Jul 2 2021 @ 20:58PM

టాలీవుడ్‌ రివ్యూ: కరోనా కాటేసిన ఆరు నెలల్లో!

గత ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా పరిశ్రమ ఆశలన్నీ నిరాశలయ్యాయి. షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. దాంతో కాపీ రెడీ అయిన చిత్రాలు కూడా విడుదలకు నోచుకోలేదు. చిన్న బడ్జెట్‌ చిత్రాలు కొన్ని ఓటీటీ బాట పట్టి ప్రేక్షకులకు కాస్త వినోదాన్ని పంచాయి. కొన్ని పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. దీనితో సినిమాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చించి అనుకొనే లోపే సెకెండ్‌ వేవ్‌ ఉదృతి పెరిగింది. థియేటర్ల మూత పడడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. కరోనా కాటేసిన ఈ ఆరు నెలల్లో సినిమాల జర్నీ ఎలా ఉందో చూద్దాం. 


పండుగ సీజన్‌ అంటేనే సినిమా పరిశ్రమకు ఓ పండుగ. అదే సంక్రాంతి అంటే సినిమాలకు పెద్ద పండుగే. అగ్ర హీరోల సినిమాలన్నీ సంక్రాంతి బరిలో పోటీపడతాయి. అయితే ఈసారి సంక్రాంతికి కరోనా కారణంలో జనాలు థియేటర్లకు వస్తారా లేదా అన్న మీమాంసలో ఉండగా జనవరి 9న రవితేజ ‘క్రాక్‌’ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్లింది. 14న రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ‘రెడ్‌’, బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ పోటీ పడ్డాయి. ఈ రెండింటిలో ‘రెడ్‌’ పర్వాలేదనిపించింది. ‘అల్లుడు అదుర్స్‌’ ఆకట్టుకోలేకపోయింది. పండగ బరిలోనే తమిళ హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ కూడా విడుదలైంది. విజయ్‌ బాక్సాఫీస్‌ దగ్గర బాగానే సత్తా చూపించాడు. 23న విడుదలైన అల్లరి నరేశ్‌ బంగారు బుల్లోడు’, 29న విడుదలైన ప్రదీప్‌ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. కలెక్షన్ల పరంగా  ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ పర్వాలేదనిపించింది. ‘డర్టీ హరి’ మంచి వసూళ్లు రాబట్టింది.  ‘జై సేన’, ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. 


‘ఉప్పెన’లాంటి వసూళ్లతో...

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబి రెడ్డి’ ఫిబ్రవరి 5న విడుదలైంది. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించింది. వసూళ్లు కూడా బాగానే రాబట్టిందీ చిత్రం. అదే నెల 12న సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తొలి సినిమా సక్సెస్‌తో వైష్ణవ్‌, కృతిశెట్టి వరుసగా సినిమా అవకాశాలు అందుకున్నారు. రాయణంగా విజయ్‌ేసతుపతి విలనిజం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు 85 కోట్ల వసూళ్లు రాబట్టిందీ చిత్రం. అల్లరి నరేశ్‌ కొత్తగా ట్రై చేసిన ‘నాంది’ నరేశ్‌కు చాలా గ్యాప్‌ తర్వాత హిట్‌ రావడమే కాకుండా కొత్త తరహా చిత్రంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 26న నితిన్‌- చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘చెక్‌’ ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా బడ్జెట్‌ను కూడా క్రాస్‌ చేయలేకపోయింది.

సత్తా చాటిన ‘జాతిరత్నాలు’...

మార్చి ప్రారంభంలో విడుదలైన సందీప్‌ కిషన్‌ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ ఆకట్టుకోలేకపోయింది. 12న విడుదలైన శర్వానంద్‌ ‘శ్రీకారం’ ప్రశంసలు అందుకుంది.  వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘గాలి సంపత్‌’ కూడా అంతంత మాత్రంగానే ఆడింది.  నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఆకట్టుకుంది. సుమారు 50 కోట్లు వసూళ్లు చేసిందని టాక్‌. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ‘చావు కబురు చల్లగా’ థియేటర్‌లకు ప్రేక్షకుల్ని తీసుకురాలేకపోయింది. సుమంత్‌ ‘కపటధారి’ నిరాశకు గురి చేసింది. నెలాఖరులో విడుదలైన రానా దగ్గుబాటి ‘అరణ్య’, మంచు విష్ణు క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మోసగాళ్లు’, నితిన్‌ ‘రంగ్‌ దే’ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర చతికిలబడ్డాయి. 


