నేటినుంచి అసెంబ్లీ

ABN , First Publish Date - 2022-01-05T13:47:11+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు చేపాక్‌ కలైవానర్‌ అరంగం మూడో అంతస్థులో కొఇడ్‌ నిబంధనల నడుమ ఈ సమావేశాలు

నేటినుంచి అసెంబ్లీ

- గవర్నర్‌ ప్రసంగంతో  ప్రారంభం

- కొత్త పథకాలపై ప్రకటన ?


చెన్నై: రాష్ట్ర శాసనసభ సమావేశాలు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు చేపాక్‌ కలైవానర్‌ అరంగం మూడో అంతస్థులో కొఇడ్‌ నిబంధనల నడుమ ఈ సమావేశాలు జరుగనున్నాయి. తొలుత సెయింట్‌ జార్జి కోటలోనే ఈ సమావేశాలు జరపాలని అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి. సమావే శాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా కెమెరాలను కూడా సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతుండటంతో సమావేశాల వేదికను కలైవానర్‌ అరంగానికి మార్చారు. ఈ యేడాది తొలి సమావేశాలు కావడంతో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగించనున్నారు. శాసనసభ సంప్ర దాయం మేరకు సభాపతి అప్పావు, శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌ గవర్నర్‌కి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి అసెంబ్లీ హాలులోకి తోడ్కొని వెళతారు. 

సీఎం స్టాలిన్‌, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సహా శాసనసభ్యులంతా గవర్నర్‌కు స్వాగతం పలుకనున్నారు. స్పీకర్‌ పోడియం వద్దనున్న కుర్చీలో గవర్నర్‌ ఆశీనులవుతారు. తొలుత తమిళ్‌తాయ్‌ ప్రార్థన గీతం ఆలాపిస్తారు. ఆ తర్వాత గవర్నర్‌ సభ్యులకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి తన ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో డీఎంకే ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఆయన ప్రసంగ పాఠం తమిళ అనువాదాన్ని సభాపతి అప్పావు చదివి వినిపిస్తారు. దీంతో తొలిరోజు సమావేశం పూర్తవుతుంది. 


మూడు నాలుగు రోజులే.. : బుధవారం మధ్యాహ్నం సభాపతి అప్పావు అధ్యక్షతన సభావ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం స్టాలిన్‌, ప్రతిపక్షనేత ఎడప్పాడి, ఇతర పార్టీల నేతలు పాల్గొంటారు, శాసనసభ సమావేశాలను ఎన్నిరోజులపాటు జరపాలన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలు మూడు నాలుగు రోజులపాటే జరిగే అవకాశాలున్నాయి. గురువారం ఉదయం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేతీర్మానంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభలో చర్చ కొనసాగుతుంది. ప్రతిరోజూ సభలో తొలుత ప్రశ్నోత్తరాల సమయం కూడా ఉంటుందని సభాపతి అప్పావు ఇదివరకే ప్రకటించారు. చివరి రోజు సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలకు బదులిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగించడంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఇదిలా వుండగా ఉచిత బియ్యం రేషన్‌ కార్డుదారులకు నగదు కానుకలు ప్రకటించకపోవడం, కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగటం, మాజీ మంత్రులపై అక్రమార్జన కేసులు, ఏసీబీ తనిఖీలు, అమ్మా క్లినిక్‌లను ఆకస్మికంగా మూసివేయడం తదితర అంశాలపై అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తలపోస్తోంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది.

Updated Date - 2022-01-05T13:47:11+05:30 IST