టమాటా రైతు కుదేలు

ABN , First Publish Date - 2022-01-24T06:34:32+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలు టమాటా రైతులను తీవ్రనష్టాలకు గురిచేశాయి.

టమాటా రైతు కుదేలు
సబ్బవరం మండలం అమృతపురంలో ఎండిపోతున్న టమాటా పంట

అకాల వర్షంతో దెబ్బతిన్న పంట

తోటలకు బ్లైట్‌, ఆకు మచ్చ తెగుళ్లు 

నల్లగా మారి ఎండిపోతున్న ఆకులు

కోతకు వచ్చిన కాయలపై పగుళ్లు, నల్లటి మచ్చలు

రైతుల ఆందోళన

తక్షణ సస్యరక్షణ చర్యలతో ఫలితం ఉంటుందంటున్న ఉద్యాన అధికారి


సబ్బవరం/కె.కోటపాడు, జనవరి 23:

జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలు టమాటా రైతులను తీవ్రనష్టాలకు గురిచేశాయి. భోగి, సంక్రాంతి పండుగ రోజుల్లో ఆకస్మికంగా కురిసిన వర్షాలతో టమాటా తోటలు నిలువునా ఎండిపోతున్నాయని సాగుదారులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షం ఆమ్ల గుణం (యాసిడ్‌) కలిగి వుండడంతో ఉద్యాన పంటలకు బ్లైట్‌, ఆకు మచ్చ తెగుళ్లు సోకాయని, దీంతో ఆకులు నల్లగా మారిపోయి ఎండిపోతున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో సబ్బవరం, కె.కెటపాడు, చోడవరం, రావికమతం, కశింకోట, అచ్యుతాపురం, కోటవురట్ల, నక్కపల్లి, గొలుగొండ మండలాల్లో వేలాది ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు.  ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా వుండడంతో పూత అధికంగా వచ్చి, కాపు బాగా కాసింది. కొన్నిచోట్ల ఇప్పటికే  కోతలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ధర కూడా ఆశాజనకంగా వుండడంతో మంచి ఆదాయం వస్తుందని రైతులు ఆశించారు. కానీ ఈ నెల 14, 15 తేదీల్లో కురిసిన అకాల వర్షాలు వారి ఆశలను ఆవిరి చేశాయి. మొక్కల ఆకులు నల్లగా మారి ఎండిపోతున్నాయి. పూత మొత్తం రాలిపోయింది. కోతకు వచ్చిన కాయలపై పగుళ్లు, నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. పచ్చికాయలు, పిందెలు గిడసబారిపోతున్నాయి. కాయలను కోసి మార్కెట్‌కు తీసుకువెళితే సగం ధర కూడా పలకడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి అయ్యిందని, కాపు బాగా కాయడంతో ఖర్చులు పోను రూ.25 వేల వరకు మిగులుతాయని ఆశించానని, ఆకాల వర్షంతో లాభం మాట అటుంచి పెట్టుబడి కూడా పోయిందని కె.కోటపాడు మండలం బత్తివానిపాలెం గ్రామానికి చెందిన గొర్లె నరసింహమూర్తి అనే రైతు వాపోయారు.


వర్షపు నీటిలో ఆమ్ల గుణం

ఇటీవల కురిసిన వర్షపు నీటిలో ఆమ్ల గుణం వుందని, దీంతో టమాటా, వంగ, మిరప, బరబాటి, గోరుచిక్కుడు, తదితర పంటలు దెబ్బతింటున్నాయని ఉద్యాన శాఖ అధికారిణి జి.రాధిక అన్నారు. ముఖ్యంగా టమాటా పంటకు ఆకుమచ్చ, బ్లైట్‌ తెగుళ్లు సోకాయని చెప్పారు. ఈ తెగుళ్ల వల్ల ఆకులు మాడిపోయి, కొద్దిరోజుల్లోనే మొక్కలు ఎండిపోతాయని తెలిపారు. అయితే రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే కొంతవరకు పంట తేరుకునే అవకాశం వుందని ఆమె వెల్లడించారు 

సస్యరక్షణ చర్యలు

లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా రెండు గ్రాముల రిడోమిల్‌ గోల్డ్‌ కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. తరువాత లీటరు నీటికి ఒక గ్రాము ఆక్రోబాట్‌, ఒక గ్రాము కొసైడ్‌ కలిపి ఆకులు, కాండాలు తడిసేలా పిచికారీ చేయాలి. దీంతో మొక్కలు కోలుకుంటాయి. వారం రోజుల తరువాత లీటరు నీటికి ఐదు గ్రాముల యూరియా, ఐదు గ్రాముల 19:19:19 కలిపి పిచికారీ చేస్తే మొక్కలకు బలం చేకూరి, మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటాయి.


Updated Date - 2022-01-24T06:34:32+05:30 IST