ఇసుక టన్ను ః 1630

ABN , First Publish Date - 2021-05-17T05:13:34+05:30 IST

ఇసుక వినియోగదారులపై మరింత భారం పడింది. రిటైల్‌లో టన్నుఇసుక ధర రూ.1630లుగా ఇసుక సరఫరా కాంట్రాక్టు తీసుకున్న జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ నిర్ణయించింది.

ఇసుక టన్ను ః 1630

ధర ఖరారుచేసిన ప్రైవేటు సంస్థ

ప్రభుత్వ రేటు కంటే రూ. 130 అదనం

తొలి విడత ముడసర్లోవ, అగనంపూడిలో అమ్మకాలు

నేటి నుంచి కొత్త ధర అమలు


విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

ఇసుక వినియోగదారులపై మరింత భారం పడింది. రిటైల్‌లో టన్నుఇసుక  ధర రూ.1630లుగా ఇసుక సరఫరా కాంట్రాక్టు తీసుకున్న జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏపీఎండీసీ ఆధ్వర్యంలో టన్ను ఇసుక రూ.1500కు విక్రయించేవారు.  సోమవారం నుంచి కొత్త ధర అమల్లోకి రానుంది. కాగా వినియోగదారులు నేరుగా  డిపో వద్దకు వెళ్లి సొమ్ము చెల్లించి ఇసుక కొనుగోలుచేసే వీలు కల్పించారు. ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారా ఇసుక బుకింగ్‌ రద్దుచేశారు.  కొనుగోలుదారులు  డిపో నుంచి తమ ఇంటివరకు వాహనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏడాదిన్నర క్రితం ఏపీఎండీసీ ఇసుక అమ్మకాలు ప్రారంభించింది. అప్పట్లోనే డిపో వద్ద టన్ను ఇసుక రూ. 1500లుగా నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇసుక దరకు రవాణా ఖర్చులు కూడా తోడవడంతో వినియోగదారుడిపై అధిక భారం పడింది. ప్రఽధానంగా గ్రామీణ ప్రాంతంలో ఇసుక కొనుగోలుకు ప్రజలు వెనుకంజవేశారు. అయినా ప్రభుత్వం ధర తగ్గించలేదు.  చివరకు ఇసుక అమ్మకాలను ప్రైవేటు సంస్థకు అప్పగించిన ప్రభుత్వం,  ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని ఆ సంస్థకే వదిలేసింది. దీంతో జిల్లాలో డిపోల వద్ద ఇసుక టన్ను రూ.1630గా ప్రైవేటు సంస్థ నిర్ణయించింది. కాగా గోదావరి, వంశధార నదుల్లో రీచ్‌ల వద్ద ఇసుక టన్ను రూ. 475 గా నిర్ణయించింది. గతంలో ఏపీఎండీసీ రూ.375లకు విక్రయించగా ఇప్పుడు టన్నుకు రూ.100 పెంచి ఖరారుచేశారు. వందల టన్నుల ఇసుక అవసరమున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లు నేరుగా రీచ్‌ల నుంచి కొనుగోలు చేస్తుంటారు.

ముడసర్లోవ, అగనంపూడిలో అమ్మకాలు

జిల్లాలో ముడసర్లోవ, అగనంపూడి డిపోల నుంచి సోమవారం నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించనున్నారు. ముడసర్లోవలో సోమవారం ఉదయం ఆరుగంటలు, అగనంపూడిలో ఏడుగంటల నుంచి అమ్మకాలు చేపడతామని జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌  సంస్థ ప్రతినిధి దినేష్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి నక్కపల్లి డిపో నుంచి ఇసుక అమ్మకాలపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.  ముడసర్లోవ, అగనంపూడి డిపోల నుంచి ఇసుక కొనుగోలుచేసే వారు నేరుగా సొమ్ము చెల్లించాలని, ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం లేదన్నారు. అయితే గూగూల్‌, ఫోన్‌పే ద్వారా చెల్లింపుల ప్రక్రియకు మరో వారం పడుతుందన్నారు. ఇసుక కోసం వినియోగదారుడే వాహనం సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-17T05:13:34+05:30 IST