పర్యాటకం జోష్‌.. Vizagలో హోటళ్లన్నీ ఫుల్..

ABN , First Publish Date - 2021-10-19T06:17:17+05:30 IST

పర్యాటకం కళకళలాడుతోంది. నగరంలో హోటళ్లన్నీ నిండిపోయాయి. ఏజెన్సీలో అరకు, అనంతగిరి, లంబసింగి, పాడేరు...ఎక్కడ చూసినా పర్యాటకులే. అక్కడ కూడా కాటేజీలు ఖాళీలు లేవు.

పర్యాటకం జోష్‌.. Vizagలో హోటళ్లన్నీ ఫుల్..

  • ఏజెన్సీలో కాటేజీలు...
  • ఎక్కడ అడిగినా నో రూమ్‌
  • ఈసారి ఒడిశావాసులు ఎక్కువగా రాక
  • గోవా, కేరళకు నగరవాసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పర్యాటకం కళకళలాడుతోంది. నగరంలో హోటళ్లన్నీ నిండిపోయాయి. ఏజెన్సీలో అరకు, అనంతగిరి, లంబసింగి, పాడేరు...ఎక్కడ చూసినా పర్యాటకులే. అక్కడ కూడా కాటేజీలు ఖాళీలు లేవు. రోజూ విశాఖలో సిటీ టూర్‌కు పర్యాటక శాఖ తరపున రెండు బస్సులు తిరుగుతున్నాయి. శని, ఆదివారాల్లో మరో మూడు నుంచి నాలుగు బస్సులు అదనంగా వేస్తున్నారు. అరకులోయకు పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు, ఇన్నోవాలు కూడా పంపుతున్నారు. దసరా నుంచి పర్యాటక సీజన్‌ మొదలై జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా మూడో వేవ్‌ వస్తుందేమోననే తటాపటాయింపు అందరిలోను ఉంది. అయితే కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడం, అంతా వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. జిల్లాకు సర్వసాధారణంగా బెంగాలీలు అధికంగా వస్తారు. అయితే ఈసారి వారి సంఖ్య 20 శాతానికే పరిమితం కాగా ఒడిశా నుంచి ఎక్కువగా తరలి వస్తున్నారు. ఇక విశాఖపట్నం నుంచి ఉద్యోగులు, వ్యాపారులు బయట తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. యువజంటలు గోవా వెళుతుండగా, కుటుంబంతో గడపాలనుకునేవారు కేరళ, గుజరాత్‌లపై ఆసక్తి చూపుతున్నారు. నగరంలోని స్టీల్‌ప్లాంటు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగులు ఎల్‌టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకొని బయటకు వెళుతున్నారు. 


ఐటీ ఉద్యోగులే ఎక్కువ

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు చెందిన ఐటీ ఉద్యోగులు కరోనా తరువాత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి వచ్చేసి ఇంటి దగ్గర నుంచే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పనిచేస్తున్నారు. వీరికి ఇటీవల ఇన్సెంటివ్‌లు ఇచ్చి, ప్యాకేజీలు పెంచడంతో పాటు బయటకు వెళ్లిరావడానికి కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి. దీంతో వీరంతా ఇప్పుడు టూర్లు ప్లాన్‌ చేసుకొని బయటకు వెళుతున్నారు. 


నగరంలో ఫైవ్‌స్టార్‌ హోటళ్లతో పాటు ఇతర స్టార్‌ హోటళ్లలో డిసెంబరు నెలాఖరు వరకు 80 శాతం రూమ్‌లు బుక్‌ అయిపోయాయి. ఇటీవల కాలం వరకు నోవాటెల్‌లోనే రూమ్‌ రెంట్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సాగర్‌నగర్‌లో బీచ్‌ను ఆనుకొని ప్రారంభమైన మరో స్టార్‌ హోటల్‌లో రూమ్‌ రెంట్‌ రూ.16 వేలు కాగా, అక్కడ కూడా రూమ్‌లు ఖాళీ లేవని, అంత డిమాండ్‌ ఉందని ఓ ప్రముఖ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఒక్క దసపల్లా హోటల్‌కే ఆదివారం 30 కార్లు గెస్ట్‌ల కోసం పంపించినట్టు ట్రావెల్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ అతిథి గృహానికి దగ్గరగా వున్న ఒక హోటల్‌లో రష్యాకు చెందినవారే 40 రూముల్లో ఉంటున్నారు. వీరంతా నేవీ పనిపై వచ్చినట్టు చెబుతున్నారు. త్వరలో సదస్సులు, సమావేశాలు నిర్వహించబోతున్నారని, అప్పుడు మరింత డిమాండ్‌ పెరుగుతుందని సంబంధిత వర్గాల సమాచారం.


టూరిజం కాటేజీలు ఖాళీ లేవు

టి.బాబోజీ, డీవీఎం, పర్యాటకాభివృద్ధి సంస్థ

పర్యాటకాభివృద్ధి సంస్థకు ఎంవీపీ కాలనీ, అరకులోయ, అనంతగిరి, లంబసింగిల్లో కాటేజీలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఖాళీలు లేవు, అన్నీ నిండిపోయాయి. రుషికొండ బీచ్‌ రోడ్డులో ఒక్క పార్కింగ్‌ ద్వారానే రోజుకు రూ.10 వేల ఆదాయం వస్తోంది. బోటింగ్‌ ద్వారా రూ.25 వేల వరకు వస్తోంది. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటు చేసి అరకు, లంబసింగి పంపిస్తున్నాం. మళ్లీ మునుపటి జోష్‌ వచ్చింది. రుషికొండ కాటేజీలు లేకపోవడమే కొంత లోటు కనిపిస్తోంది. 

Updated Date - 2021-10-19T06:17:17+05:30 IST