రేపు రేవంత్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-12T09:08:39+05:30 IST

రేపు రేవంత్‌ పాదయాత్ర

రేపు రేవంత్‌ పాదయాత్ర

  • నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో.. 
  • 14-17 వరకు మండల నేతలతో భేటీలు
  • మునుగోడు నియోజకవర్గంలో 13 నుంచి 20 వరకు కాంగ్రెస్‌ వరస కార్యక్రమాలు 
  • 21న చండూరులో సభ నేపథ్యంలో అమిత్‌ షాకు నిరసన తెలిపే వ్యూహం


హైదరాబాద్‌, నల్లగొండ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలోనూ ఓటమిపాలైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖాతాలో మరో ఓటమి నమోదై ఆయన ప్రతిష్ఠకే భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో వరుస కార్యక్రమాలకు పీసీసీ సిద్ధమైంది. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా మునుగోడు కేంద్రంగా చేపట్టాలని ఆ మేరకు గెలుపు దిశగా వెళ్లాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండగా ఇతర నేతలతో రేవంత్‌రెడ్డి కార్యాచరణకు సిద్ధమయ్యారు. 


ఓ వైపు అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తూనే మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు తిరుగులేదన్న సంకేతాలు పంపేందుకు ఈ నెల 13 నుంచి 20 వరకు వరుస కార్యక్రమాలు చేపట్టనున్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల పార్టీ అధ్యక్షులు, మునుగోడు ఎన్నికల ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలతో పాటు ఐదుగురు సభ్యుల కమిటీతో రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా కాంగ్రెస్‌ నేతలు 75 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టారు.


 ఈ నెల 13న ఆయన యాత్ర మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో కొనసాగుతుంది. ఈ తరుణంలో అనిల్‌ కుమార్‌రెడ్డితో కలిసి నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేందుకు రేవంత్‌ రెడ్డి సిద్ధమయ్యారు. అలాగే, ఈ నెల 14 నుంచి 17 వరకు వరుసగా మండలాల వారీగా పార్టీ నేతలతో రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెల 14న నాంపల్లి, మర్రిగూడ, 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విరామం, 16న మునుగోడు, చండూరు, 17న నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి ఉత్సవాలను మునుగోడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో 175 గ్రామాలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది కాంగ్రెస్‌ కీలక నేతలకు ఒక్కొక్క గ్రామాన్ని కేటాయించి వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఒకరోజు పాదయాత్రకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని సీనియర్‌ నేతలంతా మునుగోడులో ప్రత్యక్షం కానున్నారు. ఈనెల 21న చండూరులో జరిగే సభలో అమిత్‌ షా సమక్షంలో రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. సభ జరిగే రోజు లేదా ముందు రోజు పెరిగిన వంటగ్యాస్‌ ధరలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఖాళీ సిలిండర్లతో గ్రామగ్రామాన బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేలా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-08-12T09:08:39+05:30 IST