ముఖేష్ అంబానీ నుంచి రాహూల్ బజాజ్ వరకు.. సోషల్ మీడియాను వాడని వ్యాపారవేత్తల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-07-27T23:49:54+05:30 IST

ప్రస్తుత మోడ్రన్ కాలంలో సోషల్ మీడియా వాడని ప్రముఖుడు లేడు. కొందరు సెలెబ్రిటీలు అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకూ తాము చేసే ప్రతి పని గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు దగ్గరవుతుంటారు.

ముఖేష్ అంబానీ నుంచి రాహూల్ బజాజ్ వరకు.. సోషల్ మీడియాను వాడని వ్యాపారవేత్తల లిస్ట్ ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత మోడ్రన్ కాలంలో సోషల్ మీడియా వాడని ప్రముఖుడు లేడు. కొందరు సెలెబ్రిటీలు అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకూ తాము చేసే ప్రతి పని గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు దగ్గరవుతుంటారు. అయితే దేశంలో ఆన్‌లైన్ ఒరవడి సృష్టించిన ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ వంటి ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు ఎప్పుడైనా చూశారా? బహుశా చూసుండరు కదా. ఎందుకంటే వాళ్లకు ట్విటర్లోకానీ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఏ సోషల్ మీడియా వేదికలోనూ ఖాతాల్లేవు. ఇలా వీళ్లిద్దరే కాదు. మరికొందరు ప్రముఖులు కూడా సోషల్ మీడియాకు దూరం దూరంగా ఉంటున్నారు. వాళ్ల వివరాలపై ఓసారి లుక్కేస్తే..


1. ముఖేష్ అంబానీ

రిలయన్స్ సంస్థల అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. మరి ఆయన ఎప్పుడైనా చిన్న ట్వీట్ చేయడమో.. ఇన్‌స్టా ఫొటో షేర్ చేయడమో చూశారా? ఛాన్సే లేదు. ఎందుకంటే దేశానికి జియో సేవలు అందించి సోషల్ మీడియాను అందరి ముంగిట్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఈ కుబేరుడు.. తాను మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. ఆయన కంపెనీలకు పలు ప్లాట్‌ఫాంలలో చాలా ఖాతాలున్నాయి. ఇవి సోషల్ మీడియాను ఉపయోగించి తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటాయి. 


2. సునీల్ మిట్టల్

రిలయన్స్ జియోకు దేశంలో గట్టిపోటీ ఇచ్చిన టెలికాం నెట్‌వర్క్ ఎయిర్‌టెల్. ఈ కంపెనీ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ సబ్సిడరీ. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్. ఈయన కూడా సోషల్ మీడియాలో లేరు. ఆయనకు ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వేటిలోనూ అకౌంట్ లేదు. సునీల్ మిట్టల్ కేవలం టెలికాం రంగంలోనేకాదు ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వ్యవసాయం, ఆహార పదార్థాలు వంటి పలు రంగాల్లో కూడా ఆయన వ్యాపారాలు ఉన్నాయి.


3. అజీమ్ ప్రేమ్‌జీ

సాఫ్ట్‌వేర్ కంపెనీ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లలో విప్రో ఒకటి. ఐటీ రంగంలో ఈ కంపెనీ అంత సక్సెస్ సాధించింది మరి. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేరు. అంతేకాదు దేశంలో అత్యధికంగా దానాలు చేసేవారిలో ప్రేమ్‌జీ ఒకరు. దీంతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.


4. శివ నాడార్

దేశంలోని మరో ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఆయనకు కూడా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు లేవు.


5. రాధాకిషన్ దమానీ

డీ-మార్ట్ రిటైల్ స్టోర్‌ సాయంతో దేశంలోని సంపన్నుల జాబితాలో చేరిన రాధాకిషన్ దమానీ తెలుసు కదా. ఆయన కూడా సామాజిక మాధ్యమాలకు ఆమడ దూరంలో ఉంటారు. ఈయన పెట్టుబడులు కూడా బాగా పెడుతుంటారు. ఈ క్రమంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటారు.


6. రాహుల్ బజాజ్

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్. దీని మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ సోషల్ మీడియాలో లేరు. మనసులో ఉన్న మాటను ధైర్యంగా చెప్పేస్తారని రాహుల్‌కు పేరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా తన మనసులో మాట చెప్పకుండా ఆయన ఆగరని అందరూ అంటారు.

Updated Date - 2021-07-27T23:49:54+05:30 IST