గాలివాన బీభత్సం!

ABN , First Publish Date - 2022-05-27T08:27:18+05:30 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వానతో పాటు వడగళ్లు బీభత్సం సృష్టించాయి.

గాలివాన బీభత్సం!

  • గోడకూలి ఒకరు, పిడుగు పడి మరొకరు మృతి
  • కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
  • కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలు 
  • హైదరాబాద్‌లో రేకులు ఎగిరిపడి 
  • 3 కార్లు ధ్వంసం.. ఇద్దరికి గాయాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌):  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వానతో పాటు వడగళ్లు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలగా, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. గోడ కూలి ఒకరు, పిడుగు పడి మరొకరు మృతి చెందారు. హైదరాబాద్‌ నాంపల్లిలో ఈదురు గాలుల ఽతీవ్రతకు నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు గాయపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం కొంపెల్లి వద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నిర్మాణంలో ఉన్న గోడ కూలి జాలకోటితండాకు చెందిన పూల్‌సింగ్‌ (43) మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా అలీఖాన్‌పల్లిలో పొలంలో రైతు జగన్‌(46) పిదుగు పడి మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సోమారంపేట సమీపంలోని పౌల్ర్టీఫారం రేకులు లేచిపోవడంతో భారీ వర్షానికి దాదాపు 600 కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి.


మూడు గ్రామాల్లో 200 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, మామడ, పెంబి తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని రాకాసిపేటలో వడగళ్ల వాన పడింది. భీంగల్‌ మండల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, లంగర్‌హౌజ్‌, అంబర్‌పేటలో చెట్లు విరిగి రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 


మూడు రోజులు తేలికపాటి వర్షాలు  

రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేక్రమంలో గురువారం హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం కూడా చల్లబడింది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించింది. కాగా, నైరుతి రుతు పవనాలు... నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2022-05-27T08:27:18+05:30 IST