మల్టీస్టారర్లకు మహర్దశ

ABN , First Publish Date - 2022-03-20T05:30:00+05:30 IST

ఏ సినిమాకైనా మూలం, ప్రాణం కథే. ఆ కథని నడిపించేవాడే కథానాయకుడు. హీరో చేసే విన్యాసాలు చూడ్డానికే జనం థియేటర్లకు వెళ్తారు అది ఫాంటసీ అని తెలుసు...

మల్టీస్టారర్లకు మహర్దశ

ఏ సినిమాకైనా మూలం, ప్రాణం కథే. ఆ కథని నడిపించేవాడే కథానాయకుడు. హీరో చేసే విన్యాసాలు చూడ్డానికే జనం థియేటర్లకు వెళ్తారు అది ఫాంటసీ అని తెలుసు. లార్జన్‌ దెన్‌ లైఫ్‌ పాత్రలనీ తెలుసు. కానీ ప్రేక్షకులు ఆ మాయలో ఉండడానికే ఇష్టపడతారు. హీరోల్ని వెండి తెర వేల్పులుగా చేసేసుకుంటారు. అందుకే హీరోలకూ, హీరోయిజానికి అంత క్రేజ్‌.  ఏ కథకైనా ఒక్కడే హీరో. ఇద్దరుంటే అది మల్టీస్టారర్‌ అయిపోతుంది. ఒకేసారి, ఒకే తెరపై ఇద్దరు హీరోల్ని చూడడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది?  అందుకే మల్టీస్టారర్‌ ఓ సక్సెస్‌ ఫార్ములా. దురదృష్టవశాత్తూ తెలుగులో ఇద్దరు, ముగ్గురు హీరోలు కలసి సినిమాలు చేయడం చాలా అరుదైన సంగతి అయిపోయింది.


బాలీవుడ్‌ లో చాలా కామన్‌ గా కనిపించే మల్టీస్టారర్లు... తెలుగులో ఎప్పుడోగానీ కనిపించవు. ఇద్దరు హీరోలు కలిసి పనిచేయడానికి ఎన్నో లెక్కలు, సూత్రాలు అడ్డొస్తుంటాయి. మల్టీస్టారర్లు మరి రావులే... అనుకుంటున్న దశలో - ఇప్పుడు టాలీవుడ్‌ మొత్తం మల్టీస్టారర్లతో హోరెత్తిపోతోంది. ఎన్టీఆర్‌ - చరణ్‌ కలిసి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేయడంతో మల్టీస్టారర్లకు మహర్థశ మొదలైనట్టు అనిపిస్తోంది.


ఈమధ్య కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. కాకపోతే.. అవన్నీ వేరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేరు. ఒకే తరంలో, దాదాపుగా ఒకే స్థాయి ఉండి, వేర్వేరు కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి ఓ సినిమా చేయడం వల్లే అంత క్రేజ్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ .. ఇద్దరి క్రేజ్‌, ఇమేజ్‌, ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ వంద కోట్ల సినిమాలు తీసిన హీరోలే. ఇద్దరి పేరు మీద ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. పైగా వీళ్లకు రాజమౌళి తోడయ్యారు. వెరసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు పాన్‌ ఇండియా వ్యాప్తిగా బజ్‌ మొదలైంది. ఈ సినిమా మార్కెట్‌, బడ్జెట్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో తయారైన ఖరీదైన చిత్రాల్లో కచ్చితంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి స్థానం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వల్ల తెలుగులో మల్టీస్టారర్లు మరిన్ని వస్తాయన్న భరోసా ఏర్పడింది. సమాన స్థాయి ఉన్న ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అంత కష్టమైన విషయం ఏమీ కాదన్న విషయాన్ని ఈ కాంబో తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఏ ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి పనిచేయడానికి సిద్ధపడినా... అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న సంకేతాలు ఇచ్చింది.



రెండు తరాలకు చెందిన స్టార్స్‌ కలిసి పనిచేయడం కూడా క్రేజీ విషయమే. ‘వాల్తేరు వీరయ్య’తో అది చూసే అవకాశం కలగబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా రవితేజ కనిపించబోతున్నారు. చిరుకి రవితేజ వీరాభిమాని. ‘అన్నయ్య’ లో ఓ తమ్ముడిగా నటించారు రవితేజ. శంకర్‌ దాదా జిందాబాద్‌ లో ఓ పాటలో మెరిశారు. ఆ తరవాత.. రవితేజ అంచెలంచెలుగా ఎదిగి స్టార్‌ అయిపోయారు. ఇప్పుడు స్టార్‌ హోదాలో మరోసారి తన అభిమాన హీరో పక్కన కలిసి నటించే అవకాశం వచ్చింది. కచ్చితంగా ఈ కాంబో.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేదే.


మహేష్‌ బాబు - బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్‌ లో టాక్‌ మొదలైంది. ఈ వార్త నమ్మడానికి ఓ బలమైన కారణం ఉంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కావడమే. సర్కారు వారి పాట తరవాత, మహేష్‌ చేసే సినిమా రాజమౌళి తోనే. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందని, అందులో బాలకృష్ణ నటించే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది. రాజమౌళికి ఏదైనా సాధ్యమే కాబట్టి... ఈ కాంబో చూడడం దాదాపు ఖాయం అనుకోవచ్చు.



