భాగ్యనగరి.. బోనాల సిరి

ABN , First Publish Date - 2022-06-30T17:36:22+05:30 IST

బోనాలు అంటేనే హైదరాబాదీయులకు ప్రత్యేక పండుగ. ఒక ఉత్సవం. భక్తి శ్రద్ధలతో నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే

భాగ్యనగరి.. బోనాల సిరి

 తొలిబోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి..

 ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


హైదరాబాద్/నార్సింగ్‌: బోనాలు అంటేనే హైదరాబాదీయులకు ప్రత్యేక పండుగ. ఒక ఉత్సవం. భక్తి శ్రద్ధలతో నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఆషాఢ మాస బోనాలు నేటినుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. తొలిబోనం గోల్కొండ జగదాంభికా అమ్మవారు అందుకోవడం ఆదినుంచి వస్తున్న సంప్రదాయం. ఈ ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు, శ్రీ జగదాంబిక ట్రస్టు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

తొలిపూజ ఇక్కడి నుంచే..

చారిత్రక గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబిక(గోల్కొండ ఎల్లమ్మ) దేవాలయంలో  మొదటి పూజ జరిగిన తర్వాతే తెలంగాణలోని ఇతర జిల్లాలలో బోనాలు ప్రారంభమవుతాయి.  గోల్కొండ తర్వాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ  మహంకాళి ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక ఆషాఢ మాసంలో చివరి రోజు గోల్కొండ కోటలోనే తుదిబోనపు  పూజ జరుగుతుంది. దీంతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.   

నెలరోజుల జాతర

గురువారం నుంచి జూలై 28వతేదీ వరకు బోనాల జాతర జరుగనుంది. నెలరోజులపాటు ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. వీరి కోసం గోల్కొండలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడీగార్డ్స్‌ లైన్స్‌ ప్రాంతాలు సిద్ధం చేస్తున్నారు.       

మొదటిరోజు కార్యక్రమం ఇదీ..

వేడుకల్లో తొలిరోజు లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి అమ్మవారి భారీ తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘటం ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు నిర్వహిస్తారు. ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పిస్తారు.కేంద్ర పురావస్తు శాఖ బోనాలు జరిగే ఆదివారం, గురువారం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది.  ఆదివారం, గురువారాలలో మొదటి లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను రద్దు చేసింది.

Updated Date - 2022-06-30T17:36:22+05:30 IST