Tollywood hero farm house Issue : పేకాట కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలే!

ABN , First Publish Date - 2021-11-04T13:34:09+05:30 IST

విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

Tollywood hero farm house Issue : పేకాట కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. అందరూ  ఎంపీలు, ఎమ్మెల్యేలే!

  • నార్సింగ్‌ పోలీసుల కస్టడీలో గుత్తా సుమన్‌
  • విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
  • వాట్సాప్‌ గ్రూపులు, కాల్‌ డేటాను జల్లెడపడుతున్న పోలీసులు
  • ప్రతివారం 200 మందితో గోవాకు.. 
  • వారి కోసం యువతుల తరలింపు 
  • క్యాసినోలో గెలిచేవారి డబ్బులో 40 శాతం వాటా

హైదరాబాద్‌ సిటీ : పేకాట, క్యాసినో దందా సూత్రధారి గుత్తా సుమన్‌ను బుధవారం కస్టడీలోకి తీసుకొని నార్సింగ్‌ పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అతడి కాల్‌డేటా, వాట్సాప్‌ గ్రూపుల్లో కీలకమైన సమాచారం లభించింది. సుమన్‌ ఫోన్‌ కాంటాక్ట్స్‌ జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అతడు పంపిన మెసేజ్‌లు, వాట్సాప్‌ చాట్‌లకు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సుమన్‌ నేరుగా మాట్లాడుతున్నాడా..? మధ్యవర్తుల సహకారంతో చర్చలు జరుపుతున్నాడా..? అనేది నిగ్గుతేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.


హోటళ్లు, ఫామ్‌హౌజ్‌లలో గదులను అద్దెకు తీసుకొని పేకాట, క్యాసినోలను సుమన్‌ నిర్వహించేవాడని విచారణలో వెల్లడైంది. ఈక్రమంలోనే ఒక యువ హీరో తండ్రితో ఉన్న పరిచయంతో నార్సింగ్‌లోని ఫామ్‌ హౌజ్‌ను ఒక్కరోజు అడిగి తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఆ ఫామ్‌ హౌజ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి గార్గ్‌దిగా పోలీసులు గుర్తించారు. దాన్ని యువ హీరో తండ్రి రెండేళ్లు లీజుకు తీసుకున్నట్లు గుర్తించారు. రెండు నెలల క్రితం గచ్చిబౌలి పరిధిలోని సుమధుర కాలనీలో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు సుమన్‌ను అరెస్టు చేశారు. అయితే ఆ ముఠాలో అతడు కేవలం ఆటగాడు మాత్రమే. నిర్వాహకులు వేరే వారు. ఇప్పటివరకు అతడిపై పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విజయవాడలో భూకబ్జా కేసు నమోదు కాగా.. మిగిలిన పోలీస్‌ స్టేషన్‌లలో చీటింగ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు.


క్యాసినో దందాలో ఆరితేరిన సుమన్‌.. ప్రతివారం గోవాకు 200 మందిని తీసుకెళ్లేవాడని విచారణలో బయటపడింది. వెళ్లిన వారికి సర్వీస్‌ చేయడానికి యువతులను కూడా తీసుకెళ్లేవాడని సమాచారం. గోవాలో క్యాసినో గేమ్స్‌ ఆడి డబ్బులు గెలుచుకున్న వారి నుంచి 40 శాతం కమీషన్‌ తీసుకొని, 60 శాతం వారికి ఇచ్చేవాడని తెలుస్తోంది. ఇలా బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి జూదరులు, పేకాటరాయుళ్లను ఆకర్షించేవాడని సమాచారం. గురువారం ఒక్కరోజు మాత్రమే కస్టడీ ఉండటంతో ముఖ్యమైన సమాచార సేకరణపైనే పోలీసులు దృష్టిసారించారు. 

Updated Date - 2021-11-04T13:34:09+05:30 IST