కార్పొ‘రేట్‌ వే..!’

ABN , First Publish Date - 2022-08-06T06:09:43+05:30 IST

కార్పొ‘రేట్‌ వే..!’

కార్పొ‘రేట్‌ వే..!’

కీసరలోని స్వర్ణ టోల్‌వే అదానీకి అప్పజెప్పే యత్నాలు

అభ్యంతరం చెబుతున్న రవాణా రంగ ప్రముఖులు

రేట్లు పెరిగి సంక్షోభం వస్తుందని ఆందోళన


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కార్పొరేట్‌ సంస్థ ‘అదానీ’కి రోడ్డు టోల్స్‌ అప్పగింత ప్రయత్నాలపై రవాణా రంగ రాజధాని బెజవాడ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో కీసర దగ్గర ఉన్న స్వర్ణ టోల్‌వేను అదానీకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, టోల్‌ప్లాజాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, అదానీ వంటివారు ప్రవేశిస్తే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్ర వ్యతిరేకత

విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ లారీ ఓనర్ల సంఘం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదానీ సంస్థ ఏ రంగంలో కాలుమోపితే అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ పరిణామం వల్ల ఆ సంస్థ కనుసన్నల్లోనే వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. ఇటీవల బొగ్గు వ్యాపారంలోకి అదానీ దిగటం వల్ల టన్ను రూ.2 వేల నుంచి రూ.20 వేలకు పెరిగిందని గుర్తు చేస్తున్నారు. జాతీయ రహదారులు అదానీ పరమైతే అడ్డగోలుగా టోల్‌ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. కేవలం మెయింటినెన్స్‌ కోసమే టోల్‌ప్లాజాలు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం కిలోమీటరుకు రూ.8 చొప్పున టోల్‌ ధరలను వసూలు చేస్తోందంటున్నారు. అదానీ వచ్చాక రూ.8 కాదు.. రూ.20 చెల్లించమంటే రవాణా రంగానికి మోయలేని భారంగా మారుతుందని పేర్కొంటున్నారు. టోల్‌ప్లాజాల రద్దు కోసం జాతీయస్థాయిలో ఆందోళనలు చేస్తున్న దశలో ఏకంగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబె డితే మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ వసూళ్లకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయలేదని, డబ్బు అందగానే టోల్‌ప్లాజాలను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతోందని రవాణా రంగ ప్రముఖులు చెబుతున్నారు. విజయవాడ-ఏలూరు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు టోల్‌ ముగిసినా, రద్దు చేయకుండా వసూలు చేయటం జరిగింద ంటున్నారు.  

రద్దు చేస్తామని చెప్పి ప్రైవేట్‌ పెత్తనమా..?

ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ సాక్షిగా ‘60 కిలోమీటర్ల దూరంలో ఒకటికి మించి ఉన్న టోల్‌ప్లాజాలను రద్దు చేస్తాం’ అని ప్రకటించారు. ఈ లెక్కన ఎన్టీఆర్‌ జిల్లాలో కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాల్లో ఒకటి, కృష్ణాజిల్లాలో పొట్టిపాడు, కలపర్రు టోల్‌ ప్లాజాల్లో ఒకటి చొప్పున రద్దు చేయాల్సి ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో కీసర వద్ద స్వర్ణ సంస్థ, చిల్లకల్లు వద్ద జీఎంఆర్‌ సంస్థ టోల్‌ప్లాజాలను నిర్వహిస్తున్నారు. ఈ రెంటిలో ఎక్కువకాలం పూర్తి చేసుకున్నది స్వర్ణసంస్థ. ఈ సంస్థను రద్దు చేస్తారని భావిస్తుండగా, అదే సంస్థ నిర్వహణలో ఉన్న టోల్‌ప్లాజాను అదానీ సంస్థ తీసుకోవాలనుకుంటోంది. అదానీకే కేంద్ర ఆశీస్సులు ఉంటాయి కాబట్టి, స్వర్ణ టోల్‌ప్లాజా ఒక్కటే కొనసాగుతుందని భావించాల్సి వస్తోంది. దీన్నిబట్టి చూస్తే చిల్లకల్లు వద్ద ఉన్న జీఎంఆర్‌ టోల్‌ప్లాజానే రద్దు చేయాల్సి ఉంటుంది. ఇక కృష్ణాజిల్లా విషయానికి వస్తే.. పొట్టిపాడు టోల్‌ప్లాజాను రద్దు చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం అదానీ సంస్థ ప్రైవేట్‌ చేతుల్లో ఉన్న టోల్‌ప్లాజాలనే కొనాలనుకుంటోంది. పీపీపీ విధానంలో ఉన్న టోల్‌ప్లాజాల జోలికి వెళ్లట్లేదు. దీనినిబట్టి చూస్తే ప్రస్తుతానికి కృష్ణాజిల్లాలో అదానీ కాలుమోపే పరిస్థితి లేదు. 


విపరిణామమే..

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాలు రద్దు చేయాలన్నది మా విధానం. దీనికోసం ఆందోళనలు నిర్వహిస్తున్నాం. జాతీయ స్థాయిలోని రవాణా రంగ నేతలు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. కేంద్ర నియంత్రణలో ఉన్నప్పటికీ సంస్థలు అడ్డగోలుగా టోల్‌ చార్జీలను పెంచుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడితే విపరిణామాలు తప్పవు. జాతీయ స్థాయిలో రవాణా రంగ నాయకులతో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తాం. - వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 



Updated Date - 2022-08-06T06:09:43+05:30 IST