Jul 24 2021 @ 18:44PM

Heros: వందల రోజులు గ్యాప్‌ తీసుకోలేదు.. కరోనా తెచ్చిందంతే!

స్టార్‌ హీరోలు వెండితెరపై కనువిందు చేసి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. భారీ చిత్రాలు చేయడం వల్ల షెడ్యూళ్లకు ఎక్కువ సమయం తీసుకోవడం ఒక కారణమైతే, కరోనా, లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడడం, షూటింగ్‌లు ఆగిపోవడం మరో కారణం. దీనితో ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. ప్రేక్షకులు తమ అభిమాన హీరో సినిమా కోసం వేచి చూస్తున్నారు. మధ్యలో కొందరు హీరోలు ఓటీటీ బాట పట్టినా, మరికొందరు హీరోలు మాత్రం థియేటర్‌ రిలీజ్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇలా స్టార్లు తెరపై సందడి చేసి సుమారు 600లకు పైగా రోజులైంది. ఈ గ్యాప్‌ హీరోలు తీసుకొంది కాదు.. కరోనా ఇచ్చిన గ్యాప్‌ ఇది. ఆ హీరోలపై ఓ లుక్కేద్దాం. 


చిరంజీవి – 662 రోజులు...

చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ చిత్రం 2019 అక్టోబర్‌ 2న విడుదలైంది. ఆ సినిమా విడుదలై దాదాపు నేటికి ఒక సంవత్సరం తొమ్మిది నెలల 23 రోజులు అవుతుంది. అంటే 662 రోజులు అనమాట. ఇప్పటికీ చిరంజీవి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్‌ తుది దశలో ఉంది. కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది. 


వెంకీమామ – 595 రోజులు...

2019లో వెంకటేశ్‌ రెండు సినిమాలో సందడి చేశారు. అందులో సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌2’ ఒకటి కాగా, రెండోది డిసెంబర్‌ 13న విడుదలైన ‘వెంకీమామ’. ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే వెంకీకి కూడా కరోనా వల్ల పెద్ద గ్యాపే వచ్చింది. ‘నారప్ప’ చిత్రీకరణ పూర్తయినా లాక్‌డౌన్‌ వల్ల విడుదలకు నోచుకోలేదు. దాంతో వెంకీ సినిమా తెరపై కనిపించి ఒక సంవత్సరం ఏడు నెలల ఏడు రోజులు కావొస్తుంది. సినిమా నిర్మాణ బాగస్వామి ఒత్తిడితో ఎట్టకేలకు ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 


మహేశ్‌బాబు – 561 రోజులు

సూపర్‌స్టార్‌ మహేశ్‌ గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగి సక్సెస్‌ సాధించారు. గత రెండేళ్లగా మహేశ్‌ ఏడాదికి రెండు చిత్రాలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. కానీ డేట్లు, వర్కింగ్‌ డేస్‌ పెరగడం వల్ల రెండో సినిమా సాధ్యపడడం లేదని ఓ సందర్భంలో వెల్లడించారు. కాస్తవేగం పెంచి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయిన సందర్భంలో కరోనా ప్రపంచమే స్తంభించిపోయేలా చేసింది. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఆయన నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. మహేశ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు 561 రోజులు అయింది. తాజాగా నటిస్తున్న ‘సర్కార్‌వాటి పాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే మహేశ్‌ సినిమాను తెరపై చూడాలంటే మరో 170 రోజులు వేచిచూడాల్సిందే! 


ప్రభాస్‌ – 695 రోజులు...

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటించే చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతున్నవే! నిర్మాతలు కూడా ఆయన సినిమాలను ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. ఆయన హీరోగా విడుదలైన గత చిత్రం ‘సాహో’. దాని తర్వాత కాస్త స్పీడు పెంచి వరుసగా సినిమాలు అంగీకరించారు. అయితే సక్సెస్‌ పెరిగే కొద్ది భారీ అంచనాలతో ప్రభాస్‌ సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఈసారి దానికి కరోనా తోడైంది. విడుదల తేదీ ఖరారైన ‘రాధేశ్యామ్‌’ లాక్‌డౌన వల్ల వాయిదా పడింది. అంటే ప్రభాస్‌ సినిమాను ప్రేక్షకులు చూసి దాదాపు ఒక ఏడాది పది నెలల 25 రోజులు అవుతుంది. అంటే 695 రోజులు. ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఆయన ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాల షూటింగ్‌ చేస్తున్నారు. శనివారం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. 


జూనియర్‌ ఎన్టీఆర్‌ – 1018 రోజులు

‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత తారక్‌ నుంచి మరో సినిమా రాలేదు. అందుకు బలమైన కారణం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీ కావడమే. దీని కోసం దాదాపు రెండేళ్లు కేటాయించారు తారక్‌. ఇప్పటికీ ఆయన అభిమానులు, ప్రేక్షకులు తారక్‌ సినిమా చూసి 1018 రోజులు అవుతుంది. కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షెడ్యూళ్లు పొడగించడం తదితర కారణాలతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఈతరం హీరోల్లో ఇన్ని రోజులు తెరపై బొమ్మ పడకుండా ఉన్న హీరో తారక్‌ అనే చెప్పాలి. ఆయన సినిమా చూడాలంటే అక్టోబర్‌ 13 వరకూ వెయిట్‌ చేయాల్సిందే! 


రామ్‌చరణ్‌ – 926 రోజులు

2019 సంక్రాంతి బరిలో విడుదైన వినయ విధేయ రామ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అంత సక్సెస్‌ కాలేదు. ఆ తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజు పాత్రకు స్టిక్‌ అయ్యారు. కాస్త ఆలస్యం అయినా సక్సెస్‌ఫుల్‌ సినిమాతో అభిమానులను అలరించాలని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే 926 రోజులు తెరపై కనిపించన చెర్రీ ఈ అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.


అల్లు అర్జున్‌ - 560  రోజులు

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘బ్లాక్‌బస్టర్‌ సినిమా అల వైకుంఠపురములో’ సినిమా విడుదలై ఏడాదిన్నరకు పైగా అవుతోంది. స్లైలిష్‌స్టార్‌ మెస్మరైజింగ్‌ డాన్స్‌లను ఎంతో మిస్‌ అవుతున్నామని నెటిజన్లు ఇప్పటికే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది మొదటి భాగం, ఆ తర్వాత రెండో పార్టును విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. బన్నీని తెరపై చూసి ఇప్పటికి 560కి పైగా రోజులు అవుతుంది. వచ్చే ఏడాది అంటే మరో 180 రోజులు ఆగాల్సిందే! 


నాని, వరుణ్‌ తేజ్‌, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌, విజయ దేవరకొండ, అఖిల్‌ అక్కినేని సినిమాలు కాపీ రెడీ అయ్యి కూడా కరోనా వల్ల విడుదలకు నోచుకోలేదు.