రేపు కూడా వస్తాం: షహీన్‌బాగ్ మధ్యవర్తులు

ABN , First Publish Date - 2020-02-20T02:36:07+05:30 IST

షహీన్‌బాగ్ నిరసనకారులతో బుధవారంనాడు మొదలైన మధ్యవర్తుల చర్చలు గురువారంనాడు కూడా జరుగనున్నాయి. గత రెండు నెలలుగా..

రేపు కూడా వస్తాం: షహీన్‌బాగ్ మధ్యవర్తులు

న్యూఢిల్లీ: షహీన్‌బాగ్ నిరసనకారులతో బుధవారంనాడు మొదలైన మధ్యవర్తుల చర్చలు గురువారంనాడు కూడా జరుగనున్నాయి. గత రెండు నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న షహీన్‌బాగ్‌ నిరసనకారులతో చర్చలకు రంగంలోకి దిగిన మధ్యవర్తుల బృందం రేపు కూడా చర్యలు కొనసాగిస్తామని తెలిపింది.


'వారిని (నిరసనకారులు) కలిసాం. వారు చెప్పింది విన్నాం. ఒకరోజుతో చర్చలు పూర్తి చేయడం సాధ్యం కానందున మేము మళ్లీ రావాలని కోరుకుంటే వస్తామని చెప్పాం. రేపు కూడా రావాలని వారు కోరారు. అలాగే చేస్తాం' అని మధ్యవర్తుల బృందంలో ఒకరైన న్యాయవాది సాధనా రామచంద్రన్ తెలిపారు.


అంతకుముందు, చర్చల్లో భాగంగా నిరసనకారులతో రామచంద్రన్ మాట్లాడుతూ, నిరసన తెలిపే హక్కు మనకు ఉన్నట్టే, పబ్లిక్ రోడ్లు, సర్వీసులు ఉపయోగించుకునే హక్కు ఇతరులకు కూడా ఉంటుందని అన్నారు. మనలాగే ఇతరులకు కూడా రోడ్లు ఉపయోగించుకునే హక్కు, దుకాణాలు తెరిచే హక్కు, స్కూళ్లకు చేరుకునే హక్కు ఉంటుందని, తమ హక్కుల కోసం ఇతరుల హక్కులను కాలరాయడం సరికాదని నచ్చజెప్పారు. అందరు చెప్పేది పూర్తిగా వింటానని, అంతా కలిసి ఒక పరిష్కరానికి రావడం ద్వారా దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఉదాహరణగా నిలుద్దామని హితవు పలికారు. కేవలం మన కోసం మనం ఆలోచించడం కాకుండా అందరి కోసం ఆలోచించాలనే సందేశాన్ని ప్రపంచానికి చాటాలని ఆమె అన్నారు.


సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే సైతం నిరసనకారులకు సుప్రీంకోర్టు ఆదేశాలను చదివి వినిపించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి తాము ఇక్కడకు వచ్చామని, పరస్పర సహకారంతో ఒక పరిష్కారం కనుగొందామని సూచించారు.

Updated Date - 2020-02-20T02:36:07+05:30 IST