మల్టీస్టారర్లకు తాను సిద్ధమే అని ‘భీమ్లా నాయక్‌’తో సంకేతాలు పంపారు పవన్‌ కల్యాణ్‌. డానిగా భీమ్లాకు పోటీ ఇచ్చే పాత్రలో రానా నటన.. ప్రశంసలు దక్కించుకొంది. ఇప్పుడు పవన్‌ చేతిలో రెండు మల్టీస్టారర్లు ఉన్నాయి. ఓ సినిమాలో పవన్‌ - సాయిధరమ్‌ తేజ్‌ తో కలిసి నటిస్తున్నారని, మరో సినిమాలో పవన్‌ తో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఓ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. హీరోలంతా ఒకటే కుటుంబానికి చెందినవాళ్లు కావడం వల్ల... కాస్త ఆసక్తి ఏర్పడుతుంది.


అక్కినేని హీరోలూ తరచూ కలిసి నటించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ‘బంగార్రాజు’లో నాగ్‌, నాగచైతన్య ఒకే ఫ్రేములో కనిపించడం అక్కినేని అభిమానుల్ని అలరించింది. త్వరలో నాగ్‌ - అఖిల్‌ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని టాక్‌. కథ ఇప్పటికే సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ‘ఆచార్య’లోనూ చిరంజీవి - రామ్‌ చరణ్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ‘మగధీర’, ‘ఖైదీ నం.150’లో చిరు, చరణ్‌ కలిసి కనిపించారు. కానీ ‘ఆచార్య’లో చరణ్‌ కీలక పాత్రధారి.



చిరంజీవి, అల్లు అర్జున్‌ కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ‘అన్నాయ్‌’ అనే ఓ కథ రాసుకున్నారు. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. ఇది చిరు, బన్నీల కోసమే రాసిన కథ అని సమాచారం. గీతా ఆర్ట్స్‌ఈ కథకెప్పుడో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే.. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలో చిరు - సల్మాన్‌లపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఆ రకంగా ఇది కూడా మల్టీస్టారర్‌ అనుకోవచ్చు.


మల్టీస్టారర్లు తయారవ్వడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే.. ఇది వరకు హీరోల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎవరి లెక్కలు వారివి. బడ్జెట్‌ కూడా అనుకూలంగా ఉండేది కాదు. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిస్తే.. వాళ్ల పారితోషికానికే వంద కోట్లు అయిపోతుంది. ఇక సినిమా తీయడానికి ఎంత అవుతుంది?  అయితే ఇప్పుడు ఆ భయం లేదు. తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగింది. ఎంత ఖర్చు పెట్టినా, తిరిగి రాబట్టుకోవచ్చన్న నమ్మకం ఏర్పడింది. అందుకే.. పారితోషికాల గురించి ఆలోచించడం లేదు. పైగా హీరోలు సినిమా నిర్మాణంలో తమ పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. లాభాల్లో వాటా ఇస్తున్నప్పుడు పారితోషికం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. అందుకే మల్టీస్టారర్లు ఇంత ఈజీగా సెట్‌ అవుతున్నాయి. కావల్సిందల్లా ఇద్దరు హీరోలకు సరిపడే కథ. వాళ్ల ఇమేజ్‌ని బాలెన్స్‌ చేసే పాత్రలు. ఈ విషయంలో తేడా రాకుండా చూసుకుంటే చాలు. మల్టీస్టారర్లతో టాలీవుడ్‌ కళకళలాడిపోతుంది.



‘‘ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు.. ఓ హీరోకి ఎన్ని సీన్లు ఇచ్చాను, రెండో హీరోకి పాటలెన్ని ఇచ్చాను?  అలాంటివి ఆలోచించకూడదు. కథని కథలా చూడాలి. ఈ లెక్కలేసుకుంటే కథ మిగలదు. ఏ కథ చెప్పాలనుకున్నా ఏమోషన్‌ చాలా కీలకం. మనం అనుకున్న ఎమోషన్‌ పండించామా, లేదా అనేది చూసుకోవాలి. రెండు క్యారెక్టర్లని సమానంగా ప్రేక్షకులు ప్రేమించాలి. సింపతీ, ఎంపథీ రెండూ కలగాలి. అప్పుడే ఆ పాత్రలతో ప్రయాణం చేస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో నేను పాటించిన సూత్రమిదే’’

- రాజమౌళి



‘‘ఈతరం చాలా మారిపోయింది. స్ర్కీన్‌ స్పేస్‌ ఎంత ఉంది?  అనే లెక్కలు ఎవరూ వేసుకోవడం లేదు. ఇక మీదట తప్పకుండామరిన్ని మల్టీస్టారర్లు వస్తాయి. నేను కూడా అందరితోనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. బన్నీతో, ప్రభాస్‌తో, మహేష్‌తో.. బాలయ్య బాబాయ్‌తో, చిరంజీవి గారితో.. ఇలా ప్రతి ఒక్కరితోనూ సినిమాలు చేయాలని వుంది. భవిష్యత్తులో ఏ కాంబో సెట్‌ అయినా ఎవరూ ఆశ్చర్యపోరు’’

- ఎన్టీఆర్‌

Updated Date - 2022-03-20T05:30:00+05:30 IST