రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-09T15:41:49+05:30 IST

కరోనా రెండవ దశ నియం త్రణా చర్యలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందు లో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే

రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

- పూర్తిస్థాయిలో రవాణా సేవలు బంద్‌

- మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు

- యథావిధిగా అమ్మా క్యాంటీన్లు

- నేడు మినహాయింపు

- కిక్కిరిసిన టాస్మాక్‌ దుకాణాలు

- కిటకిటలాడిన నిత్యావసర వస్తువుల షాపులు


చెన్నై: కరోనా రెండవ దశ నియం త్రణా చర్యలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందు లో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ముఖ్య మంత్రి శుక్రవారం సాయంత్రం జిల్లాల కలెక్టర్లతో సమావే శమై పరిస్థితిని అంచనా వేసిన విషయం తెలిసిందే. జిల్లా ల్లో కరోనా వ్యాప్తి, చికిత్సపొందుతున్నవారి వివరాలు, ఆస్ప త్రుల్లో వైద్య ఉపకరణాలు, మందుల నిల్వలు, నియంత్రణ చర్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గత ఫిబ్రవరి నెలాఖరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజుకు 450 ఉండగా, శుక్రవారం ఒకేరోజు అత్యధికంగా 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి 10 శాతంకు పైగా నమోదవుతోంది. దీనిపై కలెక్టర్ల అభిప్రాయాలు, వైద్యనిపుణుల సూచనలు, సలహాల మేరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలకు సీఎం ఉత్తర్వులు జారీ చేశా రు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పార్క్‌లు, మ్యూజియం తదితరాలకు ప్రజలు వెళ్లేందుకు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, నిబంధనలు మరింత కఠినతరం చేసేలా 6వ తేదీ నుంచి కూరగాయల మార్కెట్ల్లు, చిల్లర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణులతో చర్చించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేది తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


నిబంధనలివేలివే..

- కేంద్ర హోంశాఖ అనుమతించిన మార్గాలు తప్ప, విదేశాలకు విమానసేవలు రద్దు చేసింది. ఈ నిషేధం రాష్ట్రంలో కూడా అమలులో ఉంటుంది.

- విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అందుకు  https://eregister.tnega.org అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. రాత్రి వేళల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చు.

- మూడు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌ పనిచేసేందుకు గత నెల 26 నుంచి నిషేధం విధించారు. ఈ కాంప్లెక్స్‌లలో పనిచేసే కూరగాయలు, చిల్లర దుకాణాలపై కూడా నిషేధం విధించారు. ఇవి మినహా చిల్లర, పండ్లు, కూరగాయల, మాంసం, చేపల విక్రయ దుకాణాలు మాత్రం ఏసీ వసతి లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతించారు. ఈ దుకాణాల్లో కూడా ఒకేసారి 50 శాతం మంది వినియోగదారులు ఉండేలా చూసుకోవాలి.

- సంపూర్ణ లాక్‌డౌన్‌ కాలంలో టాస్మాక్‌ మద్యం దుకాణాల మూసివేత.

- హోటల్స్‌, రెస్టారెంట్‌లలో పార్శిల్‌ సేవలకు మాత్రమే అనుమతి, టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేస్తాయి. హోటల్స్‌, టీ దుకాణాల్లో కూర్చొనేందుకు అనుమతించరు. హోటళ్లు, లాడ్జీల్లో ఇప్పటికే బస చేస్తున్న వారికి నిర్వాహకులే భోజనం అందించాలి.

- హోటళ్లు, లాడ్జీల్లో కొత్తగా బసచేసేందుకు అనుమతి లేదు. వ్యాపార రీత్యా వచ్చే వారు, వైద్యరంగానికి సంబంధించిన వారికి మాత్రం అనుమతి.

- ఆడిటోరియం, మైదానాలు, కమ్యూనిటీ హాళ్లలో రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య, ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం.

- ఇది వరకే ప్రకటించిన విధంగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి.

- రాష్ట్రవ్యాప్తంగా బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాదుకాణాలపై నిషేధం.

- సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, యోగా శిక్షణా కేంద్రాలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, అన్ని రకాల బార్లు మూసివేత.

- కోయంబేడు మార్కెట్‌ చిల్లర విక్రయ దుకాణాలపై విధించిన నిషేధం కొనసాగింపు. అలాగే, జిల్లా ప్రధాన కేంద్రాల్లోని మార్కెట్లలో చిల్లర దుకాణాలపై నిషేధం.

- అత్యవసర శాఖలు, సచివాలయం, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖలు, విపత్తుల నివారణ బృందాలు, హోంగార్డ్స్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖ, విద్యుత్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమం, మహిళాభివృద్ధి శాఖల కార్యాలయాలు మినహా మిగిలిన అన్ని శాఖల కార్యాలయాలు మూసివేత. ఉద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్లేలా రవాణా వసతి ఏర్పాటు. ఈ నిషేధం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు కూడా వర్తింపు.

