SCO summit: యుద్ధం ఆపాలని పుతిన్‌కు మోదీ సూచన.. ఆపాలనుకుంటున్నామన్న పుతిన్

ABN , First Publish Date - 2022-09-17T01:19:04+05:30 IST

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు.

SCO summit: యుద్ధం ఆపాలని పుతిన్‌కు మోదీ సూచన.. ఆపాలనుకుంటున్నామన్న పుతిన్

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  (Narendra Modi) రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ఆపివేయాలని కోరారు. యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు మోదీ పుతిన్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇద్దరు నేతలూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.  





యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై స్పందించిన పుతిన్ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధం ఆపాలనుకుంటున్నామని, సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని చెప్పారు. సంక్షోభ వేళ భారత్ ప్రతిస్పందనను తాము అర్థం చేసుకోగలమని పుతిన్ చెప్పారు. ఈ సందర్భంగా పుతిన్... మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17 మోదీ పుట్టినరోజు. చర్చల్లో భాగంగా రష్యాలో పర్యటించాలని పుతిన్ .... మోదీకి ఆహ్వానం పలికారు. 




షాంఘై సహకార సంఘంలో ప్రస్తుతం 8 సభ్య దేశాలుగా ఉన్నాయి. చైనా, భారత్, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. అర్మేనియా, అజెర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ చర్చల భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. 1996లో షాంఘై సహకార సంఘం ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్నది 22వ సదస్సు. 

Updated Date - 2022-09-17T01:19:04+05:30 IST