భారత్‌లో Tesla టాప్ ఎగ్జిక్యూటివ్ Manuj Khurana రాజీనామా

ABN , First Publish Date - 2022-06-15T00:18:27+05:30 IST

భారత్‌లో టెస్లా(Tesla) పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ మనుజ్ ఖురన(Manuj Khurana) రాజీనామా చేశారు.

భారత్‌లో Tesla టాప్ ఎగ్జిక్యూటివ్ Manuj Khurana రాజీనామా

న్యూఢిల్లీ: భారత్‌లో టెస్లా(Tesla) పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ మనుజ్ ఖురన(Manuj Khurana) రాజీనామా చేశారు.  భారత్‌లో టెస్లా లాబీయింగ్ ప్రయత్నాల్లో ఆయన అత్యంత కీలకపాత్ర పోషించారు. అయితే భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు విక్రయించాలనే ప్రణాళికలను టెస్లా నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా ఆసక్తికరంగా మారింది. మార్చి 2021లో ఆయన టెస్లాలో నియమితులయ్యారు. భారత మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశించాలనే ప్రణాళికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ ఏడాదిన్నరగా భారత ప్రభత్వాన్ని టెస్లా తరపున కోరారు. కానీ భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తేనే పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. 


కాగా మనుజ్ రాజీనామాపై ఇటు ఆయన గానీ, అటు టెస్లా కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. అయితే టెస్లాకు చెందిన ఓ ప్రతినిధి స్పందిస్తూ.. భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించాలనే ప్రణాళిక ప్రస్తుతం మరుగునపడినట్టేనని చెప్పారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనుజ్ ఇచ్చిన సూచనలను టెస్లా చెవినపెట్టలేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఆయన రాజీనామాకు ఇదే కారణమని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2022-06-15T00:18:27+05:30 IST