గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2022-05-27T05:58:09+05:30 IST

ప్రకృతి ప్రకోపానికి తీవ్ర నష్టం జరిగింది. మండలంలోని వెంకట్రావుపల్లె, సోమారంపేట, గొల్లపల్లి గ్రామాల్లో బుధవారం అర్దరాత్రి గాలివాన బీభత్సవం సృష్టించింది.

గాలివాన బీభత్సం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో కుప్పకూలిన శ్మశానవాటిక షెడ్డు

- నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు 

- వలస కూలీలకు గాయాలు

- మృతి చెందిన కోడిపిల్లలు

- చెట్లు పడి వాహనాలు ధ్వంసం

- నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


ఇల్లంతకుంట, మే 26: ప్రకృతి ప్రకోపానికి తీవ్ర నష్టం జరిగింది. మండలంలోని వెంకట్రావుపల్లె, సోమారంపేట, గొల్లపల్లి గ్రామాల్లో బుధవారం అర్దరాత్రి గాలివాన బీభత్సవం సృష్టించింది. సోమారంపేట గ్రామ సమీపంలోని ఫౌల్ర్టీఫామ్‌ రేకులు లేచిపోవడంతో వర్షానికి దాదాపు 600 కోడిపిల్లలు మృతిచెందాయి. శ్మశానవాటిక పూర్తిగా కూలిపోయింది. మూడు గ్రామాల్లో 200 విద్యుత్‌  స్తంభాలు, డీపీలు నేలకూలాయి. దీంతో మూడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడానికి సెస్‌ సిబ్బంది కృషి చేస్తున్నారు. చెట్లు విరిగి పడడంతో వాటి కింద నిలిపిన వాహనాలు  ధ్వంసం అయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేతికి అందివస్తున్న మామిడి కాయులు నేలరాలాయి. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. ఇళ్లపై చెట్లు కూలడంతో నష్టం వాటిల్లింది. సర్పంచులు కాచం శ్రీనివాస్‌రెడ్డి, మంద సుశీలలింగయ్యతోపాటు నాయకులు సహాయక చర్యలు చేపట్టారు. 


వలస కూలీలకు గాయాలు

 వెంకట్రావుపల్లె సమీపంలోని దాబాలో పనిచేసే వలస కూలీలు పనిముగించుకొని బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి వీచిన భారీ గాలులకు దాబా పైకప్పు రేకులు లేచి వచ్చి కూలీలపై పడ్డాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌, సుభాష్‌కు గాయాలయ్యాయి. వెంటనే సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించారు.  

నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

భారీ ఈదురుగాలులతో జరిగిన నష్టాన్ని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ గురువారం పరిశీలించారు. ఎవరూ అధైర్యపడవ్దని ప్రభుత్వం అండగా ఉంటుందని  హామీ ఇచ్చారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సెస్‌ సిబ్బందికి సూచించారు. 

  ఎల్లారెడ్డిపేటలో..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో గాలివాన గురువారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. భారీ గాలులకు ఇంటిపైకప్పులు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పది నిమిషాల్లోనే అతలాకుతలం చేసింది. గ్రామంలోని ఉప సర్పంచ్‌ ప్రదీప్‌రెడ్డి, శాగ రాములు, అబ్బనవేణి నర్సయ్య, దుండిగాల బాబు, కొంపెల్లి రాజు, కొంపెల్లి రామచంద్రం, తిపిరి అంజలి, చెరుకూరి కొమురయ్యకు చెందిన ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి మరో భవనం ఎదుట పడ్డాయి. మూడు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. గాలివానకు రేకులు ఎగిరిపోవడంతో భయంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం త్రుటిలో తప్పినట్లయ్యింది.  ఇంటి పైకప్పు రేకులు లేచిపోవడంతో బాధిత కుటుంబాలు వీధిన పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. సెస్‌ సిబ్బంది మరమ్మతు  చర్యలు చేపట్టారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరారు.


Updated Date - 2022-05-27T05:58:09+05:30 IST