నేడే సాగర సమరం

ABN , First Publish Date - 2021-04-17T06:24:24+05:30 IST

ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు నేడే పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థుల విమర్శ, ప్రతివిమర్శలు, పార్టీల ఎత్తుకు పైఎత్తులు ముగిశాయి. నియోజకవర్గ ప్రజల మనోభావం ఇక ఓట్లరూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

నేడే సాగర సమరం
నల్లగొండ జిల్లా హాలియా పరిధిలోని అనుములలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బంది

ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

346 పోలింగ్‌ కేంద్రాలకు 5,535 మంది సిబ్బంది

2390 మంది పోలీస్‌ సిబ్బంది : ఎస్పీ రంగనాథ్‌

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : ఆర్‌వో రోహిత్‌సింగ్‌

ప్రతి ఓటరుకు పేపర్‌గ్లవ్స్‌, అందుబాటులో శానిటైజర్లు, మాస్క్‌, థర్మల్‌ స్కానర్‌


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు నేడే పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థుల విమర్శ, ప్రతివిమర్శలు, పార్టీల ఎత్తుకు పైఎత్తులు ముగిశాయి. నియోజకవర్గ ప్రజల మనోభావం ఇక ఓట్లరూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా మరో రెండు గంటలు పొడిగించారు. కరోనా నేపథ్యంలో క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.


నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కరోనా నిబంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయంకోసం హోరాహరీగా తలపడిన మూడు ప్రధాన పార్టీలు చివరి రెండు రోజులు పలు మార్గాల్లో ఓటర్లను ప్రభావితం చేశాయి. పోలింగ్‌ ముగిసే వరకు పోరాటం ఆపేది లేదంటున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,300 కాగా, ఇందులో పురుషులు 1,09,228 కాగా మహిళలు 1,11,072 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే 1,844 మంది మహిళా ఓటర్లే నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రతీ ఓటరు మాస్క్‌తోనే పోలింగ్‌ కేంద్రానికి రావాలి, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి ఓటరుకు పేపర్‌ గ్లవ్స్‌ ఇస్తున్నారు. ఈవీఎంపై మీట నొక్కిన తర్వాత ఆ గ్లవ్స్‌ను అక్కడే ఓ బుట్టలో వేసేలా ఏర్పాట్లుచేశారు. 8,151 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. కొవిడ్‌ రోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటు వేయనున్నారు. ఇదిలా ఉంటే కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై ఈనెల 14వ తేదీ వరకు 116 కేసులు నమోదుచేశారు. రూ.45 లక్షల నగదు, రూ.46 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్‌చేశారు. 362 మందిపై మిస్‌ బిహేవియర్‌ కేసు నమోదుచేశారు. నియోజకవర్గంలో పనిచేసే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు 17న సెలవు ప్రకటించారు. మొత్తం 5,535 మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. 3,145 మంది రెవె న్యూ, ఇతర శాఖల పోలింగ్‌ సిబ్బంది 2,390 మంది ఉన్నారు. 


అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాల్లో 108 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి వాటిపై పటిష్ఠ నిఘాపెట్టారు. పోలీస్‌ సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను దింపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కవర్‌ చేస్తున్నారు. 


ఏ చిన్న ఘటన జరిగినా నిమిషాల్లో చేరుకుంటాం : ఏవీ రంగనాథ్‌, ఎస్పీ, నల్లగొండ జిల్లా 

సాగర్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎక్కడ, ఏ చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో చేరుకునేలా స్ట్రయికింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేశాం. పోలింగ్‌ కేంద్రాలను సైతం సందర్శించాం. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలకు 108 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఈ కేంద్రాల వద్ద కనీసం 15 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. ప్రతి కేంద్రంలో పోలింగ్‌ సరళిపై వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నాం. మొత్తం 4వేల మంది సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. పోలింగ్‌ ముగిసే వరకు డబ్బు, మద్యం పంపిణీలాంటి అంశాలపై తనిఖీలు కొనసాగుతుతాయి. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. శనివారం సాయంత్రం ఏడు గంటలకు పోలింగ్‌ ముగిశాక రిటర్నింగ్‌ అధికారి అనుమతితో ఈవీఎంలను పారామిలటరీ బలగాల భద్రత మధ్య నల్లగొండలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తాం. కౌంటింగ్‌ వరకు పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరుస్తాం.


కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు : రోహిత్‌ సింగ్‌, రిటర్నింగ్‌ అధికారి

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఓటర్లకు ఎండ తగలకుండా శామియానాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల వరకు ఏ పార్టీ టెంట్లు వేయకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. ఓటరు స్లిప్పులు సైతం పంచకూడదు. ఒకవేళ ఎవరికైనా ఓటరు స్లిప్‌లు అందకుంటే ఎన్నికల సిబ్బందిని అడిగి తీసుకోవాలి. నియోజకవర్గంలోని ఫంక్షన్‌హాళ్లు, లాడ్జీలు, హోటళ్లు ఖాళీ చేయాలి. నిబంధనలకు విరుద్దంగా స్థానికేతరులు నియోజకవర్గంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తాం. పోటీలో ఉన్న 41 మంది అభ్యర్థులు ఎంత ఖర్చు చేశారో. వారికి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చాం. నిబంధనల ప్రకారం రూ.30.8లక్షలకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి.


ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం : జేసీ చంద్రశేఖర్‌

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. హాలియాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గవ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించామన్నారు. మాస్క్‌ ఉన్న వారినే ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆయనవెంట ఆర్డీవో జగదీ్‌షరెడ్డి, రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌, అధికారులు ఉన్నారు. 



కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక సేవలు :  కొండల్‌రావు, జిల్లా వైద్యాధికారి, నల్లగొండ 

కొవిడ్‌, వేసవి తీవ్రత నేపథ్యంలో నోడల్‌ అధికారిగా నియమించారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో 710మంది వరకు మా సిబ్బంది సేవలు అందించనున్నారు. ఎవరైనా ఓటరు మాస్క్‌ లేకుండా ఓటింగ్‌కు వస్తే వారి కోసం ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద 100 మాస్క్‌లు, శానిటైజర్లు, ప్రాథమిక వైద్యం ఏర్పాటు చేశాం. ప్రతి ఓటరుకు పేపర్‌ గ్లౌస్‌ అందుబాటులో ఉంచాం. ఇవి ఎన్నికల కమిషన్‌ సరఫరా చేసింది.  


పోలింగ్‌ ఇలా

మొత్తం ఓటర్లు: 2,20,300

పురుషులు: 1,09,228

స్ర్తీలు : 1,11,072

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 346

పోటీలో ఉన్న అభ్యర్థులు:41

పోలింగ్‌ సిబ్బంది: 1622

మైక్రో అబ్జర్వర్లు: 130

వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది : 219

సెక్టార్‌, రూట్‌ అధికారులు: 44 మంది 

బూత్‌ లెవర్‌ అధికారులు: 293

ఆరోగ్య సిబ్బంది : 710

పోలింగ్‌ సిబ్బంది: 3,145

మొత్తం పాల్గొనే సిబ్బంది : 5535

పోస్టల్‌ బ్యాలెట్‌ : 8151 

స్థానిక పోలీసులు : 1,050

ఇతర జిల్లాల నుంచి: 1,000

కేంద్ర బలగాలు: మూడు కంపెనీలు (290 మంది)

12వ బెటాలియన్‌ నుంచి: 50 మంది

మొత్తం పోలీసు సిబ్బంది : 2,390

రిజర్వుడ్‌ ఈవీఎంలు 162

వీవీపీఏటీఎస్‌ 346  

రిజర్వుడ్‌ వీవీపీఏటీఎస్‌ 112

జనరల్‌ అబ్జర్వర్‌ 1

ఎక్స్‌పెండేచర్‌ అబ్జర్వర్‌ 1

పోలీస్‌ అబ్జర్వర్‌ 1

మైక్రో అబ్జర్వర్లు 128

ప్రశాంత పోలింగ్‌ కేంద్రాలు 238

సమస్యాత్మక పోలింగ్‌ 108

ఇప్పటి వరకు సీజ్‌ చేసిన డబ్బు రూ.45 లక్షలు, రూ.46 లక్షల విలువైన మద్యం 


Updated Date - 2021-04-17T06:24:24+05:30 IST