మెతుకుసీమకు పర్యాటకశోభ

ABN , First Publish Date - 2021-10-27T04:57:41+05:30 IST

మెతుకుసీమకు పర్యాటకశోభ

మెతుకుసీమకు పర్యాటకశోభ
నీటితో కళకళలాడుతున్న గోసముద్రం, పిట్లం చెరువులు

మెదక్‌ ఖిల్లా, ఏడుపాయల దేవస్థానం, 

సీఎ్‌సఐ చర్చి, పోచారం జలాశయాలను కలుపుతూ పర్యాటక సర్కిల్‌ 

జిల్లా కేంద్రంలోని చెరువుల్లో బోటింగ్‌

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే పద్మారెడ్డి


మెదక్‌ మున్సిపాలిటి, అక్టోబరు 26: జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణం పర్యాటక శోభను సంతరించుకుంటున్నది. జిల్లాకేంద్రం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎ్‌సఐ చర్చి, మెదక్‌ కోట, సమీపంలో ఉన్న ఏడుపాయల దేవాలయాలతోపాటు చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలను కలుపుతూ పర్యాటక కారిడార్‌ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికితోడు పట్టణంలో ఉన్న చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషిచేస్తున్నారు. తొలివిడతలో గోసముద్రం, పిట్లం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ. 9.32 కోట్లను మంజూరు చేయించారు. ఇప్పటికే చెరువు కట్టలను విస్తరించి బతుకమ్మఘాట్‌లను నిర్మించారు. ఫుట్‌పాత్‌, గ్రీనరీ త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం చెరువులు నీటితో కళకళలాడుతుండటంతో బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే పర్యాటకశాఖ అధికారులను కోరారు. దీనిపై ఆ శాఖ అధికారులు సర్వే నిర్వహించి చెరువులు బోటింగ్‌కు అనువువుగా ఉన్నట్టు తేల్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. బోటింగ్‌కు అవసరమైన జెట్టి (ఫుట్‌బోర్డ్‌)ను తీసుకొచ్చారు. త్వరలోనే పూణే నుంచి బోటును తీసుకురానున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. 


జిల్లా కేంద్రం చుట్టూ టూరిజం సర్కిల్‌

-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే

జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణం చుట్టూ టూరిజం సర్కిల్‌ ఏర్పాటు చేయబోతున్నాం. పట్టణంలోని నిజాం కాలంనాటి ఖిల్లా, రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల దేవస్థానం, సీఎ్‌సఐ చర్చి, పోచారం జలాశయాలను కలుపుతూ పర్యాటక  సర్కిల్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని చెరువుల్లో బోటింగ్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.



Updated Date - 2021-10-27T04:57:41+05:30 IST