పంటంతా పేదలకు పంచుతున్నాడు

ABN , First Publish Date - 2020-04-04T06:03:52+05:30 IST

ఇప్పుడంతా ‘లాక్‌డౌన్‌’. ఈ ఆపత్కాలంలో రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల అవస్థలు ఇక చెప్పనలవికావు. ఎక్కడా పని లేదు... పట్టెడన్నం పుట్టడం లేదు. వారి ఆకలి బాధలు అర్థం చేసుకున్నాడు కేరళకు చెందిన 25 ఏళ్ల యువ రైతు యదు ఎస్‌. బాబు.

పంటంతా పేదలకు పంచుతున్నాడు

ఇప్పుడంతా ‘లాక్‌డౌన్‌’. ఈ ఆపత్కాలంలో రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల అవస్థలు ఇక చెప్పనలవికావు. ఎక్కడా పని లేదు...  పట్టెడన్నం పుట్టడం లేదు. వారి ఆకలి బాధలు అర్థం చేసుకున్నాడు కేరళకు చెందిన 25 ఏళ్ల యువ రైతు యదు ఎస్‌. బాబు. ఒకటిన్నర ఎకరంలో తాను పండించిన పంటనంతా కూలీలకు ఉచితంగా పంచి... ఆదర్శంగా నిలిచాడు.


‘‘నా చుట్టుపక్కలవారు ఆకలితో అలమటిస్తుంటే... నాకున్న సౌకర్యాలతో విలాసాలు చేసుకొంటూ కూర్చోలేను. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి మనం ఏమేం చేయగలమో అవన్నీ చేయాలి’’... ఇది యదుబాబు మాట. నిజమే... భారమంతా ప్రభుత్వంపై నెట్టేసి కూర్చుంటే కుదరదు. దేశమే కాదు... కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమంతా అల్లాడుతున్నవేళ, ఎవరికి వారు తమ వంతు మద్దతునందించాలి. చేతనైన సాయం చేయడం బాధ్యతగా భావించాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని అనక్కర గ్రామంలో నివసించే యదుబాబు ఆలోచన కూడా ఇదే. అందుకే కంటితో చూసి వదిలేయకుండా మనసుతో స్పందించాడు.


ముఖ్యంగా కూరగాయలు, ఇతర రోజువారీ ఉత్పత్తులకు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలపై కేరళ  ఆధారపడుతుంది. కరోనా ప్రభావంతో రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో కేరళకు దిక్కుతోచని పరిస్థితి. దీంతో చాలామంది దినసరి కూలీలు పస్తులతో పడుకోవాల్సి వస్తుంది. ఇది గమనించిన యదుబాబు కొందరి ఆకలైనా తీర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రసాయన ఎరువులు వాడకుండా తన ఒకటిన్నర ఎకరంలో పండించిన కూరగాయలన్నింటినీ వారికి పంచుతున్నాడు.


ఎక్కువ ధర ఇస్తామన్నా... 

‘‘పురుగు మందులు, రసాయన ఎరువులు వేయకుండా కూరగాయలు పండిస్తున్నా. చాలామంది వ్యాపారులు వచ్చి తమకు పంట అమ్మమని అడిగారు. ఎక్కువ డబ్బులు కూడా చెల్లిస్తామన్నారు. కానీ నేను వారికి అమ్మనని చెప్పాను. ఈ లాక్‌డౌన్‌ సమయంలో అనేకమంది పేద కూలీలు ఆకలితో అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ ‘అమ్మక్కొరుమ్మ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా కూరగాయలు అందిస్తున్నాను’’ అని చెప్పాడు యదుబాబు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈ యువకుడు చురుగ్గా పాల్గొంటాడు. పన్నెండేళ్లుగా అనాథలు, అభాగ్యులు, వృద్ధులను ఆదుకొంటోంది ‘అమ్మక్కొరుమ్మ’ స్వచ్ఛంద సంస్థ. కరోనాతో విలవిల్లాడుతున్న కేరళలో ఇంటింటికి నిత్యావసరాలు చేర్చడానికి నిరంతరం శ్రమిస్తోందీ సంస్థ. వందకు పైగా ఇళ్లకు సరుకులు పంపిణీ చేసింది. ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు ఈ యువ రైతు.


నాన్న స్ఫూర్తితోనే... 

తోటి వయసువారంతా చదువు అయిపోగానే ఆరంకెల ఉద్యోగాల కోసం కార్పొరేట్‌ల దారి పడుతుంటే... యదుబాబు మాత్రం మాతృభూమిని వదిలి అడుగు బయటకు వెయ్యలేదు. కారణం... అతడికి మంచి  అవకాశాలు రాక కాదు... వ్యవసాయంపైనున్న మక్కువతో! మెరైన్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన ఈ కుర్రాడికి మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు వెతుక్కొంటూ వచ్చాయి. అయితే వాటన్నింటినీ తిరస్కరించాడు. యుదుబాబు తండ్రి రిటైర్డ్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌. ఆయన కూడా వ్యవసాయం చేస్తారు. అదే ఎన్‌జీఓ కోసం పనిచేస్తున్నారు. నాన్న స్ఫూర్తితోనే వ్యవసాయం బాటపట్టాడు యదుబాబు.


వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నాడు...

‘కావాలనుకొంటే మంచి జీతంతో ఉన్నతమైన కొలువులో స్థిరపడగలిగేవాడినే! అయితే వ్యవసాయం చేయాలన్న నా కోరిక అటువైపు వెళ్లనివ్వలేదు. ఇందులో ఎంత కష్టముందో, ఇది ఎంతపెద్ద బాధ్యతో తెలుసు... కానీ నాకు ఇంతకు మించిన సంతృప్తి, ఆనందం మరెక్కడా దొరకవనీ తెలుసు’’ అంటాడు యదుబాబు. అందుకే డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా... స్వచ్ఛమైన, హానికరం కాని ఉత్పత్తులు అందివ్వాలని సంకల్పించాడు. అతడికి ఉన్న పొలంలో వివిధ రకాల బీన్స్‌, బీట్‌రూట్‌, కాకర, వంకాయ పండిస్తున్నాడు. వాటితోపాటు ఏలకులు, మిరియాలు సాగు కూడా చేస్తున్నాడు. యదుబాబు తోట నుంచి వారానికి 100 కేజీల కాయగూరలు దిగుబడి అవుతాయి. ఇప్పుడు వాటన్నింటినీ ప్యాకింగ్‌ చేసి... నలభైకి పైగా ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తున్నాడు.


ఈ సమయంలో అధికమొత్తంలో సంపాదించుకొనే అవకాశం ఉన్నా, దాన్ని వదులుకొని, కూరగాయలను పేదలకు పంచుతున్న యదుబాబు పెద్ద మనసు... మరింతమందికి స్ఫూర్తి మంత్రం కావాలని ఆశిద్దాం.

Updated Date - 2020-04-04T06:03:52+05:30 IST