దిగొస్తున్న టమోటా ధరలు

ABN , First Publish Date - 2021-11-29T06:50:25+05:30 IST

కొద్దిరోజులుగా సామాన్య, మధ్యతరగతి వర్గాలను బెంబేలెత్తించిన టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక సమయంలో ధరలు సెంచరీ దాటి దూసుకెళ్లడంతో అన్నివర్గాల ప్రజలనుంచి ఆందోళన వ్యక్తమైంది. రెండురోజులుగా నెమ్మదినెమ్మదిగా ధరలు తగ్గుతున్నాయి.

దిగొస్తున్న టమోటా ధరలు

రైతు బజారులో కిలో రూ.45
రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 28: కొద్దిరోజులుగా సామాన్య, మధ్యతరగతి వర్గాలను బెంబేలెత్తించిన టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక సమయంలో ధరలు సెంచరీ దాటి దూసుకెళ్లడంతో అన్నివర్గాల ప్రజలనుంచి ఆందోళన వ్యక్తమైంది. రెండురోజులుగా నెమ్మదినెమ్మదిగా ధరలు తగ్గుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో ఆదివారం టమోటా ధరలు గణనీయంగా పడిపోయినట్టు ఇక్కడి వ్యాపారులకు సమాచారం అందడంతో సోమవారం వీటి ధర మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని రైతుబజార్లలో కిలో టమోటా రూ.45కు విక్రయిస్తుండగా హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.42కు అమ్ముతున్నారు. తోపుడుబండ్లు, ఇతర బహిరంగ మార్కెట్లలో మాత్రం ధరల్లో తగ్గుదల నామమాత్రంగా ఉంది. ఇక్కడ కిలో రూ.60-రూ.70 వరకూ విక్రయించడం గమనార్హం. మరో వారం, పదిరోజుల్లో లోకల్‌ పంట మార్కెట్లోకి వస్తే టమోటా ధర మరింత పతనం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వంటివి రాకుండా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి వరకూ టమోటా ధరలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక కూరగాయల ధరలు మాత్రం సామాన్యులకే కాదు మధ్య తరగతికి కూడా అందుబాటులో లేవు. రాజమహేంద్రవరం రైతుబజార్లలో దొమ్మేరు వంకాయలు కిలో రూ.60 పలుకుతున్నాయి. నలుపు, గులాబీ రకాలు రూ.40, రూ.48కు విక్రయిస్తున్నారు. బీరకాయలు రూ.50, కాలీఫ్లవర్‌ పువ్వు రూ.22, క్యాబేజీ రూ.32, క్యారట్‌ రూ.70, దొండకాయలు రూ.44, గోరుచుక్కుళ్లు రూ.40, చిక్కుడుకాయలు రూ.58, బీన్స్‌ గింజలు రూ.96 ధర ఉంది. బహిరంగ మార్కెట్లల్లో వీటి ధరలు మరింత ప్రియంగా ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కో వ్యాపారిదీ ఒక్కో రేటుగా ఉంది. ఉల్లిపాయల ధరలు మాత్రం నిలకడగానే కొనసాగుతున్నాయి. రైతు బజార్లలో కిలో రూ.29కు అమ్ముతుంటే తోపుడుబండ్ల వ్యాపారులు మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తున్నారు.

Updated Date - 2021-11-29T06:50:25+05:30 IST