కుంభమేళాపై గందరగోళం

ABN , First Publish Date - 2021-04-17T07:27:55+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై గందరగోళం నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..

కుంభమేళాపై గందరగోళం

నేటితో కుంభమేళా పుణ్యస్నానాల ముగింపు

పుణ్యస్నానాల ముగింపు ప్రకటించిన నిరంజని అఖాడా

ఖండించిన ఇతర అఖాడాలు


డెహ్రాదూన్‌, ఏప్రిల్‌ 16: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై గందరగోళం నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. నిరంజని అఖాడా.. ఇతర అఖాడాలు భిన్న ప్రకటనలు చేయడమే ఇందుకు కారణం. ‘‘కుంభమేళాను శనివారానికి కుదిస్తున్నాం. మా వరకు ఈ నెల 14న షాహీ స్నాన్‌(రాజస్నానం) అయిపోయింది. అఖాడాల సాధువులకు కూడా కరోనా సోకింది. కరోనా పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని నిరంజని అఖాడా పరిషత్‌ కార్యదర్శి రవీంద్ర పురీ ప్రకటించారు. ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. నిరంజని అఖాడా ప్రకటనను ఇతర అఖాడా పరిషత్‌లు ఖండించాయి. ‘‘నిరంజని అఖాడాలు చేసింది క్షమించరాని నేరం. 13 అఖాడా పరిషత్‌ల సమాఖ్యతో చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకునే అధికారం వారికి లేదు. ప్రభుత్వం లేదా మేళా నిర్వాహకులకే కుంభమేళాపై ప్రకటన చేసే హక్కు ఉంటుంది’’ అని నిర్వాణీ అనీ అఖాడా అధ్యక్షుడు మహంత్‌ ధర్మదాస్‌ అన్నారు.


బాబా ఉదాసీన్‌ అఖాడా అధ్యక్షుడు మహంత్‌ మహేశ్వర్‌ దాస్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30 వరకు కుంభమేళా కొనసాగుతుందని, శ్రీరామ నవమి రోజున మూడవ, ఈ నెల 27న బైసాకీ సందర్భంగా నాలుగో షాహీ స్నానం జరిగి తీరుతుందన్నారు. ముహూర్తాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కాగా, దేశంలోని పెద్ద 13 అఖాడాల్లో ఒకటి, మధ్యప్రదేశ్‌కు చెందిన నిర్వాణి అఖాడా అధిపతి కపిల్‌దేవ్‌ దాస్‌(65) ఈ నెల 13న కరోనాతో మృతిచెందారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. కుంభమేళా ప్రారంభం నుంచి మొత్తం 68 మంది సాధువులు కరోనా బారిన పడ్డారు. 

Updated Date - 2021-04-17T07:27:55+05:30 IST