రేపటి బోనాల ఉత్సవాలకు పోలీసుల భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2021-07-31T22:11:47+05:30 IST

రేపటి బోనాల ఉత్సవాలకు పోలీసుల భారీ బందోబస్తు

రేపటి బోనాల ఉత్సవాలకు  పోలీసుల భారీ బందోబస్తు

హైదరాబాద్: రేపటి కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఉమ్మడి ఆలయాల బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం కార్వాన్ ఏకే ఫంక్షన్ హాల్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ శ్రీనివాస్  సూచించారు. బోనాల ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఉత్సవాల కోసం 300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ బోనాల ఉత్సవాల్లో బోనాలు ఎత్తుకుని వచ్చే మహిళలకు కూడా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. 


కాగా ఆదివారం సాయంత్రం సబ్జీ మండిలోని మహంకాళి దేవాలయం నుంచి ఘటాలను అంబారి (ఏనుగు) పై భారీ ఊరేగింపుగా జీరా ఆ ప్రాంతంలోని   పోచమ్మ దేవాలయం ప్రాంతానికి తరలి వెళ్తారని డీసీపీ శ్రీనివాస్  చెప్పారు. ఈ ఊరేగింపులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయని, అర్ధరాత్రి వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయని అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లు డీసీపీ శ్రీనివాస్  వెల్లడించారు. అలాగే సోమవారం ఉదయం రంగం, బలి గంప, పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయన్నారు. సాయింత్రం భారీ తొట్టెలను  నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు, ఆలయాల నిర్వాహకులు వస్తారని డీసీపీ తెలిపారు.  ఈ ఊరేగింపు గణేష్ ఘాట్ మూసీ నది వరకు కొనసాగుతుందన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీసీపీ శ్రీనివాస్  కోరారు.


Updated Date - 2021-07-31T22:11:47+05:30 IST