తాళికట్టు.. శుభవేళ..

ABN , First Publish Date - 2020-10-28T16:46:25+05:30 IST

కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నది. సుదీర్ఘ విరామం తర్వాత..

తాళికట్టు.. శుభవేళ..

రేపటి నుంచి మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు

కల్యాణ మండపాలు, ఆలయాల్లో పెళ్లిళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

జనవరి నుంచి నాలుగు నెలలు ముహూర్తాలకు బ్రేక్‌ 


ఏలూరు: కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నది. సుదీర్ఘ విరామం తర్వాత.. ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు సుముహూర్తాలు ఉండటంతో పెళ్లి బాజాలు ఈసారి గట్టిగా మోగనున్నాయి. అంతేకాదు.. శంకుస్థాపనలు, గృహ ప్రవేశాల జోరు పెరగనుంది. భాద్రపద, అధిక ఆశ్వయుజ మాసాల కారణంగా గడచిన రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు. కొవిడ్‌ పరిస్థితులు కొంత కుదుట పడుతుండడంతో దేవాలయాలు, కల్యాణ మండపాల్లో ఆంక్షలతో కూడిన అనుమతులు లభించనున్నాయి. మూతపడిన కల్యాణ మండపాలు ముస్తాబవనున్నాయి. దేవాలయాల్లో పెళ్లిళ్లకు ఆంక్షలతో కూడిన అనుమతులు లభిస్తున్నాయి.


మార్చి నెలాఖరు నుంచి కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా పెళ్లిళ్లలతోపాటు శుభకార్యాలకు కఠినమైన ఆంక్షల నడుమ అనుమతులిచ్చారు. అప్పటి నుంచి పెళ్లిళ్లు స్వల్ప సంఖ్యలో జరిగాయి. ఇప్పుడు మూడు నెలలపాటు ముహూర్తాలు రావడంతో సీజన్‌ ప్రారంభమైంది. హాజరయ్యే అతిథుల సంఖ్యపై కొద్దిపాటి ఆంక్షలున్నా వందల సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నారు. తమ ఇంట వైభవంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు సమాయత్త మవుతున్నారు. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూ ర్తాలకు బ్రేక్‌ పడనుండడంతో ఈ సీజన్‌లోనే శుభ కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. 


శుభ ఘడియలివే...

నిజ ఆశ్వయుజ మాసం ఈ నెల 29, 30, 31, నవంబరు 4, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. కార్తీకమాసంలో నవంబరు 17, 19, 20, 21, 22, 25, 26, డిసెంబరు 1, 6, 8, 9 తేదీల్లో, మార్గశిర మాసంలో డిసెంబరు 17, 18, 20, 24, 27 తేదీల్లోనూ, 2021 సంవత్సరంలో జనవరి 2, 7 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.


భారీగా శుభకార్యాలు

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ కరోనా కారణంగా ప్రజలు చాలా మంది వాటిని వాయిదా వేసుకున్నారు. కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా.. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నది. ఈ కారణంగా ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసాలైన ఇప్పటి నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో వివాహాలు, ఉపనయనాలు, నూతన గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మౌఢ్యమి కారణంగా కూడా ప్రస్తుతం  అత్యధికులు శుభకార్యాలు జరపనున్నారు. అక్టోబరు 29, 30, 31, నవంబరు 4, 19, 20, 25, డిసెంబరు 8, 9, 17, 23, 24, జనవరి 4, 7, 9 తేదీల్లో బలమైన ముహూర్తాలుగా చెప్పబడుతున్నాయి. 

- తంగిరాల సత్య శ్రీనివాస సిద్ధాంతి, పంచాంగకర్త, రేలంగి


Updated Date - 2020-10-28T16:46:25+05:30 IST