంభాలు ఇబ్బందికరంగా ఉన్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మునిసిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.  

మురుగునీటి నిల్వతో తీవ్ర ఇబ్బందులు 

 పట్టణం మునిసిపాలిటీగా మారిన తర్వాత పారిశుద్ధలోపంతో ఎక్కడ చూసినా దుర్గంధ పూరిత వాతావరణమే ఉంది. పేరుకు ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామం. ప్రధాన రహదారిపై మురుగు పారుతూ నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, సమస్యను పరిష్కరించాలి.

-నల్ల నాగేష్‌, భూదానపోచంపల్లి

 సమస్యల సత్వర పరిష్కారానికి కృషి

ప్రధాన రహదారికి పక్కనే ఏర్పాటు చేసిన వెంచర్‌ వాళ్లు అస్తవ్యస్తంగా ప్లాట్లు ఏర్పాటు చేయడంతో పైనుంచి దిగువకు వృఽథానీరు వచ్చి డ్రైనేజీలోకి చేరి నిండిపోతోంది. దీంతో రోడ్డుపైకి మురుగు ప్రవహిస్తోంది. కృష్ణాజలాల పైప్‌ లైన లీకు కావడంతో రోడ్డుపైకి వరదనీరు వస్తోంది. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ప్రాధాన్య క్రమంలో పట్టణ సమస్యలన్నింటీనీ పరిష్కరిస్తాం. 

-చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన, పోచంపల్లి 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.