మహిళా ఓటర్లు (ఫైల్)
జిల్లాలో 26,66,929 మందికి చేరిన సంఖ్య
పురుషుల కంటే మహిళలే టాప్
10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారే అధికం
మొత్తం ఓట్లలో కొండపి ఫస్ట్.. చీరాల లాస్ట్
ఒంగోలు (కలెక్టరేట్), జనవరి 15 : జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేసిన యంత్రాంగం శుక్రవారం తుది జాబితాను ప్రకటించింది. ఆ ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 26,66,929 మందికి చేరింది. అందులో పురుషులు 13,23,474, మహిళలు 13,43,282, థర్డ్ జండర్ ఓటర్లు 173 మంది ఉన్నారు. గత జాబితాతో పోల్చి చూస్తే 13,783 ఓట్లు పెరిగాయి. మొత్తం ఓట్లలో పురుషుల కంటే మహిళలవే అధికంగా ఉన్నాయి.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను గత ఏడాది నవంబర్ నుంచి చేపట్టారు. శుక్రవారం తుది జాబితాను ప్రకటించారు. అందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు 19,808 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో కొండపి 2,36,949 మంది ఓటర్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. చీరాల 1,92,342 మంది ఓటర్లలో చివరి స్థానంలో ఉంది. ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లోనే మహిళల కన్నా పురుషుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 10 చోట్లా మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. గత జాబితాలో మొత్తం 26,53,146 మంది ఓటర్లు ఉన్నారు. దానితో ప్రస్తుత జాబితాను పోల్చి చూస్తే 13,783 మంది ఓట్లు పెరిగాయి. గతంలో 13,16,373 మంది పురుష ఓట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 13,23,473 మందికి చేరింది. 7100 ఓట్లు పెరిగాయి. మహిళా ఓట్లు గత జాబితా ప్రకారం 13,36,603, ఇప్పుడు 13,43,282కు చేరాయి. 6679 మంది పెరిగారు. థర్డ్ జెండర్ ఓట్ల సంఖ్య గతంలో 170 ఉండగా ఇప్పుడు 173కి చేరింది.