రేపే కేసీఆర్‌ జాతీయ పార్టీ

ABN , First Publish Date - 2022-10-04T07:33:22+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయదశమినాడు.. బుధవారం జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో

రేపే కేసీఆర్‌ జాతీయ పార్టీ

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ తీర్మానం

ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు!

కొందరితో నేరుగా మాట్లాడిన కేసీఆర్‌?


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయదశమినాడు..  బుధవారం జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో తీర్మానిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైనా.. దసరా రోజున సర్వసభ్య సమావేశం యథావిథిగా ఉంటుందని కేసీఆర్‌ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ భేటీలోనే పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేస్తారు.


మర్నాడు దానిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ పేరు మార్పు ప్రక్రియ నామినేషన్ల నాటికి పూర్తికాదని, కనీసం నెల రోజులు పట్టవచ్చని.. అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే పోటీకి దించుతామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనుంది. ఆయన ఇప్పటికే ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని సమాచారం. ఆ రాష్ట్ర టీడీపీ, బీజేపీ నేతలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ మంత్రి ఒకరు తెలిపారు.


కొత్త పార్టీలోకి అనేక చేరికలు ఉంటాయని.. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తారని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప తదితర జిల్లాలకు చెందిన కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారని అంటున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు..  టీడీపీలో ఉన్న పలువురు కేసీఆర్‌కే కాకుండా...టీఆర్‌ఎ్‌సలోని పలువురికి సన్నిహితంగా ఉన్నవారే. వీరిలో కొందరు బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారని, పార్టీలో చేరి క్రియాశీలంగా ఉండేందుకు ఆసక్తి కనబరిచారని పేర్కొంటున్నారు. ఆంధ్రలోనూ తమ పార్టీ శాఖ ఉంటుందని, క్రమంగా దానిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇంకోవైపు.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారతాయని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాజకీయ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను గెలుచుకోవడం  పెద్ద కష్టమేమీ కాదని టీఆర్‌ఎస్‌ నేతల వద్ద ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నా.. స్థానిక రాజకీయాలు, పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.


మునుగోడు పోరు 3న

న్యూఢిల్లీ, నల్లగొండ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):  తెలంగాణలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్‌, బిహార్‌లోని మోకమా, గోపాల్‌ గంజ్‌, హరియాణాలోని ఆదంపూర్‌, ఉత్తరప్రదేశ్‌ లోని గోలా గోకర్ణ్‌నాథ్‌, ఒడిశాలోని ధామ్‌ నగర్‌ స్థానాలకు నవంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది.  6న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Updated Date - 2022-10-04T07:33:22+05:30 IST