టోలో న్యూస్ జర్నలిస్టును విడిచిపెట్టిన తాలిబన్లు.. నిర్బంధంలో మరికొందరు!

ABN , First Publish Date - 2021-09-08T00:19:50+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల జోక్యాన్ని నిరసిస్తూ ఈ రోజు కాబూల్‌లో మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

టోలో న్యూస్ జర్నలిస్టును విడిచిపెట్టిన తాలిబన్లు.. నిర్బంధంలో మరికొందరు!

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల జోక్యాన్ని నిరసిస్తూ ఈ రోజు కాబూల్‌లో మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పాకిస్థాన్‌కు వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని కాబూల్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కలుసుకున్న నిరసనకారులు అక్కడి నుంచి పాకిస్థాన్ ఐఎస్ఐ డైరెక్టర్ బస చేసిన కాబూల్ సెరేనా హోటల్‌కు ర్యాలీ ప్రారంభించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 


ఈ నిరసనను కవర్ చేస్తున్న పలువురు జర్నలిస్టులు, కెమెరామెన్‌లను తాలిబన్లు అరెస్ట్ చేశారు. ఇందులో టోలో న్యూస్ కెమెరా పర్సన్ వాహీద్ అహ్మది కూడా ఉన్నారు. దాదాపు మూడు గంటలపాటు అతడిని నిర్బంధించిన తాలిబన్లు ఆ తర్వాత కెమెరా వెనక్కి ఇచ్చి విడిచిపెట్టినట్టు టోలో న్యూస్ పేర్కొంది. కెమెరాలోని ఫొటోలు కూడా అలాగే ఉన్నాయని తెలిపింది. 


టోలో న్యూస్ ఆఫ్ఘనిస్థాన్‌లో తొలి 24 గంటల న్యూస్ చానల్. పాక్ వ్యతిరేక నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను తాలిబన్లు అడ్డుకున్నారని, కెమెరాలు లాక్కున్నారని ఇంతకుముందు పేర్కొంది. అలాగే, నిరసనలు కవర్ చేసేందుకు వెళ్లిన తమ కెమెరామన్ వాహీద్ అహ్మది కెమెరాను లాక్కుని నిర్బంధించారని పేర్కొంది. దీంతో నిర్బంధంలో ఉన్న తమ కెమెరా పర్సన్‌ను విడిచిపెట్టాలని టోలో న్యూస్ హెడ్ లోట్‌ఫుల్లా నజాఫిజడా తాలిబన్లను అభ్యర్థించారు.  


ఆఫ్ఘనిస్థాన్‌లోని మరో ప్రముఖ న్యూస్ చానల్ అరియానా న్యూస్ జర్నలిస్టును, కెమెరామన్‌ను కూడా తాలిబన్లు నిర్బంధించారు. తన సహచరుడు సమీ జహేస్, కెమెరామన్ సమీమ్‌లను తాలిబన్లు నిర్బంధించారని అరియానా న్యూస్ జర్నలిస్ట్ బియాస్ హయస్ తెలిపారు. రెండు గంటలుగా వారి ఆచూకీ తెలియడం లేదని హయత్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, బల్ఖ్ ప్రావిన్స్‌లో నిరసనలను కవర్ చేస్తున్న తమ మరో కెమెరామన్‌ను కూడా తాలిబన్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని హయత్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T00:19:50+05:30 IST