నిబంధనలకు సమాధి

ABN , First Publish Date - 2021-05-11T05:46:42+05:30 IST

కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలోని తిరుమలకొండ ప్రాంతం ముగ్గురాళ్ల నిక్షేపాలకు నిలయం.

నిబంధనలకు సమాధి
మామిళ్లపల్లె ముగ్గురాళ్ల మైనింగ్‌ వద్ద సోమవారం పరిశీలిస్తున్న మైన్‌ సేఫ్టీ అధికారులు

ఆది నుంచి నిబంఽధనల ఉల్లంఘనే

మైన్‌సేఫ్టీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వని వైనం 

నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికుల నియామకంలో విఫలం

నిర్లక్ష్యమే పది మంది మృతికి కారణం

నిగ్గుతేల్చేందుకు ఉన్నత సాయి కమిటీ 

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు 


కాసులు కురిపిస్తున్న ముగ్గురాళ్ల గనిలో భద్రతా నిబంధనలు సమాధి చేశారు. నోట్ల కట్టలతో అధికారుల నోళ్లు మూయించారు. ఇది తప్పని ప్రశ్నిస్తే అధికార బలంతో ఆ గొంతు మూగబోయేలా చేశారు. అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌లో పొట్టకూటి కోసం పనులకు వెళ్లే కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భద్రత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది మంది కూలీల ప్రాణాలు బలితీసుకున్న మామిళ్లపల్లె ముగ్గురాళ్ల మైనింగ్‌ (బెరైటీస్‌) లీజు దారుడు మైన్‌సేఫ్టీ (నెల్లూరు)కు లేఖ ఇవ్వలేదు. నైపుణ్యం కల్గిన సిబ్బంది, కార్మికులను నియమించుకోలేదు. తవ్వేకొద్ది ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి.


(కడప- ఆంధ్రజోతి): కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలోని తిరుమలకొండ ప్రాంతం ముగ్గురాళ్ల నిక్షేపాలకు నిలయం. సర్వే నెంబర్‌ 1, 133 పరిధుల్లో 30 హెక్టార్లలో బెరైటీస్‌ మైనింగ్‌ కోసం కడప నగరానికి చెందిన వైసీపీ ఎమెల్సీ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య సతీమణి సి.కస్తూరిబాయి పేరుతో దరఖాస్తు చేసుకోగా... 2001 నవంబర్‌ 2 నుంచి 2021 నవంబర్‌ 1వ తేదీ వరకు 20 ఏళ్ల మైనింగ్‌ కోసం గనులు, భూగర్భ వనరులశాఖ లీజు ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ 1తో లీజు గడువు ముగుస్తుంది. అయితే... ఈ మైనింగ్‌ నిర్వహణ సర్వహక్కులు 2013లో మైదుకూరు నియోజకవర్గం బి.మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు నాగేశ్వర్‌రెడ్డికి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అథారిటీ (జీపీఏ) ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడ మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ మైనింగ్‌లోనే శనివారం జరిగిన మందుగుండు పేలుళ్లలో పది మంది మృత్యువాత పడ్డారు.

మైన్‌సేప్టీ అధికారులకు లేఖ ఏదీ...?

గనులశాఖ నుంచి మైనింగ్‌ లీజు అనుమతులు తీసుకున్నాక.. ఆ ప్రాంతంలో మైనింగ్‌ చేపట్టే సమయంలో లీజు యజమాని నెల్లూరులో ఉంటున్న మైన్‌సేఫ్టీ అధికారులకు లేఖ (నోటీసు) ఇవ్వాలి. ఆ లేఖ ఆధారంగా మైన్‌సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌, ఇతర భద్రతా నిపుణులు తరచూ మైనింగ్‌ను పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా నిబంధనలను అతిక్రమిస్తే వాటిని సరిచేసే అవకాశం ఉంది. అయితే.. 2001 నవంబర్‌ 2వ తేదీన లీజు అనుమతులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లీజు దారుడు కానీ, మైనింగ్‌ నిర్వహణ జీపీఏ హక్కులు తీసుకున్న నాగేశ్వర్‌రెడ్డి కానీ మైన్‌సేఫ్టీ అధికారులకు నోటీసు ఇవ్వలేదు. అంటే దాదాపు 20 ఏళ్లుగా మైన్‌సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకుండా మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మైన్‌సేఫ్ట్టీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ మైనింగ్‌లో లీజు దారుల తరపున సమీప బంధువులు అతి కొద్దికాలం మాత్రమే మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించారు. ఎక్కువశాతం పులివెందుల నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి తండ్రి ఇక్కడ బైరెటీస్‌ మైనింగ్‌ నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన మధ్యర్తిత్వంతోనే 2013లో లీజుదారులు నాగేశ్వర్‌రెడ్డికి మైనింగ్‌ నిర్వహణ జీపీఏ హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ అధికార పార్టీ వైసీపీ ముఖ్య నాయకులే. దీంతో అక్కడ భద్రత చర్యలు తీసుకుంటున్నారా, మైన్‌సేప్టీ అనుమతులు ఉన్నాయా అన్నది అటు రెవెన్యూ, ఇటు పోలీసు, మైనింగ్‌ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ నాడే అధికారులు స్పందించి ఉంటే ఈ రోజు పది మంది కూలీలు మృత్యువాత పడేవారు కాదని పలువురు అంటున్నారు.