వినోదం లేని వేసవి...

ఫస్ట్‌ వేవ్‌ తర్వాత థియేటర్లు తెరుచుకుని మెల్లగా వసూళ్లు రాబడుతున్న సమయంలో సెకెండ్‌ వేవ్‌ పేరుతో వైరస్‌ విజృంభించడంతో విడుదల తేదీలు ఖరారైన ‘లవ్‌స్టోరీ’, ‘విరాట పర్వం’, ‘టక్‌ జగదీష్‌’, ‘సీటీమార్‌’, పాగల్‌తో పాటు భారీ బడ్జెట్‌ చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాలన్నీ వేసవి చివర్లో ప్రేక్షకులను అలరించేవి. సెకెండ్‌ వేవ్‌తో షూటింగ్‌లు ఆగిపోవడంతో ‘ఆచార్య’, ‘నారప్ప’ తదితర చిత్రాలు ఇంకొన్ని రోజులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. 

పవన్‌ ఒక్కడే స్టార్‌...

ఏప్రిల్‌ 2న విడుదలైన నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ ప్రేక్షకుల ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. స్టార్‌ హీరోలు మహేశ్‌, బన్నీ, ఎన్టీఆర్‌, చరణ్‌ చిత్రాలు సెట్స్‌ మీద ఉండడంతో ఈ ఏడాది థియేటర్స్‌ను హిట్‌ చేసిన స్టార్‌ హీరో పవన్‌కల్యాణ్‌ ఒక్కరే! ఆయన లాయర్‌గా ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదలై వసూళ్ల వర్షం కురిపించి పవన్‌కల్యాణ్‌కు సూపర్‌ కమ్‌బ్యాక్‌ సినిమాగా నిలిచింది. దాదాపు రూ.130 కోట్ల వరకూ గ్రాస్‌ సాధించిందని సమాచారం. 

అనువాదాలు అంతంత మాత్రమే.. 

తెలుగులో విడుదలైన అనువాద చిత్రాల్లో ‘మాస్టర్‌’ ఒక్కటే సక్సెస్‌ అయింది. ధనుష్‌ ‘జగమే తంత్రం’ ఫెయిల్‌ అయింది. ‘రాబర్ట్‌’, ‘పొగరు’, ‘యువరత్న’, ‘చక్ర’, ‘గజ కేసరి’, ‘విక్రమార్కుడు’, ‘షకీలా’, ‘చితక్కొట్టుడు’ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఓటీటీలో కొత్త తరహా చిత్రాలు కొంత వరకూ బాగానే ఆకట్టుకున్నాయి. ‘ఆహా’ ఓటీటీలో మలయాళ చిత్రాల సంఖ్య పెరిగింది. మలయాళంలో హిట్టైన సినిమాలన్నీ తెలుగులో విడుదల చేశారు. అందులో ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’, ‘ట్రాన్స్‌’, ‘అనుకోని అతిథి’ ఆకట్టుకున్నాయి. ఇతర ఓటీటీల్లో విడుదలైన ‘సినిమా బండి’ సినిమా ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మెయిల్‌’, ‘ఏక్‌ మినీ కథ’ చిత్రాలు అలరించాయి. 

ఈ ఏడాది ప్రథమార్ధంలో తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలు 76 విడుదల కాగా, 15లోపు చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 16 అనువాద చిత్రాల్లో రెండు మూడు చిత్రాలే ఆకట్టుకున్నాయి. పవన్‌కల్యాణ్‌ మినహా మరో స్టార్‌ హీరో సినిమా లేకుండా ఈ ఏడాది మొదటి ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ తొలగిపోయింది. థియేటర్లు ప్రారంభించడానికి అనుమతి దక్కింది. ఇక ద్వితీయార్థంలోనైనా అగ్ర హీరోల సినిమా విడుదలై థియేటర్‌లకు కళను తీసుకొస్తాయని ఆశిద్దాం.