నేటినుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు

ABN , First Publish Date - 2021-01-21T06:17:44+05:30 IST

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటినుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు
ఉత్సవాలకు సిద్ధమైన జాన్‌పహాడ్ దర్గా

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు 

మూడు రోజులపాటు ఉత్సవాలు 

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

పాలకవీడు, జనవరి 20: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డ్డి వక్ఫ్‌బోర్డ్‌ అధికారులు, కాంట్రాక్టర్లను ఇటీవల హెచ్చరించారు. దీంతో ఈ సారి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో జరిగే ఉత్సవాలకోసం వక్ఫ్‌బోర్డు నుంచి రూ.8.50 లక్షలు మాత్రమే మంజూరు కావడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉర్సుకు ఈసారి భారీగా భక్తులు రానుండడంతో పోలీ్‌సశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బారీకేడ్లు ఏర్పాటు చేసి, పార్కింగ్‌ స్థలాల్లోనే ప్రైవేటు వాహనాలను నిలిపివేయనున్నారు. గంధం ఊరేగింపు రోజు ద్విచక్రవాహనాలను కూడా అనుమతించరు. ఉన్నతాధికారులు, వీఐపీలను మాత్రమే అనుమతించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాన్‌పహాడ్‌ దర్గాకు ఇరువైపుల, దామరచర్ల వైపు, నేరేడుచర్ల వైపు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. 


నిరంతరాయంగా తాగునీటి సరఫరా

నిరంతరాయంగా తాగునీటిని అందించేందుకు దక్కన్‌ సిమెంటు యాజమాన్యం ముందుకు వచ్చింది. ముందు రోజు నుంచే ప్లాస్టిక్‌ డ్రమ్ములు దర్గా పరిసరాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసి వాటిమీద తెల్లని వస్త్రాలు కప్పి, వచ్చే భక్తులకు మంచి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సరిపడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశాల మేరకు 40 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దర్గా పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్రత చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. పరిసరాల్లో రెండు చోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన మందులు సరఫరా చేయనున్నారు. 


దూపహాడ్‌లో మహబూబా దర్గా జాతర

పెన్‌పహాడ్‌ మండలంలోని దూపహాడ్‌ గ్రామంలో కొలుపుదీరిన మహబూబా దర్గా జాతర 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడురోజులపాటు జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చిన్నవెంకటేశం-లక్ష్మమ్మ దంపతు లు తెలిపారు. 

Updated Date - 2021-01-21T06:17:44+05:30 IST