పర్యాటక ప్రాంతాలు మూత

ABN , First Publish Date - 2021-05-05T05:16:17+05:30 IST

కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో బుధవారం నుంచి రెండు వారాల పాటు పర్యాటక ప్రాంతాలను పూర్తిగా మూసివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

పర్యాటక ప్రాంతాలు మూత
అరకులోయ గిరిజన మ్యూజియం

నేటి నుంచి రెండు వారాలు అమలు

సందర్శకులను అనుమతించొద్దు: ఐటీడీఏ పీవో


పాడేరు/అరకులోయ టౌన్‌, మే 4: కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో బుధవారం నుంచి రెండు వారాల పాటు పర్యాటక ప్రాంతాలను పూర్తిగా మూసివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, పెదలబుడులోని గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడలోని చాపరాయి, జి.మాడుగులలోని కొత్తపల్లి జలపాతాలు, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు తిలకించేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు.  అయితే ఏజెన్సీలో దాదాపు 700 కరోనా కేసులు నమోదు కాగా, పదహారు మంది వరకూ మృతిచెందారు. ఈ తరుణంలో సందర్శకుల రాకతో ఏజెన్సీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం వుందని అధికారులు గుర్తించారు. దీంతో రానున్న రెండు వారాలు పర్యాటక ప్రాంతాలను పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. ఎవరైనా సందర్శకులు పొరపాటున వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. బుధవారం నుంచి పద్మాపురం గార్డెన్‌కు తాళాలు వేస్తున్నట్టు మేనేజరు బొంజుబాబు తెలిపారు. కార్మికులు మాత్రమే గార్డెన్‌ సంరక్షణ కోసం విధులు నిర్వహిస్తారని స్పష్టంచేశారు. రెండు వారాల పాటు అరకులోయలో సందర్శిత ప్రాంతాలు పూర్తిగా మూతబడి వుంటాయని, పర్యాటకులు అరకులోయకు రావద్దని ఆయన కోరారు.


Updated Date - 2021-05-05T05:16:17+05:30 IST