Abn logo
Jan 26 2021 @ 01:29AM

శ్రీమంతుల సంపద వృద్ధి.. రూ.13 లక్షల కోట్లు

  • గత ఏడాది మార్చి నుంచి టాప్‌-100 భారత శ్రీమంతుల సంపద వృద్ధి ఇది
  • దేశంలోని 13.8 కోట్ల మంది పేదలకు  రూ.94 వేల చొప్పున పంచవచ్చు
  • ముకేశ్‌ అంబానీ సంపాదన  గంటకు రూ.90 కోట్లు: ఆక్స్‌ఫామ్‌ 


న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలోనూ భారత కుబేరుల ఆస్తి భారీగా పెరిగిందని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది మార్చి నుంచి దేశంలోని టాప్‌-100 శ్రీమంతుల సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరిగిందని తెలిపింది. ఈ మొత్తాన్ని దేశంలోని 13.8 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికీ రూ.94,045 చొప్పున పంచవచ్చని నివేదిక పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎ్‌ఫ)లో ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


కొవిడ్‌ సంక్షోభ కాలంలో ముకేశ్‌ అంబానీ సంపాదన గంటకు రూ.90 కోట్లుగా నమోదైంది. ఈ మొత్తాన్ని ఆర్జించేందుకు నైపుణ్యరహిత కార్మికుడికి 10 వేల సంవత్సరాలు పడుతుంది. అంబానీ ఒక సెకను సంపాదనకు సమానమైన ఆదాయం కోసం మూడేళ్లు శ్రమించాల్సి వస్తుంది. 

ఈ మహమ్మారి..వందేళ్లలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం. ఈ వైరస్‌ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని 1930 నాటి మహా మాంద్యంతో పోల్చవచ్చు. 

ఆక్స్‌ఫామ్‌ నిర్వహించిన సర్వేలో 79 దేశాలకు చెందిన 295 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. భారత్‌కు చెందిన జయతీ ఘోష్‌ సహా పలు ప్రముఖ ఎకనామిస్టులు ఈ జాబితాలో ఉన్నారు. 

వైరస్‌ వ్యాప్తితో తమ దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగాయని జయతీ ఘోష్‌ సహా సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే.. ప్రపంచంలో భారత్‌ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. 

కొవిడ్‌ సంక్షోభ కాలంలో పెరిగిన టాప్‌-11 భారత కుబేరుల సంపద (రూ.7.2 లక్షల కోట్లు)పై ఒక శాతం పన్ను విధిస్తే.. జన ఔషధి పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచవచ్చు. ఈ సంక్షోభ సమయంలో పెరిగిన వీరి సంపదతో 10 ఏళ్ల పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించవచ్చు. 

ఈ సంక్షోభ సమయంలో ముకేశ్‌ అంబానీ ఆర్జించిన సంపాదనతో దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులను 5 నెలల పాటు పేదరికంలోకి జారుకోకుండా ఆదుకోవచ్చు.  

లాక్‌డౌన్‌ సమయంలో భారత బిలియనీర్ల ఆస్తి 35 శాతం పెరిగింది. 2009 నుంచి 90 శాతం పెరిగి 42,290 కోట్ల డాలర్లకు చేరుకుంది. 

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దాంతో దేశంలో నిరుద్యోగం, ఆకలి, వలసలు, కష్టాలు పెరిగాయి. శ్రీమంతులు ఈ సంక్షోభ ప్రభావం నుంచి తప్పించుకోగలిగారు. వైట్‌ కాలర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేశారు. అసంఘటిత రంగాలకు చెందిన కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. 2020 ఏప్రిల్‌లో గంటకు 1.70 లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కోల్పోయారు. 

వైరస్‌ వ్యాప్తితో దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. అందులో 75 శాతం (9.2 కోట్లు) అసంఘటిత రంగాలకు చెందినవారే. 

2020 ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌కు ముందు సమయంతో పోలిస్తే మహిళల నిరుద్యోగ రేటు 15 శాతం పెరిగింది. 

లాక్‌డౌన్‌ సమయంలో ఆకలి, ఆత్మహత్యలు, రోడ్డు, రైలు దుర్ఘటనలు, పోలీసుల క్రూరత్వం, సమయానికి వైద్యం అందక 300కు పైగా అసంఘటిత కార్మికులు చనిపోయారు. గత ఏడాది ఏప్రిల్‌లో 2,582కు పైగా మానవ హక్కుల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 

దీర్ఘకాలం పాటు స్కూళ్లు మూతపడటంతో దేశంలో విద్యకు దూరమైన వారి సంఖ్య రెట్టింపయ్యే ప్రమాదం ఏర్పడింది. గ్రామీణ కుటుంబాల్లో కేవలం 4 శాతమే కంప్యూటర్‌ కలిగి ఉండగా.. 15 శాతం ఇళ్లలోనే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. 

దేశ జనాభాలో 20 శాతమైన అత్యంత పేదల్లో కేవలం 6 శాతం మందికి మాత్రమే  మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో ఉన్నాయి. దేశ జనాభాలో 59.6 శాతం మంది ఒకే గదిలో జీవనం కొనసాగిస్తున్నారు. 

ఆక్స్‌ఫామ్‌ 

Advertisement
Advertisement
Advertisement