నైపుణ్యం కల్గిన సిబ్బంది, కార్మికులు ఏరీ..

బెరైటీస్‌ మైనింగ్‌ నిర్వహణ హక్కులు తీసుకున్న నాగేశ్వర్‌రెడ్డి మైన్‌సేఫ్టీ (నెల్లూరు) నిబంధనలకు విరుద్ధంగా నైపుణ్యం లేని కార్మికులతో భూగర్భ మైనింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మైన్‌సేఫ్టీ నిబంధనల ప్రకారం నైపుణ్యం (క్వాలిఫైడ్‌) కలిగిన మేనేజర్‌ను నియమించుకోవాలి. అలాగే సుక్షితులైన ఫోర్‌మెన్‌, మైనింగ్‌మేట్‌, బ్లాస్టర్‌లను నియమించుకోవాలి. వారి పరిరక్షణలోనే మైనింగ్‌ జరపాలి. గనుల్లో పనిచేసే కార్మికులకు ఒకేషినల్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలి. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి కనీస పరిజ్ఞానం లేని కార్మికులతో బెరైటీస్‌ మైనింగ్‌, పేలుళ్లు నిర్వహిస్తున్నట్లు వెలుగుచూసింది. అంటే కొన్నేళ్లుగా మైనింగ్‌ నిర్వహణలో భద్రతా నిబంధనలు మైన్‌సేఫ్టీ రూల్స్‌ను అతిక్రమిస్తున్నా జిల్లా యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా జిల్లాలో ఇలాంటి మైన్స్‌ ఎన్ని ఉన్నాయో..?

విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

మామిళ్లపల్లె మైనింగ్‌ పేలుళ్ల ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కడప జేసీ (రెవెన్యూ) గౌతమి చైర్‌పర్సన్‌గా ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో అడిషినల్‌ ఎస్పీ దేవప్రసాద్‌, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, మైనింగ్‌ డీడీ బాలాజీనాయక్‌, నెల్లూరుకు చెందిన మైన్‌సేఫ్టీ డీడీ యోహన్‌యేజర్ల, విశాఖపట్టణానికి చెందిన ఎక్స్‌క్లోజీవ్‌ డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్‌ రవికుమార్‌లను నియమించారు. సోమవారం విచారణ ఉత్తర్వులు కడప కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లోగా సమగ్ర విచారణతో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.


సమగ్ర విచారణ చేస్తాం

- గౌతమి, జేసీ

మామిళ్లపల్లె బెరైటీస్‌ మైనింగ్‌లో జరిగిన పేలుళ్లలో పది మంది మృతిపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి నేనే చైర్‌పర్సన్‌గా ఉన్నాను. వివిధ విభాగాల అధికారులతో కలిసి మైనింగ్‌ ప్రదేశాన్ని పరిశీలించడమే కాకుండా అన్ని రకాల పత్రాలను పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. 


మైన్‌సేఫ్టీకి సమాచారం లేదు

- యోహాన్‌యేజర్ల, మైన్‌సేఫ్టీ డీడీ, నెల్లూరు

గనులశాఖ నుంచి మైనింగ్‌ తీసుకున్న లీజు దారుడు మైనింగ్‌ ప్రారంభిస్తున్నట్లు మైన్‌సేఫ్టీ విభాగానికి నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసు ఇచ్చిన తర్వాతే మేము తరచుగా ఆ మైనింగ్‌ను తనిఖీలు చేసి మైనింగ్‌లో మైన్స్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తాం. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సరిచేస్తాం. ప్రమాదం జరిగిన మామిళ్లపల్లె మైనింగ్‌ లీజు దారుడు 2001 నుంచి ఇప్పటి దాకా మాశాఖకు ఎలాంటి నోటీసు కానీ, మైనింగ్‌ జరుపుతున్నట్లు సమాచారం కానీ ఇవ్వలేదు. అక్కడ నైపుణ్యం కల్గిన సిబ్బంది, కార్మికులను కూడా నియమించుకోలేదని మా ప్రాథమిక విచారణలో తేలింది.


Updated Date - 2021-05-11T05:46:42+05:30 IST