- అన్నిరకాల ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, ఐటీ, ఐటీఈ కార్యాలయాలు పనిచేయడంపై నిషేధం. ఆయా కార్యాలయ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా ఏర్పాట్లు చేపట్టడం.

- అన్ని రకాల ప్రార్థనా స్థలాలకు ప్రజలకు అనుమతి లేదు. ఆలయాలు, మసీదులు, చర్చీల్లో జరిగే పూజలు, ప్రార్థనలు నిర్వాహకులు, ఉద్యోగులు మాత్రమే నిర్వహించాలి. అదే సమయంలో ఉత్సవాలకు అనుమతి లేదు.

- నీలగిరి జిల్లా, కొడైకెనాల్‌, ఏర్కాడు సహా అన్ని పర్యాటక ప్రాంతాలకు స్థానికులు, పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం.

- అన్ని బీచ్‌ ప్రాంతాలకు ప్రజలు వెళ్లడంపై నిషేధం.

- పార్కులు బొటానికల్‌ గార్డెన్స్‌, మ్యూజియం తదితరాలకు ప్రజలు వెళ్లడంపై నిషేధం.

- పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా కేంద్రాలు, వేసవి శిక్షణా తరగతుల నిర్వహణపై నిషేధం.

- స్విమ్మింగ్‌ ఫూల్స్‌, వివిధ రకాల క్రీడల శిక్షణ కేంద్రాల మూసివేత.

- జిల్లాలకు వెళ్లే, జిల్లాల్లో నడిచే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీలు, ఆటోల నిషేధం. వివాహాలు, అంత్యక్రియలు, ఇంటర్వ్యూలు, ఆస్పత్రులకు వెళ్లే వారు తగిన ఆధారాలతో వెళ్లేందుకు అనుమతి.


లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు...

- పాలు, దినపత్రికల వినియోగం, కొరియర్‌ సర్వీసులు, ఆస్పత్రులు, వైద్యపరీక్షల కేంద్రాలు, అంబులెన్స్‌లు, అంత్యక్రియలకు వెళ్లే వాహనాలు, సరకులు వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాలు, ఆక్సిజన్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తీసుకెళ్లే వాహనాలకు అనుమతి. వ్యవసాయ సంబంధిత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి.

- సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయాల్లో హాటళ్లలో ఉదయం 6 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పార్శిల్‌ సేవలకు అనుమతి. స్విగ్గి, జుమోటో సహా ఫుడ్‌ డెలివరీ చేసే వారికి నిర్ణీత సమయాల్లో మాత్రమే అనుమతి.

- యధావిధిగా అమ్మా క్యాంటీన్ల నిర్వహణ

- కూరగాయలు, పూలు విక్రయించే ఫుట్‌పాత్‌ దుకాణాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి.

- చిల్లర దుకాణాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి.

- న్యాయశాఖ మరియు కోర్టులు

- ప్రస్తుతం జరుగుతున్న భవన నిర్మాణాలకు అనుమతి.

- మీడియా, పాత్రికేయులు యధావిధిగా పనిచేయవచ్చు.

- వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.

- డేటా సెంటర్లు, వైద్యం, రెవెన్యూ, బ్యాంక్‌, రవాణా మరియు ఇతర అత్యవసర పనులకు అనుమతి.

- గోడౌన్లలో సరకులు ఎగుమతి, దిగుమతి, కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్‌లలో పనులకు అనుమతి.

- రైల్వేస్టేషన్లు, హార్బర్లు, విమానాశ్రయాలు, సరుకుల రవాణా వెళ్లే ఉద్యోగులకు అనుమతి.

- యథావిధిగా పెట్రోల్‌, డీజిల్‌ బంకులు

- బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, బీమా సంస్థలు 50 శాతం మంది ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి.

సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు రానున్న నేపథ్యంలో, శని, ఆదివారాలు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాలకు అనుమతి. శని, ఆదివారాల్లో సెలూన్లు పనిచేసేందుకు అనుమతి. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టాస్మాక్‌ మద్యం దుకాణాలు పనిచేసేందుకు అనుమతి. పొరుగు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆదివారం 24 గంటల బస్సు సేవలు.


కరోనాపై ఆరాతీసిన ప్రధాని మోదీ

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్‌ ద్వారా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యలను సీఎంను అడిగిన తెలుసుకున్న ప్రధాని, రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు అందించేలా 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాలని సీఎం విజ్ఞప్తి చేయగా, సత్వరం చర్యలు చేపడతామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే, జిల్లాల్లో కరోనా వ్యాప్తి, బాధితులకు అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్న ప్రధాని, కరోనా నియంత్రణకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 



Updated Date - 2021-05-09T15:41:49+05:30 IST