నేడు మెగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-20T05:21:06+05:30 IST

ఆదివారం 1.25 లక్షల మందికి టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకోసం జిల్లాలో 529 సెంటర్ల ద్వారా కొవిడ్‌ టీకా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.

నేడు మెగా వ్యాక్సినేషన్‌
ఏలూరులో సీవీసీని సందర్శిస్తున్న కుటుంబ సంక్షేమ శాఖ జేడీ డాక్టర్‌ జయశ్రీ, వైద్యాధికారులు

1.25 లక్షల మందికి టీకాలు

529 సెంటర్లలో ప్రత్యేక డ్రైవ్‌ : కలెక్టర్‌ కార్తికేయ 

ఏలూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఆదివారం 1.25 లక్షల మందికి టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకోసం జిల్లాలో 529 సెంటర్ల ద్వారా కొవిడ్‌ టీకా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం ఆయన కొవిడ్‌, కర్ఫ్యూ అమలు, హౌసింగ్‌ అంశాలపై వీడియో సమీక్ష నిర్వహించారు. టీకా వేయించుకోవాల్సిన తల్లులు ఇంకా 50 వేల మంది ఉన్నారని వారి ఇంటికి వెళ్లి సమాచారం ఇచ్చి టీకా వేయాలని చెప్పారు. ప్రస్తుతం లక్షా 70 వేల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డివిజన్లవారీగా ఏలూరు– 196, నరసాపురం– 140, కొవ్వూరు– 132, జంగారెడ్డిగూడె, కుక్కునూరు– 61 చొప్పున టీకా సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ప్రజలు రోడ్ల మీదకు రాకుండా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. జిల్లాలో శుక్రవారం 6,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. శనివారం సాయంత్రం మెగా వ్యాక్సినేషన్‌పై ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో మరోమారు కలెక్టర్‌ సమీక్షించారు.వీసీలో జేసీలు వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లా, సూరజ్‌ ధనుంజయ్‌, డీఎఫ్‌వో యశోదాబాయ్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 నేడు మరో 70 వేల వ్యాక్సిన్ల దిగుమతి

ఏలూరు ఎడ్యుకేషన్‌ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ పరిధిని పెంచారు.ఇప్పటివరకు ఒకే రోజు 60 వేల డోసుల టీకా పంపిణీతో జిల్లా రికార్డుగా ఉండగా ఇప్పుడు దీనికి రెట్టింపు డోసులను పంపిణీ చేసి మెగా రికార్డును స్థాపించనున్నారు. మెగా వ్యాక్సినేషన్‌ పరిశీలనకు రాష్ట్ర అధికారిగా నియమితులైన కుటుంబ సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌(ఎంహెచ్‌ఎన్‌) డాక్టర్‌ జయశ్రీ శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీవీసీలను సందర్శించారు. శనివారం రాత్రికి కొత్తగా మరో 70 వేల కొవిషీల్డ్‌ టీకా నిల్వలు జిల్లాకు దిగుమతి కానున్నట్టు తెలిసింది. కాగా శనివారం ఏలూరులో 522 మంది విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులకు వ్యాక్సిన్‌ వేశారు.

Updated Date - 2021-06-20T05:21:06+05:30 IST