మూత్రం.. ముదురు పసుపు రంగులో ఉంటే..

ABN , First Publish Date - 2020-06-01T20:35:42+05:30 IST

మన శరీర బరువులో అరవై శాతం పైన నీరే ఉంటుంది. అనేక జీవక్రియలకి నీరు అత్యవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేయడానికీ నీరు అవసరం. తగు మోతాదులో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.

మూత్రం.. ముదురు పసుపు రంగులో ఉంటే..

ఆంధ్రజ్యోతి (01-06-2020): 

ప్రశ్న: రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలేమిటి?

- సుదర్శన్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మన శరీర బరువులో అరవై శాతం పైన నీరే ఉంటుంది. అనేక జీవక్రియలకి నీరు అత్యవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేయడానికీ నీరు అవసరం. తగు మోతాదులో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. రోజుకు ఎనిమిది గ్లాసులు లేదా రెండు లీటర్ల నీరు తీసుకుంటే చాలా వరకు మన శరీర నీటి అవసరం తీర్చినట్టే. అయితే, ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ, శరీర తత్త్వం, ఆటలాడడం లేదా వ్యాయామం చేయడం తదితరాల వల్ల రోజుకు ఎన్ని నీళ్లు అవసరం అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎండ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. చెమట బాగా పట్టేవారు, ఆటలాడేవారు మామూలుకన్నా అధికంగా మంచి నీళ్లు తాగాలి. అలవాటుగా రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగితే ఎంతో ఉపయోగం. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాసు నీళ్లు తాగడం వల్ల కెలోరీలను పరిమితిలో ఉంచవచ్చు. తగినన్ని నీళ్లు తాగడం వల్ల వ్యర్ధాలు బయటకి పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం, కిడ్నీల్లో రాళ్లు రావడం లాంటివి నివారించవచ్చు. మూత్రం రంగును బట్టి మనం నీరు తగినంతగా తాగుతున్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. మూత్రం లేత పసుపు రంగు లేదా నీటి రంగుకు దగ్గరగా ఉన్నట్టయితే తగినంత నీరు తాగుతున్నట్టు. ముదురు పసుపు రంగులో ఉంటే నీరు సరిపోనట్టు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-01T20:35:42+05:30 IST