రెచ్చగొట్టాలని చూస్తే సహించం

ABN , First Publish Date - 2021-06-18T09:28:29+05:30 IST

ప్రభుత్వం నిర్బంధాలు, ప్రలోభాలతో రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

రెచ్చగొట్టాలని చూస్తే సహించం

  • అహంకారానికి ప్రజలు ఘోరీ కడతారు
  • 2023లో కేసీఆర్‌ను గద్దె దింపుతాం
  • హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే : మాజీ మంత్రి ఈటల
  • బీజేపీలో చేరాక నియోజకవర్గానికి రాక
  • ఘన స్వాగతం.. వెయ్యి బైక్‌లతో ర్యాలీ


జమ్మికుంట రూరల్‌, హుజూరాబాద్‌, సిద్దిపేట అర్బన్‌, భీమదేవరపల్లి, జూన్‌ 17: ప్రభుత్వం నిర్బంధాలు, ప్రలోభాలతో రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దబాయింపులు, అధికార దుర్వినియోగం ఇలానే కొనసాగిస్తే తమ ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. అహంకారానికి హుజూరాబాద్‌ ప్రజలు రాబోయే రోజుల్లో ఘోరీ కట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. తన మద్దతుదారులను ఇంటెలిజెన్స్‌ అధికారులు వేధిస్తున్నారని, వారిని బెదిరిస్తే ఖబడ్దార్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల గురువారం తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఉదయం 9 గంటలకు శామీర్‌పేట నుంచి బయల్దేరి హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లి చేరుకున్న ఆయనకు మహిళలు మంగళహారతులిచ్చారు.   హుజూరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద  నివాళులర్పించాక జమ్మికుంట చేరుకోగా.. బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో వెయ్యి బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.  


వారిలో భయం కనిపిస్తోంది..

ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు మండలానికి ఒక మంత్రి, గ్రామాలకు ఎమ్మెల్యేను ఇన్‌చార్జులుగా నియమించడాన్ని చూస్తే ప్రభుత్వంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఈటల అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారం, మార్గమధ్యంలోని సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడకు వచ్చి ప్రగతిభవన్‌ రాసిచ్చిన స్ర్కిప్టులు మాట్లాడితే ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదన్నారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రిహార్సల్‌, దిక్సూచిలా ఉంటుందని ఈటల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దింపుతామన్నారు. నాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా ఎట్లా అండగా నిలిచిందో, ఆ జిల్లాకు హుజూరాబాద్‌ ఎలాగైతే ఊపిరి పోసిందో, నేడు మలి దశ ఉద్యమానికి, ఆత్మగౌరవ పోరాటానికి, రాచరికాన్ని బొందపెట్టడానికి కేంద్ర బిందువుగా మారుతుందని, మళ్లీ పొలికేక వేస్తుందన్నారు. ఆత్మ గౌరవ పోరాటానికి హుజూరాబాద్‌ వేదిక కాబోతున్నదన్నారు. రేపటినుంచి ఇంటింటికీ, గడప గడపకు వెళ్తానని తెలిపారు.


ఉప ఎన్నికలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

హూజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరేస్తామని ఈటల అన్నారు. ఉప ఎన్నిక అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సీనియర్‌ నాయకులందరినీ కలుపుకొని వాడవాడలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తానన్నారు. మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాగా, పర్యటనలో ఈటల ప్రయాణిస్తున్న కారును దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డ్రైవ్‌ చేశారు.  హుజూరాబాద్‌లో ఆట మొదలైందని.. ఇది వేటగా మారబోతోందని రఘునందన్‌రావు అన్నారు. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి అభివృద్ధి పేరిట నిధులు ఇస్తున్నారని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి నియోజకవర్గానికి రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాకలో తమ కార్యకర్తలు కొట్లాడారో, హుజూరాబాద్‌లో అదే మాదిరిగా ఇక్కడా జరుగబోతోందన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా, రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం తెచ్చి ఇంటింటికీ రూ.లక్ష పంచినా ఓట్లు బీజేపీకే పడతాయన్నారు.  కార్యక్రమాల్లో మాజీ ఎంపీ వివేక్‌, శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T09:28:29+05:30 IST