Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 31 2021 @ 03:56AM

నేడు ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం నుంచి విచారించనుంది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సెప్టెంబరు 22 వరకు 12 మందిని ప్రశ్నించనుంది. ప్రధానంగా డ్రగ్స్‌ లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్‌పైనే ప్రశ్నలు సంధించనుంది. మంగళవారం ఈడీ ముందు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ హాజరుకానున్నారు. నటుడు నవదీ్‌పకు చెందిన ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ నుంచి పూరీకి డ్రగ్స్‌ అందినట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో బయటకు వచ్చింది. ఈ కేసులో హీరోయిఇన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటులు రానా, రవితేజ తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.


ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు పెద్దమొత్తంలో నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కొనుగోలుకు నగదును ఎలా పంపారు? అసలు నగదు లావాదేవీలు ఎలా జరిగాయి? అనే కోణంలో విచారణ జరగనుంది. ఇప్పటికే డ్రగ్స్‌ కొనుగోలుపై ఎక్సైజ్‌ అధికారుల నుంచి ఈడీ సమాచారం సేకరించింది. గతంలో అరెస్ట్‌ అయిన నిందితులను విచారించి కీలక విషయాలను రాబట్టింది. కీలక నిందితుడు కెల్విన్‌ ప్రముఖులతో వాట్సా్‌పలో డ్రగ్స్‌ లావాదేవీలు జరిపాడు. ఆ వాట్సాప్‌ చాటింగ్‌పైనే సినీ ప్రముఖుల నుంచి ఈడీ వివరణ తీసుకోనుంది. కాగా, ఈ కేసులో మొత్తం 62 మందిని ఎక్సైజ్‌ అధికారులు గతంలో విచారించారు. సినీ ప్రముఖుల విచారణ పూర్తయిన తర్వాత.. మిగిలిన వారందరికి నోటీసులు పంపి ప్రశ్నించాలని ఈడీ భావిస్తున్నట్లు తెలిసింది. 

Advertisement
Advertisement