నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం

ABN , First Publish Date - 2022-04-14T13:18:59+05:30 IST

చేపల సంతానోత్పత్తి పెంపొందించే చర్యల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం అమలులోకి రానుంది. ఇది జూన్‌ నెల 14వ తేదీ వరకు అమల్లో

నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం

                             - జూన్‌ 14వ తేదీ వరకు అమలు 


అడయార్‌(చెన్నై): చేపల సంతానోత్పత్తి పెంపొందించే చర్యల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం అమలులోకి రానుంది. ఇది జూన్‌ నెల 14వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. తిరువళ్ళూరు జిల్లా నుంచి కన్నియాకుమారి వరకు కోస్తాతీర ప్రాంతంలో లక్షలాది మంది జాలర్లు చేపలవేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, చేపల పునరుత్పత్తి కోసం ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధించారు. ఈ సమయంలో జీవనోపాధి కోల్పోయే జాలర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుంటుంది. ప్రతి యేటా ఈ చేపల వేట నిషేధాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా  గురు వారం అర్థరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. దీంతో తిరువళ్ళూరు, చెన్నై, కడలూరు, తంజావూరు, నాగపట్టనం, పుదుకోట, రామనాధపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల కోస్తాతీర ప్రాంతాల్లోని జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు. వీరితో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాలకు చెందిన జాలర్లకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ నిషేధం అమల్లో ఉన్న రోజులు సాధారణ వలలు ఉపయోగించి చేపల వేటాడడానికి వీల్లేదు. అందువల్ల కాశిమేడు ఫిష్షింగ్‌ హార్బరులో 1200 షిషింగ్‌ బోట్లు తీరానికే పరిమితంకానున్నాయి. అదేసమయంలో ఈ 61 రోజుల నిషేధ కాలంలో జాలర్లు పడవలకు, వలలకు మరమ్మతులు చేసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. అయితే, కన్నియాకుమారి  జిల్లా చిన్నముట్టం ఫిషింగ్‌ హార్బరు పరిధిలోని జాలర్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ జిల్లాలో మిగిలిన ప్రాంతాల జాలర్లకు ఇది వర్తించదు. మరోవైపు తూత్తుకుడి హార్బరు మరింత లోతు చేసే పనులు జరుగుతుం డడంతో గత రెండు నెలలుగా ఈ ప్రాంత జాలర్లు  చేపల వేటకు వెళ్ళలేదు. 

Updated Date - 2022-04-14T13:18:59+05:30 IST