నేడు భారత్‌ బయోటెక్‌కు ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-11-28T07:37:26+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 24న సమీక్షించిన

నేడు భారత్‌ బయోటెక్‌కు ప్రధాని మోదీ

3.45 గంటలకు హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు 

నేరుగా జినోమ్‌ వ్యాలీలోని వ్యాక్సిన్‌ కంపెనీకి

దాదాపు గంటసేపు శాస్త్రవేత్తలతో చర్చ

ముఖ్యమంత్రి వెంట రానవసరం లేదు

ప్రధాని పర్యటనలో సీఎంకు దక్కని అనుమతి

 

మేడ్చల్‌/న్యూఢిల్లీ,  నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 24న సమీక్షించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల సందర్శనకు సన్నద్ధ్ధమయ్యారు. నేరుగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్లలోకి వెళ్లి, పరిశోధనల్లో తలమునకలైన శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడి.. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియల్లో ఎదురయ్యే సవాళ్ల గురించి సమీక్షించేందుకు ఆయన సిద్ధమయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అహ్మదాబాద్‌ (గుజరాత్‌), పుణె (మహారాష్ట్ర), హైదరాబాద్‌లలో మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు.


ఇందులో భాగంగా భారత వాయుసేన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.45 గంటలకు శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌  వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు ప్రధాని చేరుకుంటారు. ఈసందర్భంగా అక్కడ నిర్వహించే ఒక కార్యక్రమంలో దాదాపు గంటసేపు పాల్గొంటారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సంయుక్త భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేస్తున్న కోవ్యాక్సిన్‌, దానితో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగ పరీక్షల గురించి ముఖ్య శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రంకల్లా పర్యటనను ముగించుకొని ఢిల్లీకి మోదీ తిరుగు పయనమవుతారు.


ప్రధాని పర్యటన నేపథ్యంలో తుర్కపల్లిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్‌ బయోటెక్‌ను ప్రధాని మోదీ శనివారం సందర్శించనున్న విషయాన్ని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ధ్రువీకరించారు. ఈమేరకు వివరాలతో ప్రధానమంత్రి కార్యాలయం కూడా శుక్రవారం ట్వీట్‌ చేసింది. శనివారం నాటి ప్రధాని పర్యటన ఉదయం 9.30 గంటలకు అహ్మదాబాద్‌ నగరంలోని జైడస్‌ క్యాడిలా ఫార్మా కంపెనీ సందర్శనతో మొదలవుతుంది.


అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటల కల్లా పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.  మరోవైపు, భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్రయోగ పరీక్షల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని సోలా సివిల్‌ హాస్పిటల్‌లో ఓ మహిళ సహా మొత్తం ఐదుగురు ఆరోగ్యవంతులైన వలంటీర్లకు కోవ్యాక్సిన్‌ను అందించింది. అయితే ఆరోగ్యపరమైన దుష్ప్రభావాల గురించి ఇప్పటివరకు వలంటీర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని సీనియర్‌ వైద్యుడు పారుల్‌ భట్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-11-28T07:37:26+05:30 IST