వైసీపీ పాలనపై ప్రపంచమంతా ఆందోళన

ABN , First Publish Date - 2021-06-14T04:59:47+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలన తీరుతో ప్రపంచమంతా ఆందోళనగా ఏపీ వైపు చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు.

వైసీపీ పాలనపై ప్రపంచమంతా ఆందోళన
జూమ్‌ యాప్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతున్న బీద

ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించాలి

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద

నెల్లూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ పాలన తీరుతో ప్రపంచమంతా ఆందోళనగా ఏపీ వైపు చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక, విధానాలపై విశ్వాసం లేక ఏ కంపెనీ కూడా రాష్ట్రం వైపు చూడడం లేదని విమర్శించారు. ఆదివారం నెల్లూరులోని తన నివాసం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యమంత్రి ఆలోచనలు మరింత గందరగోళంగా ఉన్నాయన్నారు. ఏదో ఒక వివాదాన్ని లేపడం, లేనిపోని ప్రచారాలు చేయడం ద్వారా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.  ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. వ్యాక్సిన్‌ వేస్టేజీలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం బాధాకరమన్నారు. ఇంకా ఇరవై శాతం మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ తీరుతో 2024కు కూడా వ్యాక్సిన్‌ పూర్తి చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సినేషన్‌కు రూ.1600 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని విమర్శించారు. గ్లోబల్‌ టెండర్లు పిలిస్తే కంపెనీలు రావడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు అందడం లేదని, ఉద్యోగులకు జీతాలు, ఇతర భత్యాలు సరైన సమయంలో ఇవ్వలేకపోతున్నారని, చివరకు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే దుస్థితి దాపురించిందని బీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను కాపాడాల్సింది పోయి టీడీపీ నేతలు చేస్తున్న సూచనలను, ఎన్టీఆర్‌ ట్రస్టు చేస్తున్న సేవలను అవహేళన చేయడం దుర్మార్గమని ఆక్షేపించారు. బ్లూ మీడియా ఎన్ని రాసినా, ఎంత ఆర్భాటం చేసినా వాస్తవాలు మాత్రం మారిపోవన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపట్టాలని రవిచంద్ర డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-06-14T04:59:47+05:30 IST