రేపు జాతీయ సంస్కృతవర్సిటీ ప్రథమ స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2021-10-19T07:32:01+05:30 IST

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం బుధవారం ఉదయం 11 గంటలకు మహతి ఆడిటోరియంలో జరగనుంది.

రేపు జాతీయ సంస్కృతవర్సిటీ ప్రథమ స్నాతకోత్సవం
మాట్లాడుతున్న వీసీ మురళీధర శర్మ

67మందికి పీహెచ్‌డీ, 26 మందికి బంగారు పతకాల ప్రదానం

 

తిరుపతి(విద్య), అక్టోబరు 18: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం బుధవారం ఉదయం 11 గంటలకు మహతి ఆడిటోరియంలో జరగనుంది. వర్సిటీ ఛాన్సలర్‌, పద్మభూషణ్‌ ఎస్‌.గోపాలస్వామి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిధిగా న్యూఢిల్లీకి చెందిన స్వామినారాయణ్‌ అక్షర్‌ పురుషోత్తం పరిశోధనాకేంద్రం (అక్షరధామ్‌) చైర్మన్‌ భద్రే్‌షదాస్‌ హాజరుకానున్నారు. ఈ వివరాలను సోమవారం వీసీ మురళీధరశర్మ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి గతేడాది ఏప్రిల్‌ 30న జాతీయ విశ్వవిద్యాలయం హోదా ప్రకటించారని, ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రథమస్నాతకోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పీహెచ్‌డీ, బంగారు పతకాలు అందుకునే విద్యార్థులు మాత్రమే నేరుగా వస్తారని, మిగిలిన యూజీ, పీజీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాజరవుతారని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో 67 మందికి విద్యావారధి (పీహెచ్‌డీ), 26మందికి 53 బంగారు పతకాలు, యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు చదివిన 1160 మంది విద్యార్థులకు పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. సరళ సంస్కృత భాషలో రూపొందించిన ఏడుకొత్త పుస్తకాలను ఆవిష్కరిస్తామన్నారు. కాగా, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ మంజూరు చేసిన రూ.57 కోట్లతో 501 మంది విద్యార్థుల వసతికి 167 గదులతో ఆరు అంతస్థుల భవన నిర్మాణం చేపట్టామని వీసీ మురళీధర శర్మ తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఐదంతస్థులతో తరగతి గదుల కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టామన్నారు. 300 మంది విద్యార్థులు ఒకచోట భోజనం చేసేలా భోజనశాల, హార్టికల్చర్‌కు నీళ్లు అందించేలా 2.5 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే కర్మాగారం, ఆరోగ్యకేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ విస్తరణ, సీసీ కెమరాల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు.  తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని వెలికి తీసి అందరికీ అర్థమయ్యేలా సరళ సంస్కృత భాషలో ప్రచురణలుగా రూపొందిస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో గతేడాద ఏప్రిల్‌ నుంచి 2021 జూన్‌ వరకు వర్సిటీలో 58 కోర్సులను (సంస్కృతం, మోడ్రన్‌) ఆన్‌లైన్‌లో నిర్వహించామన్నారు. ఈ వర్చువల్‌ తరగతులను 15దేశాలకు చెందిన 4,319మంది విద్యార్థులు వినియోగించుకుని వివిధ కోర్సులు అధ్యయనం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ చల్లా వెంకటేశ్వర్లు, పీఆర్వో ప్రొఫెసర్‌ సింగరాజు దక్షిణామూర్తిశర్మ, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చక్రవర్తి రాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T07:32:01+05:30 IST