ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో టోకరా

ABN , First Publish Date - 2021-12-05T06:39:18+05:30 IST

ప్రస్తుతం నిరుద్యోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఉపాధి దొరకడం గగనమవుతోంది. నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యో గం కోసం తంటాలు పడుతున్నారు.

ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో టోకరా

పక్కా మోసం!

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు 

మోసగాళ్లలో ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా..

అనంతపురం క్రైం, డిసెంబరు 4: ప్రస్తుతం నిరుద్యోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఉపాధి దొరకడం గగనమవుతోంది. నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యో గం కోసం తంటాలు పడుతున్నారు. వారి పరిస్థితిని ఆసరా చేసుకుని కొందరు దుండగులు ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు. జిల్లాలో బాధితులు వందల సంఖ్యలో ఉన్నారంటే మోసగాళ్లు ఏ స్థాయిలో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి  డబ్బు వసూలు చేసుకుని కొందరు ఉడాయించగా.. మరికొందరు తప్పించుకు తిరుగుతుండటం జిల్లాలోని బాధితులను కలవర పెడుతోంది.


  ఆశతో లక్షలు వెచ్చించి...

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ జీవితం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్ర మంలో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, తదితర ప్రైవేట్‌ ఉద్యోగమైనా సరే ప్రస్తుత నేపథ్యంలో డిమాండ్‌ పెరుగుతోంది. అక్కడక్కడ ఈ తరహా ఉద్యోగులు భర్తీ చేస్తుండటంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు అవినీతి ఉద్యోగులు తమదైన శైలిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు తీసుకుని, మోసం చేసిన ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను నిరుద్యోగులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల చేతిలో మోసపోయిన బాధితులు కూడా జిల్లాలో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు కాకపోతే భవిష్యతలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశతో సదరు ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేయకుండా బాధితులు మిన్నకుండిపోతున్నారు.


డబ్బుతో ఉడాయింపు

బాధితులు ఫిర్యాదు చేయగానే పోలీసులు ఆశించిన స్థాయిలో మోసగాళ్లపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇ లాంటి మోసాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది జనవరిలో హోంగార్డు ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసం చేసిందని నార్పల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసి, ముగ్గురిని అరెస్ట్‌ చేసి చేతులు దులుపు కుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మోసగాళ్లపైనా  ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకున్న పాపానపోలేదని తెలుస్తోంది. తరచూ పోలీసు స్పందనలో వచ్చిన ఫిర్యాదులు.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో..? పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. నిరుద్యోగులతో ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసుకుని కొందరు ఉడాయిస్తుంటే మరికొందరు తప్పించుకు తిరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. మోసం చేస్తున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని బాధిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.


 వందల సంఖ్యలో బాధితులు

జిల్లాలో వివిధ ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య వందల్లో ఉన్నట్లు  తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినవి మాత్రమే ఈ ఏడాదిలోనే సుమారు 42  కేసులున్నట్లు సమాచారం. బాధితులు కూడా ఏమాత్రం అలోచన చేయకుండా ఉద్యోగం అనే ఆశతో లక్షలు చెల్లిస్తున్నారు. కొందరైతే తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మోసగాళ్లకు లక్షలు చెల్లిస్తుండటం గమనార్హం.


 ఉద్యోగాల్లేకనే అవస్థలు

ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో ఉన్నత చదువులు చదివినా ఖాళీగా ఉండాల్సిన దుస్థితి నిరుద్యోగులకు ఏర్పడింది. ఈ క్రమంలో ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అన్న అభిప్రాయంతో ఏమాత్రం ఆలోచన చేయకుండా దళారులను ఆశ్రయించి, మోసపోతున్నారు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఉద్యోగాలకు  నోటిఫికేషన విడుదల చేస్తే పదుల సంఖ్య లేదా.. వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉంటే నిరుద్యోగులు లక్షల్లో పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా భావించి, కొందరు దళారులు బరితెగించి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్షల్లో బురిడీ కొట్టిస్తున్నారు.


