Jul 20 2021 @ 16:50PM

Tollywood: స్టార్‌ కిడ్స్‌ వస్తున్నారు!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అక్కినేని నాగచైతన్య, అఖిల్‌, రానా, మంచు విష్ణు, మనోజ్‌, కల్యాణ్‌రామ్‌.. ఇలామంది హీరోలు వారసత్వంతో  పరిశ్రమలో అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వీరందరికీ కెరీర్‌ బిగినింగ్‌లోనే బ్యాగ్రౌండ్‌ అనేది ఉపయోగపడింది. ఆ తర్వాత స్వశక్తితో పైకొచ్చారు. ఇప్పుడు అభిమానులు ఈ అగ్రహీరోల వారసులను కూడా తెరపై చూడాలనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు తారల బిడ్డలు తెరపై తళుక్కుమన్నారు. మరికొందరు ఓ మంచి సినిమాతో లాంచ్‌ చేయాలని చూస్తున్నారు. ఆ కథేంటో చూద్దాం...


అకీరా సిద్ధమవుతున్నాడా...

పవన్‌కల్యాణ్‌ తనయుడు అకీరానందన్‌కు చదువుతోపాటు నటనపై కూడా ఆసక్తి ఉందని ఆయన మాజీ భార్య  రేణుదేశాయి పలు సందర్భాల్లో వెల్లడించారు. అకీరా తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అకీరా ఎంట్రీ ఎప్పుడో జరిగిపోయింది. తన తల్లి రేణుదేశాయి దర్శకత్వం వహించిన ‘ఇష్క్‌వాలా లవ్‌’లో అకీరా ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెరిశారు. హీరోగా కూడా త్వరలో నే అకీరా అడుగుపెడతాడనే వార్తలు వస్తున్నాయి. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే డాన్స్‌ నేర్చుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. 

ఘట్టమనేని మూడోతరం...

మహేశ్‌బాబు ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే కెరీర్‌ ప్రారంభించారు. ఆయన తనయుడు గౌతమ్‌ కూడా అదే దారిని ఫాలో అయ్యారు. మహేశ్‌ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో గౌతమ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో గౌతమ్‌ మహేశ్‌బాబు చిన్నప్పటి పాత్ర పోషించి మెప్పించారు. అయితే భవిష్యత్తులో గౌతమ్‌ సినిమాల్లోకి వస్తాడా లేదా అన్నది మహేశ్‌ అతనికే ఛాన్స్‌ ఇచ్చారు. పిల్లల ఇష్టాన్ని బట్టే ముందుకెళ్తాం అని మహేశ్‌–నమ్రతా తెలిపారు. మహేశ్‌ ముద్దుల కూతురు సితార కూడా నటన పట్ల ఆసక్తిగానే ఉంది. తనకు డాన్స్‌ మీద కూడా మంచి పట్టుంది. హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్రోజన్‌ 2’లో ఓ పాత్రకు సితార డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే! 

అల్లు నాలుగో తరం...

అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మూడు తరాల ఆర్టిస్ట్‌లు తెరపై సందడి చేశారు. ఇప్పుడు నాలుగో తరం ఆర్టిస్ట్‌ ఎంట్రీ కూడా ఖరారైంది. బన్నీ, అల్లు శిరీశ్‌ తర్వాత బన్నీ కుమారుడు అయాన్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తాడని గతంలో వార్తలొచ్చాయి. స్టార్‌కిడ్స్‌ లాంచ్‌ అంటే చాలా ప్రణాళికలు ఉంటాయి కదా? అయితే అయాన్‌ ముందు ఎంట్రీ ఇస్తాడనుకుంటే అర్హా రేసులోకి వచ్చింది. ఇటీవల బన్నీ తన గారాలపట్టీ అర్హా ఎంట్రీ గురించి అభిమానులకు తియ్యని వార్త చెప్పారు. సమంత కీలక పాత్రధారిగా గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో అల్లు అర్హా ప్రిన్స్‌ భరతగా నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవల బన్నీ, ‘శాకుంతలం’ టీమ్‌ వెల్లడించింది. చిన్నారి అర్హా ఎంట్రీతో అల్లు అర్జున్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయాన్‌ విషయానికొస్తే.. ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో వేదికపై ఈ బుడతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వేదిక ఎక్కగానే మెచూర్డ్‌ ఆర్టిస్ట్‌లా ఆడియన్స్‌కి అభివాదం చేయడంతో ఆహుతులంతా ఆశ్యర్యపోయారు. ఇంత యాక్టివ్‌గా ఉండే కుర్రాడిని అభిమానులు హీరోగా కోరుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. బన్ని కూడా ‘విజేత’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలతో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అయాన్‌ విషయంలోనూ బన్నీ అలాగే ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేస్తారని టాక్‌. 

నందమూరి ఫ్యామిలీలో ముగ్గురు...

1991లోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి  పాత్రతో ఆకట్టుకున్న ఆయన ‘రామాయణం’ సినిమాలో రాముడిగా ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో మెప్పించారు. ఆయన తనయుడు అభయ్‌రామ్‌ కూడా హైపర్‌ యాక్టివ్‌ కిడ్‌. అతన్ని కూడా ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసే సన్నాహాల్లో ఉన్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లో మొదట అభయ్‌రామ్‌నే అనుకున్నారట. ఇప్పుడు ఆ అవకాశం అల్లు అర్హాకు వరించింది. అయితే అదే చిత్రంలో మరో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌కు స్కోప్‌ ఉందట. ఆ పాత్రకు అభయ్‌రామ్‌ను తీసుకునే ఛాన్స్‌ ఉందని ఎన్టీఆర్‌ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ ‘దానవీర శూరకర్ణ’ బాలల చిత్రంతో తెరపై కనిపించిన సంగతి తెలిసిందే! కల్యాణ్‌రామ్‌ తనయుడు శౌర్య రామ్‌ కూడా ‘ఇజం’ సినిమాతో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారులు వారసులుగా దూసుకెళ్తారని తెలుస్తోంది. 

చదువు తర్వాతే...

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి స్వశక్తితో హీరోగా ఎదిగారు రవితేజ. తాజాగా ఆయన తనయుడు మహాధన్‌ కూడా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ తనయుడు తళుక్కుమన్నాడు. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిన మహాధన్‌ తర్వాత సినిమాల్లోకి వస్తాడని రవితేజ పలుమార్లు చెప్పారు. తన ఇష్టాన్ని కాదనని ఆయన పలుమార్లు వెల్లడించారు. 

అలాగే దర్శకులు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మరో యువ దర్శకుడు గోపీచంద్‌ మలినేని తనయుడు కూడా ‘క్రాక్‌’ సినిమాతో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.