టమోటా ఫీవర్ కలకలం?

ABN , First Publish Date - 2022-05-14T14:52:17+05:30 IST

కేరళలో ప్రబలుతున్న ‘టమోటా ఫీవర్‌’ రాష్ట్రాన్నీ వణికిస్తోంది. మరీ ముఖ్యంగా కేరళ సరిహద్దు ప్రాంతాలను ఆ జ్వరం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టమోటా ఫీవర్ కలకలం?

- కోవై ఆస్పత్రుల్లో 15 మంది చిన్నారులు

- అవన్నీ వదంతులే: ఆరోగ్యశాఖ


పెరంబూర్‌(చెన్నై): కేరళలో ప్రబలుతున్న ‘టమోటా ఫీవర్‌’ రాష్ట్రాన్నీ వణికిస్తోంది. మరీ ముఖ్యంగా కేరళ సరిహద్దు ప్రాంతాలను ఆ జ్వరం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కోయంబత్తూరులోని వివిధ ఆస్పత్రుల్లో అర్థంగాని జ్వర లక్షణాలతో పలువురు చిన్నారులు చేరడంతో ‘టమోటా ఫీవర్‌’ ఏమోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ‘టమోటా ఫీవర్‌’ వైరల్‌ ఫీవర్‌ వ్యాప్తి అధికంగా వున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ వైర్‌సను అడ్డుకొనేలా ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి కేరళ నుంచి వచ్చే వాహనాలు, ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేరళ సరిహద్దు ప్రాంతమైన కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌లో టమోటా ఫీవర్‌ లక్షణాలతో 12 ఏళ్లలోపున్న 15 మంది చిన్నారులు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గొంతులో నొప్పి, ఆహారం తీసుకొనే సమయంలో అధికంగా నొప్పి, చర్మంపై అక్కడక్కడా ఎర్రటి మచ్చలు ఏర్పడడం ఈ ఫీవర్‌ లక్షణాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ... కోవై కార్పొరేషన్‌లో జ్వరంతో 15 మంది చిన్నారులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని, ఇందుకు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 2, 3 కరోనా కేసులు మాత్రమే ఉంటున్నాయని, వారు కూడా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. కరోనా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రుల్లో ఎవరూ చికిత్స పొందడం లేదని తెలిపారు. ఈ విషయమై కోవై ప్రభుత్వాసుపత్రి డీన్‌ నిర్మల మాట్లాడుతూ... టమోటా ఫీవర్‌ లక్షణాలతో ఎవ్వరూ తమ ఆస్పత్రిలో చేరలేదన్నారు. ఒకవేళ అలాంటి లక్షణాలతో బాధితులు వస్తే వారిని చిన్నపిల్లల వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని, వారం రోజుల్లో ఈ వ్యాధి తగ్గిపోతుందని తెలిపారు. 


వదంతులు నమ్మొద్దు : రాధాకృష్ణన్‌

కోయంబత్తూరు కార్పొరేషన్‌లో టమోటా ఫీవర్‌ లక్షణాలు బయల్పడినట్లు వస్తున్న వార్తలు సత్యదూరమని రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. టమోటా ఫీవర్‌ వార్తలన్నీ కేవలం వదంతులేనన్నారు. శుక్రవారం ఆయన తిరుప్పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టమోటా ఫీవర్‌ కేసులు కేరళలో కూడా లేవని, కేవలం అనుమానమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘షవర్మా’ను నిషేధిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. షవర్మా తయారు చేసిన రెండు గంటల్లోపే విక్రయించాలని మాత్రమే తాము హోటళ్ల యజమానులను ఆదేశించామని వివరించారు. 

Read more