గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2022-05-05T05:30:00+05:30 IST

బాన్సువాడ డివిజన్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలుకుని గురువారం తెల్లవారుజామున వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు పడడంతో బాన్సువాడ డివిజన్‌తో పాటు పలు గ్రామాలు అతలాకుతులం అయ్యాయి.

గాలివాన బీభత్సం
ఇబ్రహీంపేట గ్రామంలో నేల కొరిగిన విద్యుత్‌ స్తంభాలు

- ఈదురు గాలులతో తెగిపోయిన విద్యుత్‌ వైర్లు.. నేలకొరిగిన స్తంభాలు

- రహదారులపై అడ్డంగా కూలిన వృక్షాలు

- ఎగిరిపడిన ఇంటి పైకప్పులు

- రోజంతా అంధకారంలోనే బాన్సువాడతో పాటు మరో 10 గ్రామాలు

- తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ముద్దయిన వరి ధాన్యం

- కేంద్రాల్లో, రోడ్లపై వరద తాకిడికి కొట్టుకుపోయిన ధాన్యం

- సుమారు రూ.22లక్షలకు పైగా ఆస్తినష్టం

- ఇబ్రహీంపేట గ్రామంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మన ఊరు-మన బడి కార్యక్రమం వాయిదా

బాన్సువాడ, మే 5: బాన్సువాడ డివిజన్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలుకుని గురువారం తెల్లవారుజామున వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు పడడంతో బాన్సువాడ డివిజన్‌తో పాటు పలు గ్రామాలు అతలాకుతులం అయ్యాయి. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లింది. గాలివాన బీభత్సానికి విద్యుత్‌ వైర్లు తెగిపోయి స్తంభాలు నేలకొరిగాయి. వృక్షాలు రహదారులపై అడ్డంగా పడిపోయాయి. భారీ ఈదురుగాలులకు కూనపెంకుల ఇళ్లతో పాటు రేకులషెడ్ల ఇళ్ల పైకప్పు ఎగిరిపోవడంతో పాటు కూలిపోయాయి. వరి పంట నేలకొరుగగా కొనుగోలు కేంద్రంలోని అకాల వర్షానికి ధాన్యం తడిసిపోగా మరికొన్నిచోట్ల వరద తాకిడికి ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా ఈదురుగాలులతో స్థానిక గ్రామస్థులకు ఆస్తినష్టం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. రైతుల కష్టం సైతం నీళ్లపాలైంది. బాన్సువాడ డివిజన్‌లో గాలివాన బీభత్సం భారీగానే నష్టం చేకూర్చినట్లు సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అంధకారంలో బాన్సువాడ, పలు గ్రామాలు

బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బాన్సువాడ డివిజన్‌ కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు, రేకులషెడ్లు, ఇళ్లు పూర్తిగా నేలకొరిగాయి. బాన్సువాడ పట్టణంతో పాటు ఇబ్రహీంపేట, కొల్లురు, నాగారం, బోర్లం, కొయ్యగుట్ట, దేశాయిపేట, సోమేశ్వరం, రాంపూర్‌, జక్కల్‌దాని తండాలో గ్రామాలు అంధకారంగా మారింది. బాన్సువాడ డివిజన్‌లోని విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా లేక గురువారం ఉదయం నుంచి పలు గ్రామాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైనే విద్యుత్‌ తీగలు, స్తంభాలు పడిపోవడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక వాసులు సైతం రోడ్లుపైకి రాలేని పరిస్థితి ఎదురైంది. మరికొన్నిచోట్ల ఇళ్లు సైతం గాలి తీవ్రతకు కూలిపోయాయి. నాలుగు రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. తాగునీటి సరఫరా లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.

రైతుల కష్టం నీటి పాలు

బాన్సువాడ పట్టణ కేంద్రంతో పాటు చుట్టు పక్కల 10 గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పాటు అకాల వర్షం పడడంతో రైతులకు సైతం తీవ్ర నష్టాన్నే చేకూర్చింది. పలు గ్రామాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరి ఈదురుగాలులకు నేలవాలి వడ్లు నేల రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిముద్దయ్యింది. బాన్సువాడ మార్కెట్‌ యార్డులో, ఇబ్రహీంపేటలో, బోర్లం, దేశాయిపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వందల క్వింటాళ్లలోనే ధాన్యం తడిసిపోయిందని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇబ్రహీంపేటలో పోచారం పర్యటన రద్దు

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మన ఊరు-మన బడి కార్యక్రమం గురువారం ఉండడంతో తెల్లవారు జాము నుంచి భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇబ్రహీంపేట గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగి గ్రామం అస్తవ్యస్తంగా మారింది. దీంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన వాయిదా పడింది. గురువారం రాత్రి వరకు విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు అంధకారంలోనే ఉన్నారు. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వృక్షాలు విద్యుత్‌ వైర్లకు తగులుతున్నాయని చెట్ల కొమ్మలు నరికివేస్తూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం సృష్టించడం ఎంత వరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నించారు. విద్యుత్‌ సరఫరా చేయడంలో సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ప్రజలు మండిపడ్డారు. రోజంతా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Read more