ఉద్యోగాల పేరుతో ఎర

కొందరు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడి యాల ద్వారా పరిచయం చేసుకుని మాయమాటలతో  వారు విద్యార్హతలు  తెలుసుకుని స్థాయికి సరిపడు ఉద్యో గాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేస్తున్నారు. ముఖ పరిచయం కూడా లేకుండా కొందరు నిరుద్యోగులు రూ.లక్షలు చెల్లించి మోసపోవడం గమనార్హం. బంధువుల ద్వారా పరిచయం కలిగిన వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తా మని టోకరా వేయడం మరింత కలవరపెడుతోంది. ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కొంత పలుకుబడి ఉన్నవాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వా రా తెలిసింది.


జిల్లాలో కొన్ని కేసులు ఇలా...

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్‌ ఫేస్‌బుక్‌లో అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థినికి రెండేళ్ల కిందట పరిచమయ్యాడు. ఫోనలోనే మాయమాటలతో నమ్మించి, విడతల వారీగా రూ.20లక్షలు అతడి అకౌంట్‌కు ఫోనపే, గూగుల్‌పే ద్వారా ట్రాన్సఫర్‌ చేయించుకున్నాడు. తర్వాత ఫోన కూడా ఎత్తకపోవడంతో మోసపోయానని భావించిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఏడాది జూలై 19న అనంతపురం రూరల్‌ పోలీ సులకు ఫిర్యాదు చేసింది.

- నగరానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకులో ఉద్యోగం ఇప్పి స్తానని నమ్మబలికి ఓ యువతి నుంచి రూ.3.75 లక్షలు తీసుకున్నాడు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు వెనక్కివ్వమని ఆమె నిలదీసింది. ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి, ఈ ఏడాది జూనలో నగరంలోని త్రీటౌన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- నగరంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన ఓ మహిళకు కియ కంపెనీలో మేనేజర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని పుట్టప ర్తికి చెందిన పుష్పరాజ్‌ మోసం చేశాడు. రూ.2లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్సగా రూ.1.10లక్షలు తీసుకున్నాడు. తర్వాత ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధిత మహిళ ఈ ఏడాది జూనలో పోలీసు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బంధువుల ద్వారా పరిచయమైన వ్యక్తి కావడంతో ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మి డబ్బు ఇచ్చామని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

- నంద్యాలకు చెందిన ఓ ఎయిడెడ్‌ కళాశాలలో ఉద్యో గం ఇప్పిస్తానని అక్కడి వ్యక్తి రూ.3లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని కదిరి సబ్‌ డివిజన పరిధిలోని పట్నం గ్రామానికి చెందిన నూరుల్లా ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసు స్పందనలో ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తికి కూడా గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.50లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

- రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి తన వద్ద రూ.3లక్షలు తీసుకుని మోసం చేశాడని రొళ్లకు చెందిన సూర్యచంద్ర గతనెల 28న పోలీసు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన మరో యు వకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని స్పందనలో ఫిర్యాదు చేశారు.

- హైదరాబాద్‌కు చెందిన అఖిల్‌చౌదరి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి తనతోపాటు ఇద్దరి స్నేహితులతో కలిపి రూ.22 లక్షలు తీసుకున్నాడని నగరంలోని నాలుగో రోడ్డుకు చెందిన నిఖిల్‌కృష్ణ ఈనెల 9న పోలీసు స్పందనలో ఫిర్యాదు చేశాడు.

- హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ము గ్గురు సభ్యులతో కూడిన ఓ ముఠాను ఇటుకపల్లి పోలీ సులు ఈ ఏడాది జనవరి 22న అరెస్ట్‌ చేశారు. అనంతతో పాటు కర్నూలు, కడప జిల్లాలకు చెందిన సుమారు 20 మంది బాధితులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.36 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పి ంచకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఈ ఏడాది జనవరిలో కొందరు బాధితులు జిల్లాలోని నార్పల పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దీంతో హోంగార్డు ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన విషయం వెలుగు చేసింది. ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో వెలుగుచూడని ఇలాంటి మోసాలు కోకొల్లలు.

Updated Date - 2021-12-05T06:39:18+05:30 IST